Auto Drivers Sevalo Scheme: ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లోకి నేడు రూ.15,000 జమ: ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ప్రారంభం

Auto Drivers Sevalo Scheme: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు తీపి కబురు అందించింది. ‘ఆటో డ్రైవర్ల సేవలో’ అనే కొత్త పథకం కింద అర్హులైన ప్రతి డ్రైవర్‌కు రూ.15,000 చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు (శనివారం) ఉదయం 11 గంటలకు విజయవాడలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన నేపథ్యంలో, తమకు గిరాకీ తగ్గిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ల విజ్ఞప్తిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వారికి అండగా ఉంటామని అనంతపురం సభలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, దసరా పండుగ సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి ఆమోదముద్ర వేయడం జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,90,669 మంది ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు ఈ పథకానికి అర్హులుగా అధికారులు గుర్తించారు. వీరందరి ఖాతాల్లోకి రూ.15 వేల చొప్పున మొత్తం రూ.436 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది. సొంతంగా వాహనం కలిగి, దానిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు ఈ ఆర్థిక సాయం పెద్ద ఊరటనిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 22,955 మంది డ్రైవర్లు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు.

విజయవాడలోని అజిత్‌సింగ్‌ నగర్‌లో గల మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఈరోజు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్, మంత్రి శ్రీ నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మాధవ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

Chittor Lover's Story: What Exactly Happened | Telugu Rajyam