YS Jagan: మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ.. జగన్ ది తప్పబ్బ..!

YS Jagan: ఏపీలో ఇప్పుడు రాజకీయం మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరు చెప్పి ప్రైవేటీకరణ చేస్తున్నారనే విషయంపైనే ఎక్కువగా నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించడానికి జగన్ వెనుకాడటం లేదు. ఇందులో భాగంగా… తాజాగా వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన రెండు నెల‌ల్లోపు పీపీపీ విధానంలో మెడిక‌ల్ కాలేజీల‌ను తీసుకున్న వారిని జైలుకు పంపుతామ‌ని హెచ్చరించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ.. పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి!

జగన్ అధికారంలోకి వస్తే ఇలా తనకు నచ్చని వారిని జైల్లో పెట్టేస్తారా?

ఒక సారి ఎంపీగా, ఒక సారి ముఖ్యమంత్రిగా, మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి ఆ మాత్రం రాజ్యాంగం, చట్టం తెలియదా?

చంద్రబాబు ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తుంటే.. దానిపై కోటి సంతకాల సేకరణ తరహాలో ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడాలి కానీ ఇవేమి మాటలు?

మంచి మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ.. అందుకే ఈ బెదిరింపులబ్బా అని సమర్థించుకోవాలా?

లేక.. ఎవరు ఏమనుకున్నా, ఎలా అనుకున్నా.. ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను అడ్డుకోవడం కోసం తాను ఎంతకైనా తెగిస్తానని చెప్పడంగా భావించాలా?

YS Jagan

ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ అంశం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్. అంతేకాదు సుమా.. రాబోయే రాజకీయాల్లో ఇది కీలక భూమిక పోషించబోతోందని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే ఆ అంశంపై టీడీపీ, వైసీపీ మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో.. తాము అధికారంలోకి వ‌స్తే, పీపీపీ విధానంలో చేసుకున్న ఒప్పందాల్ని ర‌ద్దు చేస్తామ‌ని నవంబర్ లోనే చెప్పారు!

అనంతరం కోటి సంతకాల సేకరణ చేపట్టారు. దీనికి ప్రజల నుంచి ఊహించని స్థాయిలో అన్నట్లుగా మద్దతు వచ్చింది. కోటీ నాలుగు లక్షల పై చిలుకు సంతకాల ప్రతులను గవర్నర్ కు అందజేశారు. ఈ క్రమంలో డిసెంబర్ లో జగన్ వార్నింగ్స్ మరింత హీటెక్కాయి. ఈ క్రమంలోనే తాజాగా… వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన రెండు నెల‌ల్లోపు పీపీపీ విధానంలో మెడిక‌ల్ కాలేజీల‌ను తీసుకున్న వారిని జైలుకు పంపుతామని హెచ్చరించారు.

దీంతో.. జగన్ పై ఓ వర్గం మీడియా, పలువురు విశ్లేషకులు, ఈ గ్యాప్ లో పలువురు స్వయంప్రకటిత మేధావులూ విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలానే మాట్లాడోచ్చా..? ఆయనకు చట్టాలపై అవగాహన లేదా? ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి ఎలాంటి సంకేతాలు పంపుతున్నాయి? వంటి వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ సమయంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ లైన్ లోకి వచ్చారు. ధమ్ముంటే తనను అరెస్ట్ చేయమని సవాల్ చేశారు!

అక్కడితో ఆగని ఆయన.. తన వెంట్రుక కూడా పీకలేరు అనే స్థాయిలో శృతిమించారు! దీనిపై స్పందించిన పేర్ని నాని.. శివుడి మేడలోని టెంపరరీగా ఉన్న బురదపాము, గరుత్మంతుడంతుడిని చూసి బిల్డప్ ఇచ్చిన కథను గుర్తుకు తెచ్చారు. ఆయనను పసుపు రంగు కమలం పువ్వుగా అభివర్ణించారు. కాస్త వెనుకా ముందూ చూసుకుని మాట్లాడమని హితవు పలికారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంట్రుకలు పీకుతామో లేదో నువ్వే చూస్తావుగా అంటూ తనదైన శైలిలో స్పందించారు.

ఈ నేపథ్యంలో పలువురు విశ్లేషకుల అభిప్రాయం మరోలా ఉంది. అదేమిటంటే.. ఏపీలో పేదల కోసం తెచ్చిన, నిర్మాణాలు మొదలుపెట్టిన, ఇప్పటికే పూర్తి చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం అయిపోవడాన్ని జగన్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని, వాటిని ఆపడానికి, అడ్డుకోవడానికి ఎంతకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను అనే సంకేతాలు అందరికీ ఇస్తున్నారని.. ఆ దశలోనే ఈ వార్నింగ్ అయ్యి ఉండొచ్చని అంటున్నారు.

ఇదే సమయంలో.. ఇప్పటివరకూ జగన్ ప్రభుత్వానికి విన్నవించారు.. కోటి మందికి పైగా ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.. అయినప్పటికీ వినకపోయే సరికి.. ఈ విషయంలో తాను ఎంతకైనా వెళ్తాను, ప్రభుత్వం మారిన తర్వాత జైలు ఊచలు లెక్కపెట్టిస్తానని చెప్పి ఉంటారని మరికొంతమంది చెబుతున్నారు. ఏది ఏమైనా.. జగన్ పట్టుదల గురించి ఎంతో కొంత అవగాహన ఉన్నవాళ్లు మాత్రం.. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఏమీ కాదు.. ఏ పారిశ్రామికవేత్తా రారు అనే కామెంట్లు ఆ ఒక్క వార్నింగ్ తో వినిపిస్తుండటం గమనార్హం.

మన పాలన బాగాలేదు || Analyst Ks Prasad Reacts On Chandrababu Collectors Meeting Comments || TR