Pawan Kalyan: ‘వేరే ఆలోచన చేద్దామ్’… ఆ మాటకు అర్ధం ఏమిటి పవన్..?

Pawan Kalyan: ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ తోలు తీస్తానని చెప్పిన పవన్ కల్యాణ్.. అధికారంలోకి వచ్చిన తర్వాత కాలుకు కాలు మక్కికి మక్కి అని చెబుతున్న సంగతి తెలిసిందే. తాను బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానన్న విషయం మరిచిపోతున్నారో లేక, సమస్యల నుంచి ప్రజలు, మీడియా దృష్టి మరల్చే వ్యూహంలో భాగమో తెలియదు కానీ.. తాను అధికారంలో లేనప్పుడు చెప్పిన మాటలు, ఇచ్చిన వాగ్ధానాల గురించి ప్రశ్నిస్తే సమాధానం లేదు కానీ.. విచ్చలవిడి వ్యాఖ్యలు మాత్రం చేస్తున్నారనే చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది.

ఈ నేపథ్యంలోనే పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

సనాతని పవన్ కల్యాణ్ తాను బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాననే విషయం మరిచిపోయారా.. లేక, ప్రస్ట్రేషన్ లో ఉన్నారా..?

ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రశ్నించాలి.. ప్రజలు అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు చేయాలి, చేతల్లో చూపించాలి అనే విషయం పవన్ కి ఎవరూ చెప్పడం లేదా..?

హామీలు అమ‌లు చేయ‌క‌పోతే చొక్కా ప‌ట్టుకుని, రోడ్డు మీద‌కి తీసుకెళ్లండ‌ని చెప్పిన పవన్.. జనం ఆ పని చేస్తారేమో అనే అభద్రతాభావంలొ ఉన్నారనుకోవాలా..?

జుట్టు మార్చినంత సులువు కాదు, మాట మార్చడ‌ం.. డ్రెస్ మార్చినంత ఈజీ కాదు, వాగ్దానం మార్చడ‌ం.. అంటూ జడ శ్రావణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు పవన్ వరకూ చేరలేదా..?

ఐదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించి.. ఆ పార్టీ అధినేత పిలుపు ఇస్తే కోటికి పైగా సంతకాలు చేసిన కార్యకర్తలు, 40% ప్రజల మద్దతు ఉన్న పార్టీని ఆకు రౌడీల పార్టీ అనడంలో పవన్ ఉద్దేశ్యం ఏమిటి..?

సొంతంగా పార్టీ పెట్టి, ఎవరి పంచనా చేరకుండా, మరెవరిపైనా ఆధారపడకుండా, ప్రజల అండదండలతో అధికారంలోకి వచ్చిన పార్టీ “ఆకు”రౌడీల పార్టీ అయితే… ఎమ్మెల్యేగా పార్టీ అధ్యక్షుడు పోటీ చేసి, రెండు చోట్లా ఓడిపోయి, ఇక తన వల్ల కాదని మరో పార్టీల పంచన చేరిన పార్టీని ఏ పార్టీ అనాలి..?

నిత్యం హైదరాబాద్ టు అమరావతి మధ్య ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొడుతూ.. మీడియా ముందుకు వచ్చే సాహసం చేయరు అనే విమర్శలు సంపాదించుకున్నారని చెబుతున్న డీసీఎం పవన్ కల్యాణ్.. బహిరంగ సభలకు వచ్చినప్పుడు మాత్రం.. ఎదురుగా ప్రశ్నించేవారు ఉండరనే నమ్మకమో ఏమో కానీ.. గట్టిగా ప్రసంగిస్తుంటారు! ఈ క్రమంలో ఇటీవల ఆ గట్టిదనం మరింతగా పెరిగి ప్రస్ట్రేషన్ గా మారుతుందా అనే సందేహాలకు తావిస్తోందని అంటున్నారు.

ఇటీవల నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో అమరజీవి జలధార ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. కాలుకు కాలు, కీలుకు కీలు తీసి మడపతెట్టి కింద కూర్చోబెడతామని.. చేతిలో రేఖలు అరగదీసేస్తామని.. తమను అక్కడివరకూ తీసుకురావొద్దని బెదిరించిన సంగతి తెలిసిందే!

ఈ సందర్భంగా… తాను అధికారంలో ఉన్నా లేకున్నా ఎవరికీ భయపడనంటూ.. మరోసారి తనకు భయం లేదనే విషయం ధైర్యంగా చెప్పారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఆ సంగతి అలా ఉంటే… తాజాగా జనసేన “పదవి – బాధ్యత” పేరుతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూనే.. వైసీపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా… వైసీపీని పొలిటికల్ పార్టీగా గుర్తించడం లేదని.. ఆకు రౌడీల పార్టీగా గుర్తిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్.. బలమైన ఐడియాలజీ ఉంది కనుకే ధైర్యంగా ముందుకు అడుగు వేస్తున్నామని.. ఏం చేసినా రాజ్యాంగబద్ధంగా మాత్రమే చేస్తామని.. ముందు మంచిగా చెప్తాం.. మంచిగా మాట్లాడతాం.. వినకపోతే చొక్కా మడతపెట్టి ముందుకు వెళ్లడం పెద్ద పని కాదు అంటూ హెచ్చరించారు.

ఇలా వైసీపీని ఆకు రౌడీల పార్టీ అనే మాటల సంగతి కాసేపు పక్కనపెడితే… “నేను 10, 15 ఏళ్లు కూటమి పాలన ఉండాలని తరచూ చెప్పేది.. మనం, మన పార్టీ తగ్గాలని, ఎవరినో బలోపేతం చేయాలని కాదు. అందరం ఒకరితో ఒకరు కొట్టుకుంటూ ఉంటే అరాచకమే రాజ్యం ఏలుతుంది. అలాంటి పరిస్థితి అంటే నాకు భయం. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసిన తర్వాత అందరూ ఒకస్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు వేరే ఆలోచన చేద్దాం” అన్నారు పవన్ కల్యాణ్.

ఇక్కడ ఇందులో చివరి వాక్యమే రకరకాల విశ్లేషణలను, సందేహాలను తెరపైకి తెస్తోందని అంటున్నారు. ఓ పక్క ప్రాజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే కూటమి కలయిక అని.. ఎవరినీ బలోపేతం చేయడానికి కాదంటూ కొత్త డౌట్లు తెచ్చిన పవన్ కల్యాణ్… మళ్లీ వైసీపీ అధికారంలోకి రాదని, ఎవరూ భయపడవద్దని గంటాపథంగా చెబుతూనే… అందరూ ఒక స్థాయికి వచ్చిన తర్వాత వేరే ఆలోచన చేద్దాం అని అనడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అంటే… కూటమిలో ఉంటూ బలపడి.. మరో 10 ఏళ్లు అధికారంలో ఉండి.. ఈ లోపు వైసీపీని పూర్తిగా పతనం చేసిన తర్వాత.. అప్పుడు బీజేపీతో కలిసి, టీడీపీని ఓడించి అధికారంలోకి రావాలని పవన్ ఆలోచిస్తున్నారా అని పలువురు ఆలోచిస్తున్నారు! పవన్ చెప్పిన మాటలో అయితే ఇదే ఇన్నర్ మీనింగ్ అని.. అలా కానిపక్షంలో… మరోసారి రాజ్యాధికారం పేరు చెప్పి జనసైనికులను మబ్బుల్లోకి తెచ్చి.. ఊరించి, పబ్బం గడుపుకుని, మోసం చేయడమే అని మరికొందమంది అభిప్రాయపడుతున్నారు.

ఇంతకీ తాను చెప్పిన మాటకు అర్ధం ఏమిటో పవన్ మాత్రమే కరెక్ట్ గా చెప్పగలరని చెబుతున్నారు మరికొంతమంది పరిశీలకులు.

మొరిగే కుక్క కరిచే కుక్క || Congress Tulasi Reddy Reacts On Pawan Kalyan Comments On Ys Jagan || TR