Pawan Kalyan: అధికారంలోకి రానంత వరకూ అంతా మీరే అని చెప్పి, తీరా కుర్చీ ఎక్కిన తర్వాత అసలు రంగు బయటపెట్టారని.. తపించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని.. తమను జెండా కూలీలుగా మాత్రమే చూస్తున్నారని.. టీడీపీ సహచరుల్లా కాకుండా, వారి సహాయకులుగా అన్నట్లుగా గ్రౌండ్ లెవెల్ లో తమను ట్రీట్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని కామెంట్లు జనసైనికుల నుంచి వినిపిస్తున్నాయనే చర్చ బలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో పవన్ కల్యాణ్ ఇంటిని చక్కబెట్టుకునే పనికి పునుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి..!
కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్న పవన్ కల్యాణ్.. ఆ 15 ఏళ్లూ జనసైనికులు టీడీపీ నేతలకు సహాయకులేనా..?
పవన్ మనసులో మాట అదే అయితే… టీడీపీ మునిగిపోతే, దాంతో పాటు జనసేన కూడా మునిగిపోవాల్సిందేనా..?
టీడీపీ అయితే ఒకటి రెండు దెబ్బలు తగిలినా చంద్రబాబు ఉన్నంత కాలం ఇబ్బంది లేకుండా మళ్లీ లేస్తుంది.. గ్రౌండ్ లెవెల్ లో ఆ పార్టీకి బలమైన కేడర్ ఉంది.. మరి జనసేన పరిస్థితి..?
గ్రౌండ్ లెవెల్ లో ఇప్పటికీ కూటమిలో తమను ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూస్తున్నారని.. ఆటలో అరటిపండుల్లాగా తమ పరిస్థితి మారిపోయిందని జనసైనికులు ఆఫ్ ద రికార్డ్ ఆవేదన చెందుతున్న విషయం పవన్ కు ఇప్పటికైనా తెలిసిందా..?
ఒకవేళ ఎన్డీయే కూటమిలో టీడీపీకి, బీజేపీకి చెడితే.. తానూ సొంతంగా బలపడి.. ప్రత్యామ్నాయం కావాలని భావిస్తున్నారా..?

ఏది ఏమైనా… అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చంద్రబాబు చొక్కాపట్టుకుని తిరుగుతూ, కేడర్ సంగతి దేవుడెరుగు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలను సైతం పట్టించుకోవడం లేదన్ని.. గ్రౌండ్ లెవెల్ లో వారి పరిస్థితిని, వారి సమస్యలను అర్ధం చేసుకోవడం సంగతి దేవుడెరుగు.. కనీసం వినడం లేదని.. రకరకాల విమర్శలు ఆఫ్ ద రికార్డ్ జనసైనికుల నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే!
ఈ సమయంలో పవన్ కల్యాణ్ బిగ్ స్టెప్ తీసుకున్నారు. ఇది తాజా పరిణామాల నేపథ్యంలో తనకొచ్చిన ఆలోచనేనా.. లేక, శ్రేయోభిలాషులు ఎవరైనా సూచించారో తెలియదు కానీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ మీద పూర్తి ఫోకస్ పెట్టడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా… గ్రామ, వార్డు, బూత్ లెవెల్ నుంచి మండల, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి దాకా కమిటీలను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు.
ఇదే సమయంలో.. ఫైవ్ మెన్ కమిటీలను ఎక్కడికక్కడ ఏర్పాటుచేస్తూ.. సమిష్టి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. అదే సమయంలో పార్టీలో ఉన్న నాయకులు, ప్రజా ప్రతినిధులు నామినేటెడ్ పదవులు అందుకున్న వారి పనితీరును కూడా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన పార్టీకి సంబధించిన మొత్తం 21 మంది ఎమ్మెల్యేలతో తాను ఇద్దరు మంత్రులు కాకుండా మిగిలిన 18 మందితో భేటీలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇది ఆసక్తిగా మారింది.

ఈ క్రమంలో.. శుక్రవారం ఆయన తొమ్మిది మంది జనసేన ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ సమావేశం జరిపారు. ఈ సమావేశాల్లో మొదట పాల్గొన్నవారిలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ తో పాటు లోకం నాగ మాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతం నానాజీ, వంశీ క్రిష్ణ, నిమ్మక జయక్రిష్ణ, పంచకర్ల రమేష్, సుందరపు విజయ కుమార్ ఉన్నారు. వీరితో వన్ టు వన్ భేటీ అయ్యారు.
ఈ భేటీలో ప్రధానంగా పార్టీ పటిష్టత గురించి పవన్ కల్యాణ్ వారితో చర్చించారు అని అంటున్నారు. ఇందులో భాగంగా.. ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్ లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది.. బలోపేతం చేయడానికి ఏమేమి చేయాలి.. క్యాడర్ ఏమనుకుంటున్నారు.. వంటివి కూడా ఆయన అడిగి తెలుసుకున్నట్లుగా చెబుతున్నారు. దీంతో… పవన్ ఇప్పటికైనా తమను పరిగణలోకి తీసుకున్నారని హ్యాపీ ఫీలవుతున్నారంట గ్లాసు గుర్తు ఎమ్మెల్యేలు!

