Pawan Kalyan: పవన్ కల్యాణ్ లో అప్పటికీ ఇప్పటికీ పెద్దగా మార్పేమీ రాలేదా..? అప్పుడు కాస్త కుర్రతనంతోనో, రాజకీయాలపై అవగాహన లేకనో అన్నట్లుగా ప్రవర్తిస్తే.. ఇప్పుడు అన్నీ తెలిసినా ఆ లక్షణాలు ఇంకా పోలేదనుకోవాలో..? లేక, పుట్టుకతో వచ్చినవి ఇక పోయేది అప్పుడే అనే సామెతను గుర్తుకు తెచ్చుకోవాలా..? తాజాగా తూర్పు గోదావరి జిల్లా పెరవలిలో జరిగిన కార్యక్రమంలో పవన్ ప్రసంగం సందర్భంగా యూపీ సీఎం యోగి ఆధిత్యానాథ్ పేరు ప్రస్థావించడంతో పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
పవన్ కల్యాణ్ కు యోగి ఆధిత్యానాథ్ లో కనిపించింది రౌడీలకు, గ్యాంగ్ స్టర్ లకు ట్రీట్ మెంట్ ఇవ్వడం వరకేనా? పోనీ అదైనా చెయ్యొచ్చుగా?
అత్యాచారాలకు బలైన మహిళల విషయంలో యోగి సర్కార్ వ్యవహారశైలి ఎలా ఉంటుందో తెలుసా?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు నరికేస్తే, ఆ ముక్క రోడ్డుపై పడిన ఘటనలు చూడలేదా? అవి చేసింది రౌడీలా.. సాధువులా..?
సుగాలి ప్రీతి హత్య కేసు అని, ఉమన్ ట్రాఫికింగ్ అని కబుర్లు చెప్పి.. ఇప్పుడు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అంటే అదేనా.. మీరు మీకు ఉంది అని పదే పదే చెప్పుకుంటున్న ధైర్యం?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మక్కెలు ఇరగ్గొట్టి కుర్చోబెడతాను అని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత కాలుకి కాలు, కీలుకి కీలు విరిచేస్తాను అనడం ఒకటేనా? బాధ్యత లేదా?
ఆన్ స్క్రీన్ అంటే సరే, ఆఫ్ స్క్రీన్ కూడా ఇలాంటి డైలాగులు చెప్పుకుంటూ బండి నడిపేయడమేనా?

తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో నిర్వహించిన సభలో వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ విరుచుకుపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడిన బూర్గుల రామకృష్ణా రావు, పొట్టి శ్రీరాములే తనకు స్ఫూర్తి అని అన్నారు. అమరజీవి జలధార ప్రాజెక్ట్ ఎందుకు ఆలస్యమైందని ప్రతిపక్షం లేని, గత కాలపు ముఖ్యమంత్రి, ఆయన పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా వాళ్లకు ఒకటే తెలియజేయాలని అనుకుంటున్నా. మీరు అధికారంలో ఉన్నపుడు మీ దౌర్జన్యాలకి, బెదిరింపులకు భయపడలేదు. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా ఇష్టం లేదు. కానీ బాధ్యతగా మెలగకుండా, చంపేస్తాం, మళ్లీ మేము వస్తాం అని.. పిఠాపురం లాంటి చోట కూడా చిన్నపిల్లల మధ్య క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొస్తే.. మీ అథోగతికి ఏం మాట్లాడను? అని ప్రశ్నించారు.
కాంట్రాక్టర్లను జైళ్లలో వేస్తామని బెదిరిస్తే ఏమనుకుంటున్నారు? బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగితా వాళ్ల సంగతి నాకు తెలియదు. పవన్ కల్యాణ్ కు అధికారం ఉన్నా, లేకపోయినా ఒక్కటే. భయపడడు. అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకలా అంటే.. వాళ్ల వెనకాల రౌడీలు, కిరాయి హంతకులున్నారని చెవిలో చెబుతున్నారు. ఒక్కొక్కడికి యోగి ఆదిత్యనాథ్ లాగా ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుందని సెలవిచ్చారు!
రౌడీయిజం అంటే కాలుకు కాలు, కీలుకు కీలు విరగ్గొట్టి, మడత పెట్టి కింద కూచోపెడితా. ఇంత బలమైన పోలీస్ యంత్రాంగం పెట్టుకుని, ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటే, మళ్లీ ఇలాంటి మాటలు రావు. అక్కడి దాకా తీసుకెళ్లొద్దు. నేను విసిగిపోయాను. ఆశయం కోసం ప్రాణం పోతే ఓకే. కానీ పోయే ముందు చాలా మంది తాట తీస్తాను. అని తనదైన శైలిలో ప్రసంగించారు పవన్!
ఇక్కడ గమనించాల్సిందేమిటంటే… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మక్కెలు ఇరగ్గొడతాం అన్నారు!.. ఇప్పుడు చేతిలో అధికారం ఉన్న తర్వాత కాలుకు కాలు కీలుకి కీలు అని చెబుతున్నారు. పైగా దీనికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ ని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇక్కడే పవన్ ఓ విషయం మరిచిపోతున్నారని గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. యోగి అంటే కేవలం అదే కాదు.. ఇంకా చాలా ఉంది అని!

ఉదాహరణకు… ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలోని రాజ్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠక్ పూర్ గ్రామంలో జూలై 13, 2018న ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసి, ఆమెను సజీవ దహనం చేసిన ఘటన జరిగింది. ఆ సమయంలో.. బాధితురాలి పేరు బయటకు వెల్లడించడంపై సీరియస్ అయిన సీఎం యోగి ఆధిత్యానాథ్… జిల్లా ఎస్పీని స్పాట్ లో సస్పెండ్ చేశారు. దీంతో.. అప్పటివరకూ ఈ కేసు విషయంలో కాస్త నిర్లక్ష్యంగా ఉన్నట్లు కనిపించిన పోలీసులు.. ఒక్కసారిగా వేడేక్కి.. దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా ఆ కేసులోని నిందితులకు జీవితఖైదు శిక్ష పడింది!
మరి తమరు జీవితంలో.. పోనీ, ఈ 18 నెలలలో ఒక్క విషయంలో అయినా ఇలా బాధితుల పక్షాన్న అంత ధైర్యంగా.. మీరు చెప్పిన యోగి ఆధిత్యనాథ్ స్థాయిలో స్ట్రాంగ్ గా నిలబడ్డారా? ఆ ఇష్యూలో సీఎం యోగి ఎవరి కాళ్లు ఇరవలేదు, ఎవరి మక్కెల్లూ ఇరగ్గొట్టలేదు! సీఎంగా తన బాధ్యతను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వర్తించారు.. దానికి మానవత్వాన్ని యాడ్ చేశారు!
మరి సుగాలీ ప్రీతి తో పాటు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అత్యాచారాలు, హత్యాచారాల విషయంలో మీరు తీసుకున్న ఒక్క చర్య చెప్పండి అని ప్రజలు అడిగితే ఏమి చెబుతారు? నేను ముఖ్యమంత్రిని కాదు.. నేను హోంమంత్రిని కాదు అనా? మీ విజ్ఞతకే వదిలేస్తున్నారు ప్రజానికం! పతిపక్షంలో ఉన్నపుడు ప్రశ్నించాలి.. అధికారంలోకి వచ్చిన తర్వాత పని చేయాలి.. లేదు, రెండుసార్లూ పురాణాలే చెబుతానంటే ఎలా అని జనసైనికులు ప్రశ్నిస్తే?

