DGP Harish Kumar Gupta: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ గణనీయమైన పురోగతి సాధించిందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. 2025 సంవత్సరానికి సంబంధించి పోలీసుల పనితీరు, రాష్ట్రంలోని నేరాల స్థితిగతులపై రూపొందించిన వార్షిక నివేదికను ఆయన సోమవారం విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి నేరాల సంఖ్య గణనీయంగా తగ్గడం విశేషమని ఆయన పేర్కొన్నారు.
మహిళల రక్షణ విషయంలో రాజీ లేని పోరాటం చేస్తున్నామని డీజీపీ తెలిపారు. వేధింపుల కేసులను వేగంగా పరిష్కరించడం, మహిళలపై జరిగే నేరాలను అరికట్టడంలో పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల సత్ఫలితాలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో మత్తు పదార్థాల అక్రమ రవాణాను కట్టడి చేయడంలో పోలీస్ శాఖ విజయవంతమైందని డీజీపీ పేర్కొన్నారు.
గంజాయి, డ్రగ్స్: అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపామని తెలిపారు.
పోగొట్టుకున్న లేదా దొంగిలించిన వేలాది మొబైల్ ఫోన్లను సాంకేతికత సహాయంతో రికవరీ చేసి బాధితులకు అందజేశామని వివరించారు. రాబోయే పదేళ్లలో పోలీసింగ్ వ్యవస్థ ఎలా ఉండాలనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డీజీపీ వెల్లడించారు.

“సంక్రాంతి పండుగ తర్వాత రెండు రోజుల పాటు పోలీసింగ్ ఆధునీకరణపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నాం. కొత్త టెక్నాలజీని విధుల్లో ఎలా భాగం చేయాలనే దానిపై ఇందులో చర్చిస్తాం. ప్రజలు మార్పును ప్రత్యక్షంగా చూసేలా ఈ విధానం ఉంటుంది.”
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హెచ్చరించారు. ఆన్‌లైన్ మోసాల వెనుక చైనా కేంద్రంగా పనిచేస్తున్న ముఠాలు ఉన్నాయని, మోసం జరిగిన వెంటనే డబ్బు విదేశాలకు తరలిపోతుండటంతో రికవరీ కష్టతరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలను సమర్థవంతంగా అడ్డుకుంటున్నామని, ఇటీవల జరిగిన అరెస్టులే ఇందుకు నిదర్శనమని డీజీపీ చెప్పారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ను మరింత సురక్షిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.

