ఇంట్లో చీమలు కనిపిస్తే చీపురుతో ఊడేయడం లేదా వాటిని చంపేయడం.. ఇది చాలామందికి సాధారణ అలవాటు. కానీ మీరు ఎప్పుడైనా ఆ చీమలు ఎందుకు వచ్చాయో ఆలోచించారా..? సాధారణంగా తేమ, ఆహారం, గాలి సరిగా ప్రసరించని చోట్ల చీమలు వస్తాయని చాలామందికి తెలుసు. కానీ వాస్తు శాస్త్రం, పాత పురాణాల ప్రకారం ఇవి కేవలం సాధారణ జీవులు కాదు, కొన్ని సంకేతాలను మనకు తెలుపుతాయని చెబుతున్నాయి.
పండితుల అభిప్రాయం ప్రకారం.. ఇంట్లో ఎర్ర చీమలు, నల్ల చీమలు ఉంటే వేరే వేరే అర్థాలు ఉంటాయంట. ముఖ్యంగా ఈ చీమలు కనిపించే దిక్కు, ప్రవర్తన కూడా పెద్ద పాత్ర పోషిస్తుందట. ఇంట్లో అకస్మాత్తుగా ఎర్ర చీమలు గుంపుగా కనిపిస్తే ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయని చెప్పగలవంట. ఏదో ఊహించని ఖర్చు, రుణం వచ్చే అవకాశాలు ఎక్కువట. అందువల్ల ఇలాంటి సమయంలో ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు నల్ల చీమలు కనిపిస్తే మాత్రం అది శుభ సంకేతం. ఎందుకంటే నల్ల చీమల రాక అంటే కొత్త అవకాశాలు, సంపద వృద్ధి అని నమ్మకం. ముఖ్యంగా ఇంట్లో దేవాలయం దగ్గర లేదా బంగారు వస్తువులు పెట్టే ప్రదేశం దగ్గర నల్ల చీమలు గుంపుగా వస్తే అది మంచి ఆర్థిక స్థితి వచ్చే సూచనట. వ్యాపారం, ఉద్యోగం, ఆస్తి ఇలా అన్నీ శుభాలు జరుగుతాయంట.
వాస్తు శాస్త్రం ప్రకారం అన్నంతో నిండిన డబ్బాలో చీమలు చేరితే ఆ ఇంటి ధనం క్రమంగా పెరుగుతుందని విశ్వసిస్తారు. అలాగే చీమలు పైకప్పు నుంచి వస్తుంటే ఆస్తులు, ధనం, వస్తువులు పెరుగుతాయని పెద్దలు చెబుతున్నారు. అందువల్ల ఇక నుంచి ఇంట్లో చీమలు కనిపిస్తే తక్షణం చీపురుతో ఊడేయకండి. కాస్త గమనించండి. ఎర్ర చీమలు అంటే జాగ్రత్త, నల్ల చీమలు అంటే హర్షం వ్యక్తం చేయండి. వాస్తు చెబుతున్న ఈ చిన్న సూచనలను పాటిస్తే ఇంట్లో శాంతి, సంపద, సిరులు నిలుస్తాయని పెద్దలు అంటున్నారు. ఇంకేముంది.. మనం చేయాల్సింది ఒక్కటే.. చీమలను గమనించాలి.. మన అదృష్టాన్ని స్వాగతించాలి. (గమనిక: ఈ కథనం వాస్తు పండితులు చెప్పిన సాధారణ సమాచారం మాత్రమే.. దీనిని మేము ధృవీకరించడం లేదు.)