ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ప్రమాదాలను శాశ్వతంగా నివారించడమే లక్ష్యంగా పనిచేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు జరిగిన తర్వాత నష్టపరిహారం చెల్లించడం మాత్రమే పరిష్కారం కాదని, వాటిని జరగకుండా నివారించడమే ముఖ్యమని ఆయన అన్నారు.
సచివాలయంలో నిన్న విద్యుత్ ప్రమాదాలపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవ తప్పిదాలు, నిర్వహణ లోపాల వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ప్రమాదాల సంఖ్యను ఏటా తగ్గించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రమాదాల నివారణకు సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగించుకోవాలని మంత్రి గొట్టిపాటి సూచించారు. ప్రతి మూడు నెలలకోసారి ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక పంపాలని ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు.
అలాగే, విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912ను విస్తృతంగా ప్రచారం చేసి, ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. సోషల్ మీడియా, ఇతర మాధ్యమాలను ఉపయోగించుకోవాలని, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో విద్యుత్ ప్రమాదాల నివారణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి, వాటిని ఏపీలో అమలు చేయాలని కూడా మంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులతో పాటు పలువురు ఇంధన శాఖ అధికారులు పాల్గొన్నారు.


