ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వినాయక చవితి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు తలపెట్టే అన్ని శుభకార్యాలకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూడాలని ఆ పార్వతీ తనయుడైన గణేశుడిని తాను వేడుకుంటున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను కూడా నొక్కి చెప్పారు. మట్టి వినాయకులను పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
వినాయక చవితి విశిష్టతను గుర్తుచేస్తూ, హైందవ పండుగలలో కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితమైనప్పటికీ, వినాయక చవితి మాత్రం ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ ఒక్కటిగా జరుపుకునే గొప్ప పండుగ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ శుభ తరుణాన భక్తులందరూ గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వినాయక చవితి విశిష్టతను వివరించారు.
ప్రజలు నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా మండపాలను ఏర్పాటు చేసి, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య గణేశుడిని పూజిస్తున్న భక్తులకు సకల శుభాలు కలగాలని వినాయకుడిని పవన్ కల్యాణ్ ప్రార్థించారు.


