వైసిపి మంత్రులకు అగ్నిపరీక్ష 

An ordeal for YSRCP ministers
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  అధికారం చేబట్టి దాదాపు ఇరవై మాసాలు గడిచింది.  మంత్రివర్గాన్ని ఏర్పరచేటపుడే వారి పదవీకాలాన్ని ముప్ఫయి నెలలుగా నిర్ధారించారు జగన్.  వారి పనితీరు, వారి వారి శాఖల మీద వారు సాధించిన పట్టు ఆధారంగా చాలామందికి ఉద్వాసనలు, కొనసాగింపులు ఉంటాయని ఆరోజే జగన్ మంత్రులు అందరికీ స్పష్టం చేశారు.   జగన్ వారికి నిర్దేశించిన పదవీకాలం మరో పది నెలల్లో ముగిసిపోతుంది.    జగన్ తమపై ఉంచిన నమ్మకాన్ని ఏమేరకు తాము నిలబెట్టుకున్నామో నిరూపించుకోవాల్సిన తరుణం ఆసన్నమయింది.  శాఖలపరంగా తాము ఏమి సాధించామో రుజువు చేసుకోబోయే ముందు వారికి అసలు సిసలైన రాజకీయ పరీక్ష మొదలైంది.  
 
రాబోయే రెండు నెలల కాలం ఎన్నికల కాలం.  ఎండాకాలం కన్నా నిప్పులు, వడగాడ్పులు చిమ్మే కాలం ఇది.  సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయి.  పంచాయితీ ఎన్నికల వరకు పార్టీలకు, గుర్తులకు  అతీతంగా ఎన్నికలు జరుగుతాయి అనే మాట వాస్తవమే అయినప్పటికీ  పోటీ చేసేవారంతా వివిధ రాజకీయ పార్టీలకు చెందినవారే.  ఎన్నికలు అయిపోయాక గెలిచినవారంతా మా పార్టీవారే అని చెప్పుకోవడం ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది.  గెలిచినవారు, ఓడినవారు ఎవరెవరో పార్టీలవారందరికీ తెలుస్తుంది.  కాబట్టి గత ఏడాదిన్నర కాలంగా తమ ప్రభుత్వం చేసిన మంచిపనులు ఏమిటో ప్రజలకు చెప్పుకుని వీలైనన్ని ఎక్కువ స్థానాలు సాధించే బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నాయకుల మీద ఉంటుంది.  
 
ఇక మంత్రి పదవులను, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఇతర నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నవారు కూడా ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల  విజయం కోసం తీవ్రంగా శ్రమ పడాల్సి ఉంటుంది.  జగన్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి నిర్విరామంగా అమలు జరుగుతున్న సంక్షేమ పధకాలు ఏమాత్రం ప్రజల్లోకి వెళ్ళాయో, వాటిగూర్చి జనం ఏమనుకుంటున్నారో కూడా ఈ ఎన్నికలు తేల్చేస్తాయి.  సామాన్య కార్యకర్తలను నాయకులు పట్టించుకోవడం లేదని, తెలుగుదేశం పార్టీనుంచి వచ్చినవారికి పెద్ద పీట వేస్తున్నారని చాలామంది కార్యకర్తలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.  వారందరిని సంతృప్తి పరచి, సమన్వయము చేసుకుని పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మీదనే ఆధారపడి ఉంటుంది.   మంత్రులకు తమ పదవులు నిలవాలన్నా, ఎమ్మెల్యేలకు మరోసారి టికెట్ దక్కాలన్నా ఈ స్థానిక సంస్థల ఎన్నికలే మార్గదర్శనం చేస్తాయి.  
 
ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీని ఏమాత్రం తక్కువగా అంచనా వెయ్యడానికి వీల్లేదు.  వారికి కూడా ముప్ఫయి నుంచి ముప్ఫయి అయిదు శాతం నిలకడైన ఓటు బ్యాంకు ఉన్నది అని మర్చిపోకూడదు.  చంద్రబాబుకు తప్ప మరొకరికి ఓటు వెయ్యకూడదు అనుకునే హార్డ్ కొర్ అభిమానులు ఆ పార్టీకి ఉన్నారు.  చంద్రబాబు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా చంద్రబాబును వారు విమర్శించరు.  దానికితోడు వారికి మీడియా సహకారం ఇరవైనాలుగు గంటలూ లభిస్తుంది.  చంద్రబాబు గోరంత చేసినా, కొండంత చేశాడంటూ డప్పులు కొట్టే ఛానెల్స్ ఉన్నాయి.  బీజేపీ, జనసేన కలిసి పోరాడుతాయి.  ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి.  బీజేపీ కరుణాకటాక్షం కోసం చంద్రబాబు తన పార్టీని బలిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.  కాబట్టి తెలుగుదేశం బలంగా లేనిచోట ఆయన బీజేపీ, జనసేనల కూటమికి మద్దతు ఇచ్చి మెల్లిగా రాబోయే ఎన్నికల నాటికి వారి కౌగిట్లో వాలిపోతారు.  
 
ఈ ముగ్గురు ప్రత్యర్థులను ఎదుర్కొంటూ వైసిపి స్థానిక ఎన్నికల్లో పోరాడాల్సి ఉంటుంది.  వైసిపి మంత్రులకు ఈ ఎన్నికలు విషమపరీక్ష లాంటివే.  సునాయాసంగా నెగ్గుతామని భ్రమల్లో తేలియాడుతూ అలక్ష్యం చేస్తే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.  ఎక్కడైతే వైసిపికి ఎక్కువ విజయాలు దక్కవో ఆ ప్రాంతానికి చెందిన మంత్రులకు మూడినట్లే అనుకోవచ్చు.  రాష్ట్రం మొత్తం మీద కనీసం ఎనభై శాతం స్థానాలు దక్కితే వైసిపి బలం చెక్కుచెదరనట్లే.  కానీ తొంభై శాతం దక్కితేనే ప్రభుత్వ సంక్షేమ పధకాల మీద ప్రజలు సంతోషంగా ఉన్నట్లు లెక్క.  అంతటి విజయాన్ని రాబట్టి తమకు పదవులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని సంతోషపెట్టడం ఆ పదవులు అనుభవిస్తున్నవారి కనీస బాధ్యత.  తమకు వచ్చిన పదవులు అన్నీ జగన్మోహన్ రెడ్డి కారణంగానే వచ్చాయని వారు గమనంలో పెట్టుకోవాలి.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు