అచ్యుతాపురం సెజ్ లో దారుణం జరిగిపోయిన సంగతి తెలిసిందే. ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో 17 మంది మరణించగా.. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మందుల తయారీలో ఉపయోగించే రియాక్టర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగింది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ జిల్లా పర్యటన చేపట్టారు. అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ఘోర ప్రమాదంలో బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు గత ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమానికి తెరలేపారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీగా రాజకీయం మారింది.
వాస్తవానికి అచ్యుతాపురంలో జరిగింది అత్యంత దారుణ ఘటన. శరీర భాగాలు ఛిద్రమై.. చెట్టు కొమ్మలపై వేళాడిన పరిస్థితి. ఈ సమయంలో చంద్రబాబు ఇక మీదట అయినా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా చర్యలు చేపట్టాలన్నది చేయాలి. కానీ… గత ప్రభుత్వం వల్లే ఈ ఘోరం అని చెప్పడాన్ని ఎలా చూడాలి?
పైగా… ఆయన ప్రశ్నకు ఆయన కేబినెట్ లోని ఉపముఖ్యమంత్రి పవన్ ఓ కామెంట్ చేశారు. “3 వారాల క్రితం ఇదే తరహా ప్రమాదం అచ్యుతాపురంలో జరిగిందని సేఫ్టీ ఆడిట్ పలు మార్లు కోరినా జరపలేదని డిప్యుటీ సీఎం వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచాయి” అంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు చెబుతున్నారు.
అయితే విశాఖ వెళ్ళిన చంద్రబాబు మాత్రం గత ప్రభుత్వం నిర్వాకమే ఇదంతా అని ఎదురు దాడి చేస్తున్నారని వైసీపీ మండిపోతోంది. గత అయిదేళ్లలో వైసీపీ హయాంలో సెజ్ లలో సంభవించిన మరణాలు ఇవీ అని బాబు లెక్కలు చెబుతూ.. వ్యవస్థలు అయిదేళ్ళలో గాడి తప్పాయంటూ పాడిందే పాడరా పాసిపళ్ల దాసన్న అన్నట్లుగా పాత పాటనే పాడారు.
పనికిమాలిన విమర్శల సంగతి కాసేపు పక్కనపెడితే… అక్కడ వందలాది మంది పనిచేస్తూంటే ఒకే ఒక్క అగ్ని మాపక యంత్రం ఉంది.. భద్రతను గాలిలోకి వదిలేసి సెజ్ లు పనిచేస్తున్నాయి.. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అధికారులు వారే ఉంటున్నారన్న విషయం మరిచిపోకూడదంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తప్పు చేసిన వారిని ఒకరిని అయినా కటకటాల వెనక్కి పంపిస్తే మిగిలిన వారికి అది గుణపాఠం అవుతుంది. ఇదే క్రమంలో… అధికారులపైనా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు. కేవలం.. ఒక పక్షం, మరో పక్షంపై విమర్శలు చేసుకోవడంతోనే సరిపెడుతున్నారు. ప్రభుత్వాలు ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదన్నది చర్చ.
ఏ ప్రభుత్వంలో తప్పు జరిగినా.. ఆ ప్రభుత్వం హుందాగా తీసుకుని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప ప్రతిపక్షాలపై పడటాన్ని నిస్సిగ్గు చర్య అంటారనేది వైసీపీ నేతల వాదన. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొవడం వల్ల ఇష్యూ తప్పుదారి పట్టడమే కాకుండా.. అసలుదోషులు సైడ్ అయిపోతున్నారు!
ఈ నేపథ్యంలో స్పందించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబుకు గట్టి కౌంటరే ఇచ్చారు. ఏమాత్రం తేరుకోలేని విషయాన్ని తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా… పాపం చంద్రబాబు హయాంలో ప్రమాదాలే జరగలేదుట అని ఎద్దేవా చేశారు. కానీ ఇదే అచ్యుతాపురం సెజ్ లో బాబు ఏలుబడిలో కూడా ముగ్గురు ప్రమాదంలో చనిపోయారని గుర్తు చేశారు.
అంతే కాదు గోదావరి పుష్కరాలలో ఏకంగా 29 మంది మృత్యువాత పడిన సంగతి మరిచిపోయావా బాబూ అని కూడా నిలదీశారు.
ఇదే సమయంలో…”నాడు 29, నేడు 17… లెగ్గు బాబు లెగ్గు.. అది మామూలు పాదమా” అంటూ ట్రోలింగ్స్ మొదలైపోయాయి! ఏది ఏమైనా… ఈ విషయంలో ప్రభుత్వాలు, ప్రతిపక్షాలపై విమర్శలకంటే ఎక్కువగా అందుకు కారకులైన అధికారులు, కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడానికి ముందుకు కదలాలని చెబుతున్నారు.
రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా ఇప్పటికీ గత ప్రభుత్వంపై పడటం వల్ల అసలు విషయం పక్కకు పోవడంతో పాటు.. అసలు దోషులు తప్పించుకోవడానికి ప్రభుత్వాలే రెడ్ కార్పెట్ పరుస్తున్న పరిస్థితి అని చెబుతున్నారు. సో… ఇకపై అయినా బాబు సర్కార్ అదేపాట పాడకుండా… సరైన ఆలోచనలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.