Black Box: బోయింగ్ 787-8 విమానం బ్లాక్ బాక్స్ స్వాధీనం.. అందులో ఏముందంటే..?

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. లండన్‌కు బయలుదేరిన బోయింగ్ 787-8 విమానం టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే కుప్పకూలింది. భారీ శబ్దంతో నేలపై కూలింది. దీంతో వందలాది కుటుంబాలను శోకసంద్రంలో మునిగిపోయాయి. తాజాగా ఘటనాస్థలిలో సహాయక చర్యలు ముమ్మరం కాగా, బ్లాక్ బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు రాయిటర్స్‌ వెల్లడించింది. ఓ ఉన్నత పోలీసు అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం, ప్రమాదానికి గల అసలైన కారణాలను తెలుసుకునే దిశగా దర్యాప్తు వేగవంతం చేశారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఉష్ణోగ్రత సుమారు 1000 డిగ్రీల సెల్సియస్‌కు చేరిందని అధికారులు వెల్లడించడమే కాక, మంటలు కట్టడిచేయడం చాలా క్లిష్టంగా మారిందన్నారు. పైలట్లు, సిబ్బంది, ప్రయాణికుల సమాచారం ఇంకా స్పష్టంగా బయటకురాలేదు. ప్రాథమికంగా మాత్రం సాంకేతిక లోపమా? లేక ఇతర కారణాలా? అన్నదానిపై విచారణ కొనసాగుతోంది.

విమాన ప్రమాదాలపై అసలు నిజాలు వెలుగులోకి రావాలంటే బ్లాక్ బాక్స్‌ కీలకం. ఇది సాధారణంగా ఒక అధునాతన కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లా పనిచేస్తుంది. విమానం టేకాఫ్‌ అయ్యిన క్షణం నుంచి ల్యాండ్ అయ్యే వరకూ ప్రతి క్షణం సమాచారం ఇందులో నిక్షిప్తమవుతుంది. పైలట్‌లు కాక్‌పిట్‌లో మాట్లాడిన మాటలు, రేడియో ద్వారా జరిగే సంభాషణలు, ఇంజిన్ పనితీరు, విమాన వేగం, ఎత్తు, వాతావరణ సమాచారం వంటి ఎన్నో వివరాలను ఇది రికార్డు చేస్తుంది.

ఈ బ్లాక్ బాక్స్‌ లభ్యం కావడంతో ఇప్పుడు దర్యాప్తు అధికారులు దుర్ఘటన వెనుక అసలు విషయం బయటకు తీయేందుకు రంగంలోకి దిగారు. నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఆ విమానంలో ప్రయాణించినవారి కుటుంబాలకు, దేశ ప్రజలకు ఎదురుచూస్తున్నారు.