అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. 242 మంది ప్రయాణికులతో లండన్‌కి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలి మంటల్లో కాలిపోయింది. అందులో ఉన్నవారందరూ మరణించారని భావిస్తున్న సమయంలో… అద్భుతంగా ఒక వ్యక్తి బతికి బట్టకట్టాడు. అతడే రమేశ్ విశ్వ కుమార్ (38) బ్రిటిష్ పౌరుడు.
ఆ విమానంలో 11ఏ సీటులో కూర్చున్న రమేశ్, కూలుతున్న క్షణాల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చాడు. తీవ్ర గాయాలతో ఉన్నప్పటికీ అతడు సజీవంగా బయటపడటం ఓ అద్భుతంగా మారింది. ఛాతీ, కన్ను, కాలికి గాయాలైన అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. “టేకాఫ్ అయిన 30 సెకన్లకే ఓ ఘోరమైన శబ్దం వినిపించింది. ఆ వెంటనే అన్నీ తలకిందులయ్యాయి. చుట్టూ నిప్పు, పొగ, అరుపులు… అసలు ఏం జరిగిందో అర్థం కాలేదని రమేష్ తెలిపాడు.
కాసేపటికి లేచి చూసేసరికి.. తన చుట్టూ మృతదేహాలు కనిపించాయని.. ఆ దృశ్యాన్ని తాను జీవితంలో మర్చిపోలేనిని అతడు కన్నీటి గళంతో వెల్లడించాడు.
20 ఏళ్లుగా లండన్‌లో స్థిరపడిన రమేశ్, తన కుటుంబాన్ని చూసేందుకు కొద్ది రోజులకే భారత్ వచ్చాడు. తన సోదరుడు అజయ్ కుమార్ (45)తో కలిసి తిరిగి యూకే వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అయితే, రమేశ్ బతికిపోయినా.. అతడి సోదరుడి ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. తన అన్న ఏమయ్యాడని రమేశ్ అడుగుతున్నాడు. ఒక్కొక్కరి జీవితాల వెనుక ఉన్న కుటుంబాలు, కలలు, బంధాల్ని మింగేసిన ఈ ప్రమాదం… ఒక్కరైనా ప్రాణాలతో బయటపడిన ఈ ఘటన ఒక ఆశకిరణంలా మారింది. రమేశ్ సురక్షితంగా ఉన్నా… అతడి మనసు సోదరుడి కోసం తహతహలాడుతూనే ఉంది.