Plane Crash: ఎయిర్ ఇండియా ప్లేన్ కూలిపోవడానికి క్షణాలు ముందు.. పైలట్ చివరి మాటలు ఇవే..!

జూన్ 12న అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కూలిపోయింది. విమానం నేరుగా ఒక మెడికల్ కాలేజ్ భవనంపైకి దూసుకెళ్లి ఢీకొట్టడంతో దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. విమానం ఎలా కూలిపోయింది? దీనికి కారణం ఏమిటన్నది తెలుసుకునేందుకు అధికారులు విచారణ ముమ్మరం చేశారు.

తాజాగా దర్యాప్తు అధికారులందించిన సమాచారం ప్రకారం, విమానం టేకాఫ్ సమయంలో అత్యవసర విద్యుత్ సరఫరాపైనే నడుస్తున్నట్లు భావిస్తున్నారు. సాధారణంగా రెండు ఇంజన్ల ద్వారా విమానానికి శక్తి లభిస్తుంది. కానీ ఆ ఇంజన్లలో ఏదో సమస్య ఏర్పడి, విమానం పూర్తిగా ఎమర్జెన్సీ జనరేటర్ మీదే నడిచినట్లు అనుమానం. కొన్ని నివేదికల ప్రకారం, విమానంలోని రెండు ఇంజిన్లు విఫలమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఇది అధికారికంగా నిరూపించాల్సి ఉంది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను శిథిలాల నుంచి స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా పైలట్లు చివరి క్షణాల్లో ఏం మాట్లాడారన్నది గుర్తించే ప్రయత్నం జరుగుతోంది.

ఈ విమానాన్ని కెప్టెన్ సుమిత్ సభర్వాల్, సహ పైలట్ క్లైవ్ కుందర్ కలిసి నడిపిస్తున్నారు. కెప్టెన్‌కు 8,200 గంటల విమానయాన అనుభవం ఉంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పైలట్ నుంచి ‘మేడే’ కాల్ వచ్చింది. ‘‘మేడే మేడే… ఒత్తిడి లేదు… శక్తి కోల్పోతుంది… ఎగరలేము, అని కెప్టెన్ చెప్పిన మాటలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను ఉలిక్కిపడేలా చేశాయి. రన్‌వే నుంచి కేవలం 1.5 మైళ్ల దూరంలోనే విమానం కూలిపోయింది.

ఇలాంటి ప్రమాదాల్లో పైలట్లు చివరిసారిగా ఏం మాట్లాడతారన్న దానిపై గల ఆసక్తి ఇప్పుడూ ప్రజల్లో కనిపిస్తోంది. పైలట్, ఆర్థికవేత్త రిచర్డ్ పాల్ ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. విమానం ఆఖరి క్షణాల్లో, ముఖ్యంగా స్విస్ ఎయిర్ పైలట్లు చనిపోతున్న సమయంలో ‘‘గుడ్‌బై ఎవ్రీవన్’’ అని చెప్పడం ఓ విధంగా తమ మౌన ఒప్పందంగా తీసుకుంటారని తెలిపారు. 1970లో స్విస్ ఎయిర్ ప్రమాదంలో కెప్టెన్ కార్ల్ బెర్లింగర్ చివరిసారిగా ఇదే మాట అన్నట్టు ఆయన వివరించారు.

ఈ ప్రమాదం తర్వాత విమాన ప్రయాణాల భద్రతపై పెద్ద చర్చ మొదలైంది. అంత అభివృద్ధి చెందిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే శక్తి కోల్పోవడం బాధాకరమని తెలిపారు. 270 మందికి పైగా ప్రాణాలు పోయిన ఈ దుర్ఘటనకు గల అసలు కారణం ఏమిటన్నది త్వరలో దర్యాప్తు ద్వారా తేలనుంది.