Plane Crash: ఓ నిమిషం.. ఓ భారీ శబ్దం.. 241 మంది జీవితాలు ఆవిరి.. అహ్మదాబాద్ లో అంతులేని విషాదం..!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లండన్ వెళ్లేందుకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. విమానం ప్రమాదానికి గురైన ప్రాంతం మేఘానీనగర్‌ లోని ఓ మెడికల్ కాలేజీ సమీపంగా ఉన్న హాస్టల్. ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 242 మందిలో 241 మంది చనిపోయారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయట పడ్డారు.

విమానంలో 169 మంది భారతీయులు ఉన్నారు. 53 మంది బ్రిటన్ పౌరులు, 7 మంది పోర్చుగల్ వారు, ఒక కెనడా పౌరుడు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 1.39 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయ్యింది. కానీ కేవలం ఐదు నిమిషాల్లోనే విమానం కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ఎమర్జెన్సీ కాల్ వెళ్లింది. వెంటనే అధికారులు స్పందించినా.. విమానం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

ఘటనాస్థలికి చేరేలోపే విమానం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. మంటలు ఆకాశాన్ని అంటుకున్నాయి. కూలిన వెంటనే జరిగిన పేలుడు తీవ్రంగా ఉండటంతో.. విమానంలోని ప్రయాణికులందరూ అగ్నికి ఆహుతయ్యినట్టు భావిస్తున్నారు. ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభమైంది. అధికారులు పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.