అంతర్జాతీయ మీడియాకు.. FIP లీగల్ నోటీసులు.. ఎందుకంటే..?

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా బోయింగ్ విమాన ప్రమాదానికి పైలటే కారణమని అంతర్జాతీయ మీడియా ఊహాజనిత కథనాలు ప్రసారం చేస్తుండటంపై పైలట్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పైలట్ ఆత్మహత్య చేసుకున్న కారణంగానే విమానం కూలిపోయిందని దావా చేస్తూ పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలో ది వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్ వంటి పత్రికలకు పైలట్ సంఘాలు లీగల్ నోటీసులు జారీ చేశాయి. తక్షణమే అవాస్తవ కథనాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.

తుది విచారణ నివేదిక విడుదల కాకముందే వాస్తవాలు లేవని తెలిసీ, అనుమానాస్పద కథనాలను ప్రసారం చేయడం బాధ్యతారాహిత్యమని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (FIP) పేర్కొంది. మీడియా కథనాలను అమెరికా దర్యాప్తు సంస్థ ఎన్‌టీఎస్‌బీ కూడా తిప్పికొట్టింది. పైలట్లపై ఊహాజనిత ఆరోపణలు చేయడం తగదు అని స్పష్టం చేసింది.

తాజాగా బయటపడిన సమాచారం ప్రకారం, కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో పైలట్ల మధ్య కొన్ని వాదనలు జరిగినట్లు ప్రాథమిక నివేదికలో ఉంది. ఒక పైలట్ మరో పైలట్‌ను “ఎందుకు కట్-ఆఫ్ చేశావు?” అని ప్రశ్నిస్తే, అతను “తాను అలా చేయలేదని” సమాధానమిచ్చినట్లు రికార్డింగ్‌లో ఉంది. అయితే, దాని ఆధారంగా పైలట్ ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కూల్చేశారని చెప్పడం సరికాదని యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇక ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ప్యాసింజర్ విశ్వాష్ కుమార్ రమేష్ చెప్పిన ప్రకారం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పెద్ద శబ్దం రావడం, విమానం నిలిచిపోవడం జరిగిందని వెల్లడించాడు. “ఆ సమయంలో ఆకుపచ్చ, తెలుపు లైట్లు మిణుకుమిణుకుమంటున్నాయి. పైలట్లు ఎంతటి ప్రయత్నాలు చేసినా విమానాన్ని నిలుపలేకపోయారు. చివరకు కూలిపోయింది అని ఆయన వివరించాడు.

దురదృష్టకరంగా, విమానం కూలిపోవడానికి ముందు కేవలం 625 అడుగుల ఎత్తులో మాత్రమే ఉంది. సాధారణంగా టేకాఫ్ అనంతరం 3,600–4,900 అడుగుల ఎత్తులో ఉంటే ప్రమాదాన్ని నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ఎత్తు కారణంగా పైలట్లకు విమానాన్ని రీ-కవర్ చేయలేని పరిస్థితి ఏర్పడింది.

జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బయలుదేరిన ఈ ఎయిరిండియా బోయింగ్ విమానం, టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే సమీపంలోని హాస్టల్‌పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది ప్రాణాలు కోల్పోగా, హాస్టల్‌లో ఉన్న మెడికల్ విద్యార్థులు కూడా ఈ దుర్ఘటనలో మరణించారు. మొత్తం 271 మంది అమూల్యమైన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. మృతుల కుటుంబాలకు ఎయిరిండియా తరఫున ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున పరిహారం అందజేసింది.