రాష్ట్రంలో తెలుగుదేశం అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “గ్రాస్రూట్ (grassroot) స్థాయితో కనెక్షన్ కోల్పోయారు. ఆ స్థాయిలో ఏం జరుగుతోందో ఆయనకు ఇప్పుడు అవగాహన లేదు. ఆపైన పూర్తిగా అవకాశవాద రాజకీయం చేస్తున్నారు. ఆయన రాజకీయాలు అర్ధమైన ప్రజలు 2019 ఎన్నికల్లో ఆయనకు భారీ ఓటమి ఇచ్చారు. పక్కన కూర్చో బెట్టారు. అయినా ఆయన తన పద్ధతులు మార్చుకోలేదు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, దశాబ్దంన్నర ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం వాస్తవ పరిస్థితులను అంచనా వేయడంలో ఆయనకు ఉపయోగపడడం లేదు. లేదా వాస్తవాన్ని గుర్తించకుండా పూర్తిరాజకీయం చేస్తున్నారు. రాష్ట్రంలోని వాలంటీర్ల వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలు, విమర్శలే ఇందుకు ఒక ఉదాహరణ.
రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ అధ్బుతంగా పనిచేస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రెండు లక్షల 80 వేలమంది గ్రామ, వార్డు వాలంటీర్లను గత యేడాది ఆగస్టు 15న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించారు. తన సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తూ ఈ వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించారు.
గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ ప్రతి 50 కుటుంబాలకు ఒకరి చొప్పున వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది. ఈ 50 కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం నుండి అన్ని లావాదేవీలను ఈ వాలంటీర్లు పర్యవేక్షిస్తుంటారు. ప్రభుత్వ పధకాలు లబ్దిదారులకు చేర్చేందుకు, ప్రత్యేకించి నెలనెలా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ లబ్దిదారులకు అందించేందుకు ఈ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. ఆపైన ప్రతి కుటుంబానికి రేషన్ పంపిణీ, ప్రభుత్వానికి చెల్లించవలసిన బిల్లులు, పన్నులు చెల్లించడం వంటి విషయాల్లో తమకు నిర్దేశించిన 50 కుటుంబాలకు ఈ వాలంటీర్లు సహకరిస్తున్నారు. అలాగే ఈ 50 కుటుంబాల స్థితిగతులను పరిశీలించడం, వారి అవసరాలను ప్రభుత్వానికి తెలియజేయడం వంటివి కూడా వీరి విధుల్లో భాగమే.
ప్రధానంగా ప్రతినెలా పెన్షన్ పంపిణీలో వీరి పాత్ర రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందుతోంది. ప్రతినెలా 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయడంలో ఈ వాలంటీర్లు ఇప్పటికే లబ్ధిదారుల అభిమానం పొందారు. ఒకటో తారీఖు ఉదయం 9 గంటలకల్లా 90 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తున్నారు. నేరుగా లబ్ధిదారుని ఇంటివద్దకే వెళ్ళి పెన్షన్ డబ్బులు లబ్ధిదారుని చేతిలో పెడుతున్నారు. ఈ పెన్షన్ కోసం గతంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు రోజుల తరబడి గ్రామ పంచాయితీ కార్యాలయంలో పడిగాపులు కాయాల్సి వచ్చేది. ఒకటో తారీఖు నుండి పదో తారీఖు వరకు పెన్షన్ ఎప్పుడు ఇస్తారో అంటూ ఎదురు చూడాల్సి వచ్చేది.
పంచాయితీ కార్యాలయంలో నీడ ఉండక, తాగేందుకు మంచినీరు లేక, కూచోడానికి కనీసం బెంచీలు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండేవారు. వృద్ధులు, వికలాంగులు అనేక కష్టాలకోర్చి పంచాయితీ కార్యాలయానికి చేరుకొని రెండు మూడు గంటలు వేచి ఉంటే సదరు అధికారులు తాము తెచ్చుకున్న నగదు అయిపోయిందనో, వేలిముద్రల మిషన్ పనిచేయడం లేదనో, ఇంటర్నెట్ సరిగా లేదనో లబ్దిదారులను తిరిగి పంపించేవారు. ఆ తర్వాత మరోరోజు ఈ అవస్థలు తప్పేవి కాదు. వృద్ధులకు కళ్ళు కనిపించక, నడిచేందుకు కాళ్ళు సహకరించక అష్టకష్టాలు పడుతుండే వారు. కర్ర పోటుతోనో, నేలపై దేకుతూనో వచ్చే వికలాంగులు కూడా అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి నెలనెలా పెన్షన్ డబ్బులు తీసుకోవాల్సి వచ్చేది.
ఇప్పుడు ఈ బాధలు లేవు. పెన్షన్ డబ్బులు మొత్తం లబ్ధిదారుల గడపవద్దకే చేరుతోంది. వాలంటీర్లు నేరుగా ఎవరి పెన్షన్ సొమ్ము వారికి అందజేస్తున్నారు. వాలంటీర్లు అందించే ఈ చేయూత గ్రామాల్లో అలాగే పట్టణాల్లోని బలహీనవర్గాలు, పేద ప్రజలు నివసించే కాలనీల్లో విశేష ఆదరణ పొందుతోంది.
ఇక నెలవారీ ప్రభుత్వం అందించే నిత్యావసరాలు కూడా ఈ వాలంటీర్లు లబ్ధిదారులకు నేరుగా ఇంటివద్దనే అందిస్తున్నారు. కొందరు లబ్ధిదారులు రేషన్ షాపు నుండి తెచుకోగలుగుతారు కానీ వృద్దులు, వికలాంగులు, వితంతువులకు రేషన్ షాపునుండి సరుకులు తెచ్చుకోవడం తలకు మించిన భారమే. ముఖ్యంగా వృద్దులు, వికలాంగులు సరుకులు తెచ్చుకోవడంలో పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తాము మోయలేక ఎవరో ఒకరిని బ్రతిమాలుకునో, ఎంతోకొంత డబ్బు ఇచ్చో తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సరుకులు నేరుగా గడపవద్దకే వస్తున్నాయి.
రాష్ట్రంలో రెండురోజుల క్రితం, జూన్ 1న ఉదయం 9 గంటల లోపే పెన్షన్ల పంపిణీ పూర్తయ్యింది. లబ్ధిదారులు ఆస్పత్రిలో ఉంటే అక్కడికే వెళ్ళి పెన్షన్ అందజేశారు. ఈ పరిస్థితిని చంద్రబాబు చూసినట్టు లేరు. లేదా గమనించి కూడా రాజకీయం చేస్తున్నట్టు ఉన్నారు. లేకపోతే “ఎందుకీ ఉద్యోగం? గోనె సంచులు మోయడానికా?” అంటూ ఎగతాళి చేసి ఉండేవారు కాదు. పైగా “ఇంట్లో మగవాళ్ళు లేని సమయంలో వాలంటీర్లు ఇళ్ళకు వెళ్ళి తలుపులు కొడుతున్నారు. మహిళలను వేధిస్తున్నారు” అంటూ అత్యంత జుగుప్సాకరమైన విమర్శలు చేసేవారు కాదు. అంతటితో ఆగకుండా “ఐదువేల రూపాయల జీతం వచ్చేది కూడా ఓ ఉద్యోగమేనా?” అంటూ ప్రశ్నలు కూడా వేసేవారు కాదు.
అందుకే చంద్రబాబుకు గ్రాస్రూట్స్ తో కనెక్షన్ తెగిపోయింది. వాస్తవాలు తెలియడం లేదు. కనెక్షన్ ఉంటే, వాస్తవాలు తెలిస్తే రెండులక్షల ఎనభైవేల మంది వాలంటీర్లను ఆయన ఈ విధంగా అవమానించే వ్యాఖ్యలు చేసేవారుకాదు. మొత్తం 58 లక్షల 22 వేలమంది లబ్ది పొందుతున్న ఈ పధకం పట్ల, వీరికి లబ్దిచేకూర్చుతున్న వాలంటీర్ల పట్ల చంద్రబాబు ఇంతటి అమానవీయ వ్యాఖ్యలు చేసిఉండేవారు కాదు. ఒకవేళ అలాంటి వ్యాఖ్యలు చేసినా ఇప్పటికి తన వ్యాఖ్యలు తప్పు అని సరిదిద్దుకుని వాలంటీర్లకు క్షమాపణలు చెప్పిఉండేవారు. అయితే అబద్దాలు చెప్పడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం వంటి అనైతిక రాజకీయాలకు అలవాటుపడిన చంద్రబాబు తన తప్పును గ్రహించి వాలంటీర్లను గౌరవిస్తారని ఆశించడం తప్పిదమే అవుతుంది.
Written by Aditya for TeluguRajyam.com