పాలకులు ఎందరో… గుర్తుండేది కొందరే…

అధికారంలో ఉన్న పాలకులకు ప్రజల సంక్షేమం చాలా తక్కువ సందర్భాల్లో గుర్తొస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రధానంగా ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తొస్తారు. అయితే, కొందరు పాలకులు మాత్రమే ఇందుకు మినహాయింపు. అలాంటి మినహాయింపు ఉన్న పాలకులను ప్రజలు సుదీర్ఘకాలం గుర్తుపెట్టుకుంటారు. చరిత్రలో, ప్రపంచంలో, దేశంలో వెతికితే ఇలా ప్రజలు గుర్తుపెట్టుకునే పాలకులు వేళ్ళమీద లెక్కబెట్టవచ్చు. మన రాష్ట్రంలోకి వస్తే మరీ తక్కువ. ఇలాంటి నేతల్లో మొదట చెప్పే పేరు ఎన్టీఆర్. తర్వాత వైఎస్సార్.
 
అన్నం తెలియని వేలాదిమంది నిరుపేద జనానికి రెండురూపాయలకే కిలో బియ్యం ఇచ్చి ఎన్టీఆర్ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పొయ్యిమీద కుండలో రాగిజావ, జొన్న జావ చేసుకుని తాగే జనానికి ఆ కుండల్లో బియ్యం పోశాడు. ఎప్పుడో పండగకో, పెళ్ళికో తినే వరిఅన్నం ఎన్టీఆర్ కారణంగా వేలమందికి రోజూ దొరికింది. అవి పుచ్చిన బియ్యమే కావచ్చు. కానీ బియ్యం తినే భాగ్యం కలిగింది. ఆ అనుభూతి స్వయంగా అనుభవిస్తే గానీ తెలియదు. కిలో రెండురూపాయల బియ్యం ఆరోజుల్లో అంత గొప్ప. అలాగే, ఎక్కడో, ఎన్నో మైళ్ళ దూరంలో ఉండే తాలూకా కార్యాలయాలను కిలోమీటర్ల దూరంలోకి తీసుకొచ్చి ఏ కాగితం కావాలన్నా, ఏ అధికారి సంతకం కావాలన్నా ప్రజలు కష్టపడే పనిలేకుండా చేశారు. ప్రజలవద్దకు పాలన తెచ్చారు. అందుకే జనం ఇప్పటికీ ఎన్టీఆర్ ని గుర్తు పెట్టుకుంటారు. ఇంకా కొన్నేళ్ళు ఆయన అలాగే గుర్తుండిపోతారు.
 
తర్వాత చెప్పుకునే నేత వైఎస్సార్. చదుకు కొనే తాహతు లేక వందలు, వేలమంది గ్రామీణ నిరుపేద యువత నిస్సహాయ స్థితిలో నిలిచి ఉన్న వేలాది, లక్షలాది మంది నిరుపేద యువతకు కార్పొరేట్ విద్య “కొని” ఇచ్చాడు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం గొప్పతనం అది. ప్రభుత్వ కాలేజీలు మినహా కార్పొరేట్ కాలేజీల గేటుకూడా దాటలేని ఎంతో మంది నిరుపేద పిల్లలకు చదువు చెప్పించాడు. మెడిసిన్, ఇంజినీరింగ్ విద్య గురించి వినడమే కాని తాము చదువుదామని ఊహించలేని ఎన్నో లక్షలమంది విద్యార్థులు ఇప్పుడు ఇంజనీర్లుగా మనకు గ్రామాల్లో కనిపిస్తారు. అందుకు వైఎస్సార్ ప్రజలకు చిరస్థాయిగా గుర్తుండిపోతారు.
 
ఇక తర్వాత జలుబు, జ్వరం లాంటి జబ్బులు మినహా ఇతర జబ్బులకు వైద్యం తెలియని ఎన్నో లక్షల మందికి, కార్పొరేట్ వైద్యం అందించారు వైఎస్సార్. ఆగిపోయే ఎన్నో గుండెలను మళ్ళీ కొట్టుకునేలా చేశారు. కంటి చూపు ఇచ్చారు. విరిగిన కాళ్ళూ, విరిగిన చేతులూ తిరిగి ఇచ్చారు. వీటితో పాటు 108, 104 అంబులెన్సులు ఎందరో గర్భిణీలకు పునర్జన్మ ఇచ్చాయి. ఎందరో శిశువులు జన్మించారు. శిశుమరణాలు తగ్గాయి. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు నిలిచాయి. అందుకే అలా పునర్జన్మ పొందిన వాళ్ళు, కంటిచూపు పొందినవాళ్ళు, ఇప్పటికీ, ఎప్పటికీ వైఎస్సార్ ను గుర్తు పెట్టుకుంటారు.
 
Government poster on pension delivery
ఇన్నేళ్ళ తర్వాత, ఈ ఇద్దరి తర్వాత ఇప్పుడు మనరాష్ట్రంలో ప్రజలు గుర్తుపెట్టుకోడానికి సరిగ్గా ఈ ఇద్దరి కోవలోనే, ఈ ఇద్దరు నేతల కలబోతగా వచ్చారు జగన్. కిలోమీటర్ల దూరం నెలనెలా తిరిగి, ఎండకు ఎండి, వానకు తడిసి, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల ఈసడింపులు భరిస్తూ నెలనెలా పింఛను తీసుకునే వృద్ధులు, వికలాంగులు, అభాగ్యులు ఇప్పుడు ఇంట్లో ఉండే పింఛను తీసుకోవడం పరిపాలనలో అనూహ్యమైన పరిణామం. నడిచేందుకు, గంటలకొద్దీ నిలిచేందుకు కాళ్ళు సహకరించని, కంటిచూపు మందగించి దారి సరిగా కనిపించని ఎంతో మంది, నడిచేందుకు కాళ్ళు, ఇచ్చే పింఛన్ తీసుకునేందుకు చేతులు, ఇచ్చిన పింఛన్ ఎంతో చూసేందుకు చూపులేని ఇలాంటి ఎంతో మంది ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని నెలలో మొదటి తారీఖు, మొదటి రెండుమూడు గంటల్లోనే తీసుకోగలగడం ఎంత గొప్ప అనుభూతి! ఇక ఎన్టీఆర్ మైళ్ళ దూరంలో ఉన్న (తాలూకా) అధికారులను కిలోమీటర్ల దూరంలోకి తెస్తే, ఆ కిలోమీటర్ల దూరాన్ని మరింత తగ్గించి పక్క వీధిలో కూచోబెట్టడం (గ్రామ సచివాలయాలు) ఎంత గొప్ప విషయం? అధికార యంత్రంగా ఏకంగా స్వగ్రామంలో, పక్క వీధిలో ఉండడం, ఏ కాగితం కావాలన్నా, ఏ సంతకం కావాలన్నా ఒక్క రోజులోనే దొరకడం ఎంత గొప్ప విషయం? లంచాలు ఇచ్చి పనులు చేయించుకునే వారికి, అన్ని అనుకూలంగా ఉండే వారికీ, అన్ని సదుపాయాలూ ఉన్నవారికి ఇలాంటి అనుభూతులు కలగవేమో కానీ, గ్రామాల్లో వేలాది గుండెలను అడిగితే ఆ అనుభూతి ఏంటో చెపుతారు.
 
ఇక ఇస్తానన్న మూడువేల రూపాయల పెన్షన్ ఇవ్వడం లేదు, మాట తప్పాడు, మడమ తిప్పాడు అని విమర్శించ వచ్చు. గ్రామ సచివాలయాలకు పార్టీ రంగులేశారు అని విమర్శించవచ్చు. విమర్శలదేముంది? రాజకీయమేగా? ఎటునుండి ఎటువైపు అయినా విమర్శించ వచ్చు. కానీ, సామాన్యుడికి, అతి సామాన్యుడికి గడపలో సేవలు అందించడం కంటే గొప్పేముంటుంది? ఇది ప్రజా పాలనలో గొప్ప విజయమే. చదువు వచ్చిన వారు, కార్లు ఉన్నవారు, ఊర్లు తిరిగే వారు, కాస్తో కూస్తో డబ్బున్న వారు, కాలు, కన్ను, చెయ్యి ఉన్నవారు చెప్పేది కాదు. ఇవేవీ లేనివారు చెప్పేది వింటే జగన్ చేపట్టి అమలు చేస్తున్న ఈ రెండు పనులు ఎంత గొప్పవో, లబ్ధిదారునికి ఎంత గొప్ప అనుభూతి ఇస్తుందో తెలుస్తుంది. రాజకీయాలు, అభిమానాలు పక్కన పెట్టి కాసేపు ఆ కంటితో చూడాలి. ఆ గొంతుతో వినాలి. ఆ గుండెతో అనుభూతి చెందాలి. “నేను విన్నాను – నేను ఉన్నాను” అని చెప్పిన జగన్ నిజంగానే వీళ్ళందరి గుండెల్లో గూడుకట్టుకుంటున్నాడు. ఇది జగన్ పై అభిమానంతో రాసిన వ్యాసం కాదు, ఆ ప్రజలు పొందుతున్న అనుభూతిని ఆస్వాదించి రాసిన వ్యాసం. అందుకే మరోసారి చెప్పాలి… పాలకులు ఎందరో… కానీ ప్రజలకు గుర్తుండేది, వారి గుండెల్లో ఉండేది కొందరే.
 
-Aditya for TeluguRajyam.com