జనం ఎంతైనా అసహ్యించుకొనీ గాక…కాండ్రించి ముఖాన ఉమ్మేయనీ గాక…రాధాకృష్ణ మాత్రం తన చంద్రబాబు అజెండాను పాటిస్తూ వారం వారం జగన్ మీద ఉక్రోషపూర్వక నిందలు, అదే సమయంలో చంద్రబాబు భజనలు, జనం మెచ్చిన జగన్ కు శాపనార్ధాలు, జనం ఛీత్కరించి తరిమికొట్టిన చంద్రబాబుకు మెచ్చుకోళ్ళు, సంక్షేమక పథకాలతో దూసుకునిపోతున్న జగన్ కు పాలనా సామర్ధ్యం లేదని అవాకులు చవాకులు పేలడం, పాలనను అవినీతిమయం చేసిన చంద్రబాబును పాలనాదక్షుడిగా అభివర్ణిస్తూ ఋణం తీర్చుకోవడం…ఈ విన్యాసాలు అనంతంగా సాగిపోక తప్పదేమో! తన సామాజికవర్గం వారు, తన యజమాని చంద్రబాబు సమీపబంధువులు విశ్వవిద్యాలయం పేరుతో ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వభూములను దర్జాగా కబ్జా చేస్తే…వారి గూర్చి ఎక్కడైనా తన చెత్త పలుకులో చీల్చి చెండాడుతాడేమో అని చూస్తే…దుర్భిణి వేసి గాలించినా ఎక్కడా ఒక్క అక్షరం ముక్క ప్రస్తావన కూడా కనిపించలేదు…హతవిధీ!!!
****
“”””ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు లేనందువల్ల పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయంలో కోత విధించినా జరిగే నష్టం ఏమీ లేదని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లుంది. ఇలాంటి విషయాలలో కేంద్రాన్ని నిలదీయవలసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి కేంద్ర పెద్దలను చూస్తే చలిజ్వరం వస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అని కలవరించిన పెద్దమనిషి ఇప్పుడా ఊసే ఎత్తకపోవడం, పోలవరం వ్యయంలో కోత విధిస్తున్నా నోరెత్తకపోవడానికి కారణం ఏమిటి? “”””
ప్రాజెక్ట్ వ్యయంలో కోత సంగతి తరువాత మాట్లాడుదాం. అసలు 2014 లో చంద్రబాబుగారు పీఠం ఎక్కడానికి ముందు పదహారు వేలకోట్ల రూపాయల అంచనా వ్యయం కలిగిన పోలవరం ప్రాజెక్ట్ రాత్రికి రాత్రే యాభై అయిదువేల కోట్ల రూపాయలకు వింధ్యపర్వతంలా ఎలా పెరిగింది? ఎన్నికల ప్రచారంలో పదేళ్లు, పదిహేనేళ్ళు ప్రత్యేకహోదా తెస్తాం, ఇస్తాం అంటూ ఘీంకారాలు చేసిన చంద్రబాబు కేంద్రంతో మైత్రి, కేంద్రప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండికూడా కనీసం ఏడాదిపాటైనా ప్రత్యేకహోదా ఎందుకు తీసుకుని రాలేకపోయాడు? అయిదేళ్లపాటు అధికారంలో ఉండికూడా పోలవరం కోసం చంద్రబాబు ఎన్ని వేలకోట్లు నిధులు తెచ్చాడు? పోలవరం ను చంద్రబాబు ఏటీఎం లా వాడుకున్నారు అని ప్రధాని మోడీ విమర్శించినా కూడా చంద్రబాబు ఎందుకు బదులు చెప్పలేదు? ఇప్పుడు మోడీని చూస్తే చలిజ్వరం వస్తున్నది ఎవరికి? అవసరం ఉన్నా లేకపోయినా నిత్యం మోడీ కరుణకోసం పాకులాడుతున్నది ఎవరు?
****
“””తన మద్దతుపై ఆధారపడే పరిస్థితి ప్రధాని నరేంద్ర మోదీకి లేనందున ప్రత్యేక హోదా విషయంలో అడుగుతూ పోవడం మినహా చేయగలిగిందేమీ లేదని అధికారంలోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. జగన్ కూడా సాదాసీదా నాయకుడేనని తెలుసుకోలేకపోయిన ప్రజలు, ఆయన అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తారని ఆశపడ్డారు. “”””
కేంద్రంలో తమ మీద ఆధారపడే ప్రభుత్వం వచ్చి ఉన్నట్లయితే హోదా కోసం డిమాండ్ చేసేవారం. కానీ, బీజేపీకి పూర్తి మెజారిటీ రావడంతో అడుగుతూ పోవడం మినహా మరేమీ చేయలేమని ఎంతో నిజాయితీగా చెప్పిన జగన్మోహన్ రెడ్డిని అభినందించి వెన్ను తట్టాల్సింది పోయి కుత్సితమైన విమర్శలు చెయ్యడం ఒక్క తెలుగుదేశం, రాధాకృష్ణకు మాత్రమే చెల్లింది. నిజాయితీగా వాస్తవచిత్రాన్ని తెలియజేసినవాడు సాదాసీదా నాయకుడు…పోలవరం మార్చ్ నాటికీ అవుతుంది…డిసెంబర్ నాటికి అవుతుంది అంటూ పోచికోలు కబుర్లతో కాలక్షేపం చేసినవాళ్లు గొప్ప నాయకులు కాబోలు రాధాకృష్ణ దృష్టిలో!
****
“”””తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఉండే వైరాన్ని ఆదర్శంగా తీసుకున్న జగన్ రెడ్డి, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అక్కడ అందరూ ఒక్కటవుతారన్న విషయాన్ని మాత్రం గుర్తించడం లేదు. ప్రత్యేక హోదా అటకెక్కింది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు ముప్పు ముంచుకువస్తున్నా ప్రజలలో ఉలుకూ–పలుకూ ఉండకపోవచ్చు.””””
తమిళనాడులో ప్రధాన రాజకీయపార్టీల నడుమ వైరాన్ని ఆదర్శంగా తీసుకున్నది ఎవరు? వైసిపికి అరవై ఏడు సీట్లు లభిస్తే, వారందరిని పశువులను కొన్నట్లు కొనుగోలు చేసి ప్రతిపక్షం అనేదే లేకుండా చెయ్యాలని ప్రయత్నించింది ఎవరు? ప్రత్యేకహోదా అటకెక్కింది చంద్రబాబు పాలనలో కాదా? ప్రత్యేకహోదా సంజీవని కాదు అన్నది ఎవరు? ప్రత్యేకహోదా వలన ఒరిగేది ఏమీ లేదని నిస్సిగ్గుగా ప్రకటించింది ఎవరు? అరవై అయిదు వేలకోట్ల రూపాయల మూటలు వస్తే దానిలో తొంభై శాతం భోంచెయ్యవచ్చని దురాశకు లోనై ప్రత్యేక హోదా ఆశను చంపేసింది చంద్రబాబు కాదా? ప్రజల జ్ఞాపకశక్తి మీద అంత చిన్నచూపా రాధాకృష్ణకు?
*****
“””రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తమిళనాడులోని రాజకీయ పార్టీలను రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు కూడా ఆదర్శంగా తీసుకుంటే బావుంటుంది. ఇందుకోసం ముందుగా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి.””””
వృద్ధనారీ పతివ్రతా అన్నట్లు వయసు ఉడిగాక నీతులు చెప్పడంలో రాధాకృష్ణకు సాటి, పోటీ మరొకరు లేరు. ఆంధ్రప్రదేశ్ కు ముందుగా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాన్ని కూడా కలుపుకుని పోవాలని తన అయిదేళ్ల పాలనలో ఏమైనా ఆలోచన చేసిన దాఖలా ఉన్నదా? ప్రతిపక్షాన్ని డబ్బులతో కొనేసి తనలో కలుపుకోవాలని చూసాడు తప్ప! ఈ సూక్తిముక్తావళిని ఆనాడు చంద్రబాబుకు ఎన్నడైనా చెప్పాడా రాధాకృష్ణ?
****
“”””సాహసమే ఊపిరిగా ముందుకు సాగిపో అని న్యాయవ్యవస్థతో ఢీ కొంటున్న విషయంలో నీలిబ్యాచ్ డప్పు కొడుతుండవచ్చు గానీ విద్యావంతులు మాత్రం ఈ విషయంలో జగన్ వైఖరిని తప్పుబడుతున్నారు. .””””
అంటే….సాహసమే ఊపిరిగా జగన్ సాగిపోతున్నాడని రాధాకృష్ణ ఒకవంక అంగీకరిస్తూ మరోవంక నీలిబాచ్ డప్పు కొడుతున్నదని తన దుఃఖాన్ని దాచుకోలేకపోతున్నాడు! ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డికి అనేకమంది మాజీ సుప్రీంకోర్టు జడ్జీలు, ఉండవల్లి, జయప్రకాశ్ నారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి మేధావులు, ఎంతోమంది విద్యాంతులు మద్దతు ప్రకటించారు. వారంతా నీలి బాచ్ అని రాధాకృష్ణ గారి అభిప్రాయం కావచ్చు! వందలకోట్లు అక్రమంగా సంపాదించి, ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టి, జడ్జీలకు మద్దతు ప్రకటించిన కొందరు లాయర్లు ఏ బాచో రాధాకృష్ణ ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి మరి!
***
“”””ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే భారీ జరిమానాలు విధిస్తూ రాష్ట్రప్రభుత్వం రెండురోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులలో పేర్కొన్న పెనాల్టీలు దారుణంగా ఉన్నాయి. అనవసరంగా హారన్ కొడితే మొదటిసారి వెయ్యి, రెండోసారి అయితే రెండువేలు పెనాల్టీ విధించాలని నిర్ణయించడం ఏమిటి? అనవసరంగా హారన్ కొట్టారని ఎవరు నిర్ణయించాలి? ఇతర నిబంధనలు కూడా ఇలానే ఉన్నాయి. ఈ ఉత్తర్వుల వల్ల అవినీతి పెరిగిపోతుంది. పోలీసులు, రవాణాశాఖ అధికారుల నుంచి వేధింపులు పెరిగిపోతాయి. “”””
ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే భారీ జరిమానాలు విధించేది ఎవరి క్షేమం కోసం? జరిమానాలు “భారీ” అని నిర్ణయించడానికి రాధాకృష్ణ ఎవరు? జరిమానాలు విధించేది నిబంధనలు ఉల్లంఘించేవారికే కానీ, పాటించేవారికి కాదు కదా? అంటే వాహనాలు నడుపుతున్నప్పుడు హెల్మెట్ లేకపోయినా, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా, రాష్ డ్రైవింగ్ చేసినా, రోడ్లమీద నూటయాభై కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసినా, అర్ధరాత్రిళ్ళు రేసింగ్ పేరుతో రెండు వందల కిలోమీటర్ల వేగంతో కట్లు కొట్టుకుంటూ వాహనాలు నడిపినా, రూపాయో రెండు రూపాయలో జరిమానా వేసి వదిలెయ్యాలన్న మాట! నిబంధనలు పాటించకే కదా మాజీ మంత్రి నారాయణ కుమారుడు మరణించింది? ప్రజల శ్రేయస్సుకోసం శిక్షలు, జరిమానాలు భారీగా నిర్ణయించడం తప్పా? రాధాకృష్ణ చెప్పేది ఎలా ఉందంటే…హత్య, మానభంగం లాంటి నేరాలకు పాల్పడ్డవారికి ఉరిశిక్ష లాంటి భారీ శిక్ష వేస్తారా అని విమర్శించినట్లుంది. లేకుంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్లు రెండు బెత్తం దెబ్బలు కొట్టి వదిలెయ్యలేమో! ఇక రవాణా అధికారులు, పోలీసులు అవినీతికి పాల్పడితే ఏమి చెయ్యాలో ప్రభుత్వం చూసుకుంటుంది. రాధాకృష్ణ మాత్రం జరిమానాలకు భయపడితే ఆంధ్రాలో కాలు పెట్టకపోవడం మేలు!
***
ముఖ్యమంత్రి సమక్షంలో జరుగుతున్న సమీక్షలు కూడా ఆషామాషీగా ఉంటున్నాయి. సమస్య లోతుల్లోకి వెళ్లకుండా, ఉపరితల విన్యాసం చేసుకుంటూ పోవడం వల్ల అధికారులు కూడా యాంత్రికంగానే పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిద్దరు అధికారులు ప్రభుత్వంలో పూర్తిస్థాయి పెత్తనం చలాయిస్తున్నారు. ఈ విషయం జగన్ రెడ్డికి తెలుసో లేదో గానీ ప్రభుత్వం మాత్రం విమర్శలపాలవుతోంది.”””
భేష్! అనగా ఒక ముఖ్యమంత్రి సమీక్షలు ఎలా చెయ్యాలో, ఎంతసేపు చెయ్యాలో కూడా నిర్ణయించడానికి అక్కడున్నది చంద్రబాబు కాదు…జగన్మోహన్ రెడ్డి అని గుర్తుంచుకోవాలి. చంద్రబాబులాగా పది పన్నెండు గంటల సేపు సమీక్షలు చేస్తూ, ప్రభుత్వాధికారుల సహనాన్ని పరీక్షిస్తూ, వారిని క్షేత్రస్థాయిలో పనులు చెయ్యకుండా సమీక్షల పేరుతో కాలం వృధా చెయ్యాలన్నమాట! ముఖ్యమంత్రి సమీక్షలు చేస్తుంటే, డయాబెటిస్ ఉన్న అధికారులు స్పృహతప్పి పడిపోవాలన్న మాట! అప్పుడే సమీక్షలు చేసినట్లు! వ్యర్థులు, అసమర్ధులు మాత్రమే మాటల గారడీతో కాలక్షేపాలు చేస్తుంటారు అన్న సత్యం రాధాకృష్ణకు తెలియకపోవచ్చు!
.
****
“”””తిరుమల తిరుపతి దేవస్థానం బ్యాంకుల వద్ద డిపాజిట్ చేస్తున్న నిధులను రాష్ట్రప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలో డిపాజిట్ చేయించాలన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక అధికారి తీసుకున్నారట. దానిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇలాంటి ఉదంతాలు ఎన్నో! “””
అవును మరి! దేవస్థానం నిధులను చంద్రబాబు హయాంలో చేసినట్లు ఇవాళో రేపో దివాళా తీయబోయే ప్రయివేట్ బ్యాంకుల్లోనే డిపాజిట్ చెయ్యాలి! దండిగా కమీషన్లు దంచుకోవాలి. ప్రతి నయాపైసాకు కూడా గ్యారంటీ ఉండే ప్రభుత్వ బాండ్లలో పెట్టడం ఘోరమైన అపచారం! జరగాల్సిన డామేజ్ జరిగిపోయిందన్న మాట నిజమే…ప్రయివేట్ బ్యాంకులకు, బ్రోకర్లకు చాలా పెద్ద డామేజ్ జరిగిపోయింది! పాపం!!
****
“”””తాను వెళ్లలేకపోయిన వరద ప్రాంతాల సందర్శనకు మంత్రులు, అధికారులను ఆయన పంపవచ్చు కదా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హైదరాబాద్‌లో వరద ప్రాంతాలను సందర్శించి బాధితులను ఓదార్చలేదు. ఆ లోటును భర్తీ చేయడం కోసం తన కుమారుడైన మంత్రి కేటీఆర్‌కు ఆయన ఆ బాధ్యత అప్పగించారు. “”””
నిజమే… చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గంటలుగంటలు పర్యటిస్తూ అధికారులు అందరినీ తన చుట్టూ తిప్పుకుంటూ సహాయకార్యక్రమాలు చెయ్యడానికి అధికారులకు అవకాశం ఇచ్చేవారు కాదు. ముఖమంత్రి చుట్టూ తిరగడానికే మాకు సమయం అంతా వృధా అవుతున్నదని అధికారులు వాపోతుండేవారు. ఆ మర్మం తెలుసు కాబట్టే కేసీఆర్ బయటకు వెళ్లకుండా అధికారులకు, మంత్రులకు ఆదేశాలు ఇస్తూ సహాయకార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు. కేసీఆర్ తన కొడుకు హోదాలో కెటియార్ ను పంపించడం లేదు. ఒక మంత్రిగా ఆయన్ను పంపిస్తున్నారు. ఒక్క కేటీఆర్ మాత్రమే కాదు…తలసాని, సబితా ఇంద్రారెడ్డి లాంటి ఇతర మంత్రులు కూడా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు! చంద్రబాబు కరోనాకు భయపడి హైదరాబాదులో దాక్కుని, వరదప్రాంతాల్లో డ్రామాలు ఆడటానికి తన కొడుకుని వినియోగించుకుంటూ అభాసుపాలయ్యారు!
***
“””ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన అమరావతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి ఐదేళ్లు పూర్తి అయింది. ఐదేళ్ల తర్వాత రాజధాని అంశం మళ్లీ మొదటికి వచ్చింది. అమరావతిని పురిటిలోనే సమాధి చేయాలని జగన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర రాజధాని ఏది అనేది ప్రశ్నార్థకమైంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆందోళన చేస్తున్న రైతులను హేళన చేస్తున్నారు,””””
మొత్తానికి ఒక నిజమైన నిజాన్ని కక్కేశారు రాధాకృష్ణ! అమరావతి శంకుస్థాపన జరిగి అయిదేళ్లయింది. ఈ ఐదేళ్లలో నాలుగేళ్లు చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారాన్ని వెలగబెట్టారు. ఆరేళ్ళ తరువాత అంశం మళ్ళీ మొదటికి వచ్చింది అంటే..చంద్రబాబు అయిదేళ్లపాటు ఏమీ చెయ్యలేదని కదా అర్ధం! నలభైఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబు ఏమీ చెయ్యలేకపోతే, ఏడాది కాలంలో జగన్ ఎలా చెయ్యగలడు? అమరావతి నాటకం మొదలై ఐదేళ్లు గడిస్తే ఇంకా పురిట్లో నాశనం చెయ్యడం ఏమిటి? అయిదేళ్ల తరువాత కూడా పురిటిదశే అంటారా రాధాకృష్ణగారి నిఘంటువులో? రాజధాని అనేది పదమూడు జిల్లాలకు సంబంధించిన అంశం. కేవలం మూడు గ్రామాలలోని రైతులు కూర్చుని దీక్షలు చేస్తుంటే అది ఉద్యమం అవుతుందా? నేడు ఆ రైతుల దీక్షను డ్రామా అంటూ రాష్ట్రం మొత్తం అవహేళన చేస్తున్నది!
***
“”””రాజధానికి భూములిస్తామని రైతులు తమంతట తాము ముందుకు రాలేదు. ఆనాటి ప్రభుత్వం వారికి నచ్చజెప్పి భూములు తీసుకుంది. తమ భూములలో రాజధాని వేస్త తమకు లభించే స్థలాల రేట్లు పెరుగుతాయన్న ఆశతోనే రైతులు భూములిచ్చారు. ఇలా ఆశపడటం తప్పు కాదే! “”””
హరే! అదేమిటి? నన్ను చూసి నా ముఖారవిందం చూసి ఇరవై తొమ్మిదివేలమంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి తమ పొలాలు ఇచ్చారని చంద్రబాబు స్వకుచమర్దనం చేసుకుంటుంటే రైతులు తమంతట తాము ముందుకు రాలేదని అంటాడు మన రాధాకృష్ణ! నచ్చచెప్పటం అంటే అరటి తోటలను, పొలాలను అర్ధరాత్రి తగలబెట్టడం కాబోలు! మరొక హాస్యాస్పదమైన ప్రకటన కూడా! రాజధాని వస్తే తమకు లభించే స్థలాల రేట్లు పెరుగుతాయని ఆశతోనే రైతులు భూములు ఇచ్చారట! మరి అందులో త్యాగం ఎక్కడుంది రాధాకృష్ణ గారూ? చంద్రబాబు గారు పొలాలకు మంచి ధర ఇచ్చారు…స్థలం ఇచ్చారు. కమర్షియల్ స్థలం ఇచ్చారు…ఇన్ని కానుకలు ఇచ్చి వేలాది ఎకరాలను చంద్రబాబు కారు చౌకగా కొట్టేసి, తన భృత్యులకు కట్టబెట్టి లక్షలకోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యాలని ఆశపడితే…దానికి రైతుల త్యాగం అంటూ కవరింగ్ ఏమిటి?
***
“భవిష్యత్తులో మరొకరు అధికారంలోకి వచ్చి రాజధానిని మార్చబోరన్న గ్యారెంటీ ఏముంటుంది? ఇలా అయితే పెట్టుబడిదారులు ముందుకు వస్తారా? ప్రభుత్వానికి ఇవేమీ పట్టడం లేదు. ముఖ్యమంత్రి జగన్‌కు మనసులో ఏ దురుద్దేశం లేకపోతే ఆందోళన చేస్తున్న రైతులకు న్యాయం చేస్తానని ఎందుకు హామీ ఇవ్వడం లేదు. పైపెచ్చు మూడు రాజధానులు కావాలంటూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారితో పోటీ ధర్నాలు చేయించడం ఏమిటి? మూడు రాజధానుల నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన తర్వాత ఆందోళనల అవసరం ఏమిటి?”
నిజమే కదా! ఈ ఐదేళ్లు కూడా జగన్ రాజధానిని నిర్మించకుండా కాలక్షేపం చేసి, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు రావడం జరిగితే రాజధాని మళ్ళీ మారిపోతుంది అనడంలో సందేహమే లేదు. అలా జరగాలనే కదా చంద్రబాబు హైకోర్టును అడ్డం పెట్టుకుని అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డు తగులుతున్నారు! కానీ, రాధాకృష్ణ పగటి కలలు అంత సులభంగా సాకారం అవుతాయా?
****
“””భూములిచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని గత ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెప్పేవారు. నాడు పాదాభివందనాలు అందుకున్న రైతులు ఇప్పుడు ఈసడింపులకు గురవుతున్నారు. “””
తన గారడీ మాటలకు లొంగిపోయి, ఒక కులరాజధానిని నిర్మించాలని, లక్షల కోట్ల రూపాయలు ఆర్జించాలనే చంద్రబాబు దురాశకు బలైపోయిన అమాయక రైతులకు పాదాభివందనమేమి ఖర్మ? సాష్టాంగ దండప్రమాణాలు కూడా ఆచరిస్తాడు చంద్రబాబు!
****
“”””ఇందులో 20 వేల కోట్లకు మించి ఇవ్వబోమని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేయడం, దాంతో మంత్రి బుగ్గన హడావిడిగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవడం జరిగింది. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆంధ్రుల కలల ప్రాజెక్ట్ పోలవరం పూర్తి అవుతుందా? అన్న సందేహం నెలకొంది. ముంపు ప్రాంత ప్రజలకు నష్టపరిహారంతో పాటు పునరావాసం కల్పించకుండా ముందుగా నిర్ణయించిన డిజైన్ల ప్రకారం ప్రాజెక్టును పూర్తిచేయడం అసాధ్యం””””
చివరాఖరుకు తన మనసులోని కోరికను బయటపెట్టాడు రాధాకృష్ణ. పోలవరానికి నిధులు రాకూడదు. ఆంధ్రుల కలల ప్రాజెక్ట్ పూర్తి కాకూడదు. నష్టపరిహారం రాకూడదు. నిర్ణయించిన డిజైన్ల ప్రకారం ప్రాజెక్ట్ పూర్తి చెయ్యకూడదు! అంతే కదా !
****
“”””రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకుండా భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలు కొనసాగించినంత మాత్రాన జగన్‌కు ఒరిగేదేమీ ఉండదు. కీలకమైన బిల్లులు, ఇతర అంశాల్లో వైసీపీ సహకారాన్ని పొందుతున్న కేంద్ర పెద్దలు ప్రతిగా రాష్ర్టానికి కనీస న్యాయం కూడా చేయలేదన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడుతోంది. బీజేపీ, వైసీపీ మధ్య లాలూచీ కారణంగా రాష్ర్టానికి నష్టం జరుగుతోందని ప్రజలు గ్రహించిన రోజు ఉభయపక్షాలూ రాజకీయంగా నష్టపోవడం ఖాయం!”””
అలాగా! మరి చంద్రబాబుగారు నాలుగేళ్లపాటు భారతీయ జనతా పార్టీతో ఎందుకు సత్సంబంధాలు కొనసాగించారు? చంద్రబాబు పాలనలో కేంద్రం రాష్ట్రానికి కనీస న్యాయం ఎందుకు చెయ్యలేకపోయింది? బీజేపీ, టిడిపి మధ్య పొత్తు కారణంగా రాష్ట్రానికి ఒరిగింది ఏమిటి? బీజేపీతో పొత్తు పెట్టుకున్న టిడిపి ఏమీ సాధించలేకపోయింది. బీజేపీతో పొత్తులేని జగన్ ఎలా నష్టపోతాడు. రాష్ట్రానికి బీజేపీ ఏమీ చెయ్యకపోతే బీజేపీ నష్టపోవాలి కానీ, వైసిపి ఎందుకు నష్టపోతుంది? చంద్రబాబులాగా జగన్ మాయమాటలు చెప్పి జనాన్ని మోసం చెయ్యడంలేదే! తడవకో కేంద్రమంత్రిని రాష్ట్రానికి తెచ్చి వేలకోట్లు నిధులు ఇస్తామంటూ గారడీమాటలు చెప్పించడం లేదే! జనం అన్నీ చూస్తున్నారు. జనం అన్నీ గమనిస్తున్నారు. నువ్వేమీ వర్రీ కాబోకు రాధాకృష్ణ! జరిగేవి జరగనీ!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు