హోదా రాదు.. ప్యాకేజీ గురించి తెలీదు.. ఇది అధికార పార్టీ వైఖరి

Pilli Subhash Chandra Bose
రాష్ట్రం విడిపోయే ముందు ఆంధ్రా వాసులకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా తాయిలం చేతిలో పెట్టి ఊరుకునేలా చేశారు.  ఆ తర్వాత అధికారంలోకి రావడానికి టీడీపీ హోదా సాధించి తీరుతామన్నారు.  ఆ రోజు టీడీపీతో పొత్తులో ఉన్న భాజపా కూడా ఏపీకి హోదా ఇస్తామని మాటిచ్చింది.  కానీ తీరా గెలిచాక హోదా లేదని చేతులు తిప్పేశారు.  చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని నాళ్లు హోదా మీద పోరాటం సాగిస్తామనే మాటలతో, పొలిటికల్ స్టంట్లతో కాలం గడిపారు.  ఇక ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ కూడా హోదా ఇచ్చి తీరాలని, తాము అధికారంలోకి వస్తే హోదా తెస్తామని వాగ్దానం చేశారు.  అంతేకాదు అన్ని ఎంపీ స్థానాల్లో తమనే గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతాం అన్నారు.  
 
 
తీరా జనం అఖండ మెజారిటీతో గెలిపించాక ఇప్పుడేం చేయలేం, కేంద్రానికి మన అవసరం లేదు, సమయం వచ్చినప్పుడు సత్తా చూపి హోదా అడుగుదాం అంటూ మాటలు చెబుతూ వచ్చారు.  దీంతో జనం హోదా మీద జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శలు గుప్పించారు.  ప్రతిపక్షం టీడీపీ అయితే తాము అనుసరిస్తున్న దాటవేత ధోరణే వైకాపా కూడా పాటిస్తుండటంతో హోదా మీద అధికార పార్టీని పెద్దగా ఒత్తిడి చేయలేకపోయారు.  ఇక జనసేన నేత పవన్ కళ్యాణ్ అయితే అడపాదడపా హోదా గురించి మాట్లాడినా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.  దీంతో హోదా విషయంపై కేంద్రాన్ని నిలదీసే పార్టీ కానీ లీడర్ కానీ లేకుండా పోయారు. 
 
 
చంద్రబాబును ఎన్నికల్లో ఓడించడానికి హోదా సాధనలో వారికి చిత్తశుద్ది లేకపోవడం కూడా ఒక కారణం కాబట్టి ఆయన్ను ఇప్పుడు జనం నిలదీయలేరు.  ఇక జనసేన పట్ల ఎన్నికల్లో జనం అంతగా మొగ్గుచూపలేదు కనుక ఆయన్ను కూడా పోరాడమని డిమాండ్ చేయలేరు.  ఇక మిగిలింది, హోదాకు ఏకైక జవాబుదారీ అయిన వైఎస్ జగన్.  ఎన్నికల ముందు ఆయనిచ్చిన వాగ్దానాల్లో హోదా కూడా ఒకటి కాబట్టి ఆ భాద్యత వైకాపాకు ఎక్కువే ఉంది.  కానీ ఆ బాద్యతను ఆ పార్టీ విస్మరించింది.  రికార్డ్ స్థాయిలో 22 ఎంపీ స్థానాలు కట్టబెట్టినా కేంద్రంలో మన ఎంపీలు గళం వినిపించడంలో వైఫల్యం చెందారు.  ఏరోజూ కేంద్రం ముందు హోదా డిమాండ్ వినిపించిన దాఖలాలు లేనేలేవు.  
 
 
పైగా పార్లమెంట్లో బీజెపీ ఎలాంటి బిల్లు ప్రవేశపెట్టినా దారాళంగా మద్దతిస్తున్నారు.  సరే హోదా సంగతి అటుంచితే ప్రత్యేక ప్యాకేజీ అన్నారు కదా మరి దాని సంగతేమిటని అంటే దానికీ ఆన్సర్ లేదు.  అసలు ప్యాకేజీ కింద ఎన్ని నిధులు రావాలి, ఇప్పటి వరకు ఏమైనా ఇచ్చారా, ఇవ్వకపోతే ఎప్పుడు వస్తాయి అనే విషయాలపై కనీస సమాచారం కూడా మన ఎంపీలు ప్రజలకు చెప్పడం లేదంటే వారి చిత్తశుద్ది ఏమిటో అర్థమవుతూనే ఉంది.  ఇక అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల లూప్ హోల్స్ బాగా పట్టిన మోడీ సర్కార్ హోదా, ప్యాకేజీ అంశాల మీద మాట్లాడకుండా వారిని నొక్కిపెడుతోంది.
 
తాజాగా మీడియాతో మాట్లాడిన వైకాపా ముఖ్య నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ హోదా, ప్యాకేజీల మీద మైండ్ బ్లాకయ్యే స్టెట్మెంట్ ఇచ్చారు.  ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదేమోనని అనుకుంటున్నా. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ సుదీర్ఘ పోరాటం చేశారు.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని నాకైతే నమ్మకం లేదు.  ఇది నా వ్యక్తిగత అభిప్రాయం’ అన్నారు.  ఇక ప్యాకేజీ గురించి మాట్లాడుతూ దాని గురించి పెద్దగా తెలీదన్నట్టు మాట్లాడారు.  ఇలా రేపో మాపో పార్లమెంట్ కు వెళ్ళనున్న నేత, అవసరమైతే రాష్ట్ర అవసరాల గురించి కేంద్రంతో పోరాడాల్సిన రాజ్యసభ సభ్యుడు ఇలా నమ్మకం లేదు, తెలీదు అనడంతో ఇక ఏపీ ప్రజలు హోదా విషయంలో ఇకపై వైకాపా మీద నమ్మకం పెట్టుకోవాల్సిన పని లేదని స్పష్టమైంది.