సినీ ప్రతినిధుల బృందం పై జగన్ కార్యాలయం ఆంక్షలు!

Chiranjeevi with YS Jagan

ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై .ఎస్ .జగన్ మోహన్ రెడ్డి తో  సమావేశం అయ్యేది కేవలం ఏడుగురు మాత్రమే. అయితే జగన్ మోహన్ రెడ్డి తో సమావేశంకావడానికి  తెలుగు సినిమా ప్రతినిధులు రెండురోజుల నుంచి కసరత్తు చేసి 25 మంది ఖరారు చేశారు. ఈ లిస్టును ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపగా వారు కేవలం ఏడుగురిని మాత్రమే అనుమతిస్తామని చెప్పడం సినిమా రంగ ప్రముఖుల ఆశలమీద నీళ్లు పోసినట్టు అయ్యింది.

చిరంజీవి  నాయకత్వంలో ఈ ప్రతినిధి బృందంలో నాగార్జున , జి .ఆదిశేషగిరావు ,అరవింద్ , సురేష్ బాబు, కె .ఎల్ .నారాయణ , ఎన్వీ .ప్రసాద్., జెమినీ కిరణ్, టాగోర్ మధు ,ఎస్ .ఎస్. రాజమౌళి , కొరటాలశివ , త్రివిక్రమ్ శ్రీనివాస్ ,ఛాంబర్ ప్రెసిడెంట్  నారంగ్ , కార్యదర్శులు దాము , ముత్యాల రమేష్ ,నిర్మాతల మండలి అధ్యక్షుడు ,సి .కళ్యాణ్ , కార్యదర్శులు తుమ్మల ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల , మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ , కార్యదర్శి జీవిత, ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు కొమర వెంకటేష్, కార్యదర్శి  తో  పాటు జగన్మోహన్ రెడ్డి క్లాస్ మేట్ యార్లగడ్డ సుమంత్ వున్నారు.

మంగళవారం మధాహ్నం 3 గంటకు  జగన్ మోహన్ రెడ్డి తో ఈ సమావేశాన్ని మూడురోజుల క్రితం నిర్ణయించారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత తెలుగు సినిమా రంగ ప్రతినిధులు మొదటిసారి కలుసుకోబోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావుతో చిరంజీవి, నాగార్జున ,కొంత మంది నిర్మాతలు, దర్శకులు సమావేశమయ్యారు. అయితే అది సినిమా సమావేశం కాదనే విమర్శలు వచ్చాయి. దీనిపై  బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు అందుకే అలాటి పొరపాట్లు,
జరగకుండా జగన్ మోహన్ రెడ్డి ని కలిసే ప్రతినిధి వర్గంలో సినిమా రంగంలోని అన్ని శాఖల  ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్త పడినట్టు తెలిసింది.

తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రతినిధులంతా మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి కారుల్లో బయలుదేరి లంచ్ టైమ్ కు కృష్ణా నది కరకట్ట మీద వున్న గోకరాజు రంగరాజు గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు.  అక్కడ 150 మందికి  విందు భోజనం ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలిసింది. లంచ్ తరువాత  సరిగ్గా 2. 45 గంటలకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. ఇది ప్రోగ్రామ్ అయితే ఇంతమంది ప్రతినిధులను అనుమతించేది లేదని కేవలం ఏడుగురు మాత్రమే వుండాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆంక్ష పెట్టినట్టు తెలుస్తుంది.

చిరంజీవి నాయకత్వంలో నాగార్జున, దగ్గుబాటి సురేష్ బాబు ,ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి  దాము, తెలుగు చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్ , దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి  మరొకరిని  మాత్రమే తీసుకురావాలి ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టంగా చెప్పినట్టు తెలిసింది. దీనిపై చాలామంది తమ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

-భగీరథ