రాజ్యసభ ఎన్నికలు…టిడిపి ట్విస్ట్ ఇదే !!

రేపు 8 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.  వాటిలో ఏపీతో పాటు గుజరాత్, జార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి.  ఈ ఎన్నికలు మార్చి 26న జరగాల్సి ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడి రేపు 19వ తేదీన జరగనున్నాయి.  అన్ని రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల నడుమ గట్టి పోటీ నెలకొని ఉండగా ఏపీలో మాత్రం చిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది.  రేపు మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.  ఈ నాలుగు స్థానాల్లో వైసీపీ నుండి రాష్ట్ర మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీలు పోటీలో ఉండగా టీడీపీ తరపున వర్ల రామయ్య బరిలో ఉన్నారు.

ఈ ఓటింగ్లో ఏపీలోని మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.  ఈ 175 మందిలో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కాగా 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఒకరు జనసేన ఎమ్మెల్యే ఉన్నారు.  వీరిలో వైకాపా అభ్యర్థులు నలుగురికి ఓటు వేయడానికి 151 మంది ఎమ్మెల్యేలు సిద్దంగా ఉండగా టీడీపీ నుండి బయటికి వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధరరావు, కరణం బలరామ్ కూడా అనధికారికంగా వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు.  అలాగే జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వైసీపీకే మద్దతుగా ఉన్నారు.
ఒక్కో రాజ్యసభ అభ్యర్థి గెలవాలంటే 34 ఎమ్మెల్యే ఓట్లు దక్కించుకోవాల్సి ఉంటుంది.  ఎలాగూ వైసీపీ తమ 151 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే విప్ జారీ చేసిన నేపథ్యంలో వైసీపీ నలుగురు అభ్యర్థుల గెలుపు ఖాయమైపోనట్టే.  వీరికి బయటి పార్టీ ఎమ్మెల్యేల ఓట్లు కూడా అవసరం లేదు.  ఒక్కో అభ్యర్థికి 38 మంది ఎమ్మెల్యేలను కేటాయించింది అధిష్టానం.  దీంతో టీడీపీ నుండి బయటికి వెళ్లిన ఎమ్మెల్యేల చుట్టూనే ఆసక్తి నెలకొంది.  ఎందుకంటే వీరు టీడీపీ నుండి బయటకు వెళ్లినా వైసీపీలో అధికారికంగా చేరలేదు.  కాబట్టి టెక్నికల్ గా వీరు టీడీపీ ఎమ్మెల్యేలే.  ఈ అవకాశాన్నే తెలుగుదేశం వాడుకొని పిరాయింపు ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టాలనే వ్యూహం పన్నింది.
అందుకే పార్టీలో మిగిలిన 20 మంది ఎమ్మెల్యేలతో పాటు ఆ ముగ్గురికి కూడా తమ అభ్యర్థి వర్ల రామయ్యకు ఓటు వేయాలని విప్ జారీచేసింది.  ఈ విప్ ను కాదని ఆ ముగ్గురు వైసీపీ అభ్యర్థులకు ఓటు వేసినా లేకపోతే అసలు ఓటింగ్లోనే పాల్గొనకపోయినా విప్ ను ధిక్కరించినట్టే అవుతుంది.  అప్పుడు అధిష్టానం వారి మీద అనర్హత వేటు వేస్తుంది.  ఇదే రేపటి ఎన్నికల్లో టీడీపీ యాక్షన్ ప్లాన్.  అంతేకానీ సంఖ్యా బలం లేకపోయినా వర్ల రామయ్యను బరిలో దింపి గెలిచేసే ప్రయత్నమైతే కాదు.  ప్రజల్లో సైతం ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి పెద్దగా లేదు.  ఎందుకంటే వారికి కూడా ఆ నాలుగు సీట్లు వైసీపీకే దక్కుతాయని తెలుసు.
కానీ టీడీపీ పిరాయింపు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎవరికి ఓటు వేస్తారనేదే సర్వత్రా చర్చనీయాంశమైంది.  ఆ ముగ్గురు గనుక అనర్హత వేటు నుండి తప్పించుకోవాలంటే టీడీపీకి ఓటు వెయాలి.  అలా వేయడం వలన వైసీపీ అభ్యర్థులు ఓడిపోయేది లేదు టీడీపీ అభ్యర్థికి వర్ల రామయ్యగారు గెలిచేసేదీ లేదు.  అలా కాకుండా టీడీపీ మీద కోపంతో వైసీపీ అభ్యర్థులకే ఓటు వేస్తే అనర్హత వేటుకు గురికావాల్సి ఉంటుంది.  ఈ నేపథ్యంలో వారి మద్దతు ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది.  వెలగపూడి అసెంబ్లీలో ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు ఓటింగ్ జరగనుండగా ఈ రాత్రికే ఫలితాలు వెల్లడవుతాయి.