ఒక రాజకీయ విశ్లేషకుడిగా, రచయితగా, ప్రజాస్వామ్య ప్రేమికుడిగా మీడియాను నియంత్రించాలనుకునే ఆలోచనలను నేను తిరస్కరిస్తాను. మీడియా అనేది ప్రజాస్వామ్యానికి ఆలంబన. మీడియా అనేది మత్తేభాలలాంటి ప్రభుత్వ దుర్విధానాలను అదుపులో ఉంచే పదునైన అంకుశం. “వెయ్యి తుపాకులకు భయపడను కానీ, పత్రికలను చూస్తే భయపడతాను” అనే ఫ్రెంచ్ నియంత నెపోలియన్ కొటేషన్ సుప్రసిద్ధం. దేశానికి ప్రధమ ప్రధాని జవహర్లాల్ నెహ్రు తన మీద పత్రికల్లో ప్రచురించబడే విమర్శలను, కార్టూన్లను చూసి ఆనందించేవారట. జర్నలిస్టులన్నా, సంపాదకులన్నా ఒకప్పుడు ఎంతో గౌరవాభిమానాలు సమాజంలోనే కాక ప్రభుత్వ పెద్దల్లో కూడా కనిపించేవి. పత్రికాసంపాదకులతో అపుడపుడు సమావేశాలు నిర్వహించేవారు తొలినాళ్లలో ప్రధానులు, ముఖ్యమంత్రులు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, నీలం సంజీవరెడ్డి, జలగం వెంగళరావు ప్రభృతులు సంపాదకులతో చాలా సన్నిహితంగా ఉండేవారు. వారితో సన్నిహితంగా ఉన్నంతమాత్రాన ఆయా నాయకులకు భజనలు చేసేవారు కారు సంపాదకులు. స్నేహం స్నేహమే, వృత్తిధర్మం వృత్తిధర్మమే అన్నట్లు ఉండేది. నార్ల వెంకటేశ్వర రావు గారు ఆంధ్రజ్యోతి సంపాదకులుగా ఉన్నప్పుడు సంజయ్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటన గూర్చి ప్రత్యేక అనుబంధాన్ని వెలువరించాలని ఆ పత్రిక యజమాని కె ఎల్ ఎన్ ప్రసాద్ ఆదేశించినప్పటికీ తిరస్కరించారని అంటారు! పత్రికా సంపాదకులు తమ ఆత్మగౌరవాన్ని ఆ స్థాయిలో కాపాడుకునే వారు!
అయితే అత్యవసర పరిస్థితి విధించిన ఇందిరాగాంధీ హయాంలో పత్రికా స్వాతంత్య్రానికి ముప్పు ఏర్పడింది. మీడియా స్వాతంత్య్రాన్ని ఉక్కుపాదంతో అణిచివేసారు ఆమె. అయితే నాటితో పోలిస్తే నేడు అణచివేత అంతకన్నా ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎవరూ పట్టించుకోవడం లేదు. దేశంలోని పత్రికలు, మీడియా సంస్థలు పార్టీలవారీగా చీలిపోయాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కులాలవారీగా చీలిపోయాయి. తమ కులస్తులైన నాయకులు సారధ్యం వహిస్తున్న పార్టీలు ఎంత దుర్మార్గాలు చేసినా, దోపిడీలు చేసినా, నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నాయి. అదే సమయంలో తమకు వ్యతిరేకులైన పార్టీల నాయకుల మీద ఎంత బురద చల్లడానికైనా తెగిస్తున్నాయి. తమ కులస్తులు అధికారంలో ఉన్నప్పుడు వ్యాపార ప్రయోజనాలను భారీ స్థాయిలో అనుభవిస్తున్నాయి. పాలకులు కూడా తమ మీద విమర్శలను సహించలేకపోయారు. తమకు వ్యతిరేకంగా వార్తలను రాస్తే తట్టుకోలేకపోతున్నారు. ఇక వారికి భజనలు చేసే కుహనా మేధావులు, గుడ్దిభక్తులు తమ నాయకులను ఎవరైనా విమర్శిస్తే వారిని దేశద్రోహులుగా ముద్ర వెయ్యడానికి బరితెగిస్తున్నారు. విమర్శకుల మీద దాడికి తెగబడుతున్నారు. మొత్తానికి పత్రికారంగం అంతా గత పాతికేళ్లుగా కలుషితమై పోయింది.
పత్రికలు సమాజహితం కోసం పనిచేస్తే వారిని సమర్ధించాల్సిందే. కానీ, పత్రికలు స్వార్ధప్రయోజనాలకోసం పనిచేస్తున్నప్పుడు, తమకు నచ్చనివారిమీద అబద్ధాలు, ఆరోపణలతో కూడిన కల్మషం వెదజల్లుతున్నప్పుడు, తమ బాధలను సమాజ బాధలుగా చిత్రిస్తున్నప్పుడు కూడా మీడియా స్వేచ్ఛ పేరుతో సమర్ధించాల్సిందేనా?
తెలుగు రాష్ట్రాల్లో మీడియా అనేది వ్యభిచారిణి కన్నా ఘోరంగా దిగజారిపోయింది. తమ కులస్తుల దుర్మార్గాలను కప్పిపుచ్చడానికి ఎంత నీచానికైనా తెగిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కేసీఆర్ మీద మన పచ్చమీడియా ఎంతగానో దిగజారిపోతూ హేళనాపూర్వక ప్రసారాలకు తెగించింది. కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ప్రజాహితమైన కార్యక్రమాలు చేపట్టినా, వాటిగూర్చి లేశమాత్రం చెప్పకుండా, తప్పుడు ఆరోపణలు చేస్తూ అసత్యపూరిత కార్యక్రమాలను ప్రసారం చేసింది. దాంతో కుపితుడైన కేసీఆర్ కొన్ని పచ్చ ఛానెళ్లమీద ఆగ్రహించారు. వాటి ప్రసారాలను బందు చేయించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, పత్రికాస్వాతంత్రాన్ని హరిస్తున్నారని ఆందోళనలు చేసినా, ప్రెస్ కౌన్సిల్ కు, న్యాయస్థానాలకు ఎక్కి రచ్చ చేసినా, కేసీఆర్ చలించలేదు. చివరకు కేంద్ర మంత్రులు కూడా కేసీఆర్ ను హెచ్చరించారు. పార్లమెంట్ లో సైతం కేసీఆర్ ను బెదిరిస్తూ, బహిష్కరించిన చానెళ్లను అనుమతించాలని ప్రకటనలు చేసారు. అయినప్పటికీ కేసీఆర్ ఏమాత్రం లొంగలేదు. తొమ్మిది మాసాలు గడచినా కేసీఆర్ దిగిరాలేదు సరికదా మరింత నట్లు బిగించారు. దాంతో పచ్చ చానెళ్లు గిలగిలా కొట్టుకుని చివరకు చేసేదేమీ లేక కేసీఆర్ తో కాళ్లబేరానికి దిగారు. కేసీఆర్ కనికరించడంతో మళ్ళీ వాటి ప్రసారాలు పునరుద్ధరించుకోగలిగారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒక్క వార్తను రాయడానికి కూడా వణికిపోయారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ కు సైతం తలవంచని ఈనాడు పత్రిక కేసీఆర్ దెబ్బకు గిజగిజలాడిపోయింది. గత ఆరేళ్లలో కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒక్క వార్తను కూడా రాయడానికి రామోజీరావుకు ధైర్యం చాలలేదు. మొన్న తెలంగాణ పోలీసులను విమర్శిస్తూ ఒక వ్యాసాన్ని ప్రచురించింది ఈనాడు పత్రిక. కేసీఆర్ ఆగ్రహించారని తెలియగానే వణికిపోతూ క్షమాపణ చెబుతూ మరొక వార్తను ప్రచురించింది. రామోజీరావు తన తప్పును బహిరంగంగా అంగీకరించడం చరిత్రలో అదే ప్రధమం.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, చంద్రబాబు పాలిస్తున్న అయిదేళ్లపాటు భజనలు, స్తోత్రాలు, అబద్ధాలతో పేజీలు నింపేసిన పచ్చ మీడియా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ విషాన్ని కక్కడం ప్రారంభించాయి. డజన్లకొద్దీ సంక్షేమ పధకాలను జగన్ అమలు చేస్తున్నా, వాటిగూర్చి ఒక్క కాలమ్ వార్త కూడా రాయలేని ఎల్లో మీడియా జగన్ కు వ్యతిరేకంగా ప్రతిరోజూ పుంఖానుపుంఖంగా వార్తలు రాస్తున్నది. రాజధాని మార్పు మీద జగన్ ను దుమ్మెత్తిపోస్తున్నది. పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని, పెట్టుబడులు రావడం లేదని, విశాఖలో రాజధాని అంటే నేవీ వాళ్ళు తిరస్కరించారని, పారిశ్రామికవేత్తలు ఆంధ్రకు వెళ్లాలంటే భయపడుతున్నారని, తాము రాయడమే కాకుండా, జాతీయ అంతర్జాతీయ మీడియాను కూడా తమ దుష్టయజ్ఞంలో సమిధలుగా వాడుకుంటున్నాడు. రాయిటర్స్, వాల్స్ట్రీట్ పేరుతో తప్పుడు వార్తలను ప్రచురింపజేస్తున్నారు. ఇక చంద్రబాబు ఆడిస్తున్న పెయిడ్ ఆర్టిస్టుల డ్రామాను రాజధాని మార్పుకు వ్యతిరేకంగా జరుగుతున్న మహోద్యమం అంటూ ప్రజలను వంచిస్తున్నారు. ఆ గుడారాల్లో యాభై మంది లేకపోయినా, వేలాదిమంది పాల్గొంటున్నారని, రాజధానిని కదలనివ్వమంటూ నిరాహారదీక్షలు చేస్తున్నారని కల్పిత రాతలు రాస్తూ తెలుగు రాష్ట్రాలను తప్పుదోవ పట్టిస్తున్నది.
మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నట్లు ఇలాంటి దుర్మార్గపు మీడియాను ధృఢచిత్తంతో జగన్ ఎదుర్కోవాలి. జీవోలకు ఈ కాళియసర్పాలు భయపడతాయనుకోవడం పొరపాటు. ఈ దుర్మార్గ చానెళ్లను నిర్దాక్షిణ్యంగా బహిష్కరించాలి. ఈ చానెళ్లు అన్ని కలిసి వీరంగాలు వేసినా, ప్రభుత్వం వెంట్రుక కూడా పీకలేవని జగన్ తెలుసుకోవాలి. తేలును బూటు కాలుతో తొక్కినట్లు ఈ చానెళ్లను తొక్కివేయకపోతే చివరకు ఇవి జగన్ ను కాటు వేస్తాయి. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉండదు. వీటి విషయంలో కేసీఆర్ మార్గమే శరణ్యం.