పాపం.. పవన్ ప్లాన్స్ అన్నీ పటాపంచలయ్యాయి

Janasena president Pawan Kalyan
జనసేన పార్టీ.. ఆరంభం నుండి ఆర్థిక, మీడియా, కేడర్ వంటి ప్రధాన వనరుల లోటు అమితంగా ఉన్న పార్టీ.  ప్రకటన రోజు నుండి పవన్ కళ్యాణ్ అనే ఒకే ఒక మూల స్తంభం మీద ఒక్కో ఇటుక పేర్చుకుంటూ మెల్లగా నిర్మితమవుతోంది.  గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకున్న జనసేనను వచ్చే ఎన్నికల నాటికి వైకాపాకు బలమైన ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దాలని అధినేత పవన్ పనిచేస్తున్నారు.  ఆర్థికంగా, సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయడానికి పెద్ద ఫ్లోర్ ప్లాన్ రెడీ చేసుకున్నారు కూడ.  ఆ ప్లాన్స్ అన్నీ ఈ 2020లోనే సమగ్రంగా అమలుపర్చాల్సి ఉంది. 
 
ఇందుకోసం అన్ని నియోజకవర్గాల్లో ప్రధానంగా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో యువ నాయకులకి దిశా నిర్దేశం చేస్తూ వార్డ్ స్థాయి నుండి నాయకుల్ని తయారుచేసుకోవడం, కేడర్ నిర్మించుకోవడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జనంలోకి వెళ్లడం, కొత్త పొత్తులను వెతుక్కోవడం వంటి లక్ష్యాల్ని నిర్ధేశించుకున్నారు.  కానీ కరోనా విపత్తు మూలాన లాక్ డౌన్ ఏర్పడటంతో అవేవీ జరగడం లేదు.  పార్టీ పనులు మందకొడిగా సాగుతున్నాయి.  ఇక మొదటి నుండి పవన్, జనసేనను దూరం పెడుతూ వచ్చిన మీడియా ఇప్పటికీ అదే పద్దతిలో ఉండటంతో జనంలో జనసేన ఊసు ఇంకాస్త తగ్గుముఖం పట్టింది. 
 
ఇక ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశ్యంతో విమర్శలను సైతం లెక్కచేయకుండా సినీ రంగంలోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్ వరుసగా నాలుగైదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  వాటిలో రెండు చిత్రాలు సెట్స్ పై ఉండగా మాటిచ్చిన నిర్మాతలు అందరి నుండీ పవన్ అడ్వాన్సులు తీసుకున్నారు.  ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఈ యేడాదిలోనే పూర్తి చేయాలని టైట్ షెడ్యూల్ రెడీ చేసుకున్నారు.  ఈ ప్లాన్ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే కొన్నేళ్లపాటు పార్టీని నడపడానికి అవసరమైన భారీ నిధులు పవన్ చేతిలో ఉండేవి.  కానీ లాక్ డౌన్ మూలాన సైన్ చేసిన సినిమాలన్నీ ఆగిపోయాయి.  దీంతో పెండింగ్ రెమ్యునరేషన్ సంగతి దేవుడెరుగు కొందరు నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్సులు కూడా వెనక్కి అడిగే పరిస్థితి.  ఇలా ఈ యేడాదిలో పవన్ రూపొందించుకున్న ప్లాన్స్ అన్నీ పటాపంచలయ్యాయి.