‘జనసేన పార్టీ’ ఓట్ల కంటే ఎక్కువగా ప్రజల హృదయాలు గెలుచుకుందంటారు జనసైనికులు… నిజమే. ఓట్లు వెయ్యనివాళ్ళు కూడా పవన్ గెలవాలనే కోరుకున్నారు. కానీ, గెలిచే స్థాయిలో ఓట్లు మాత్రం ఎవ్వరూ వెయ్యలేదు, బహుశా ఇదేనేమో రాజకీయం అంటే. అయితే ప్రజలు తమని పరీక్షిస్తున్నారని పవన్ ఇప్పటికి బలంగా నమ్ముతున్నారు. కానీ ఆ పరీక్షలో పోటీదారులు కూడా ఉంటారని.. వారి పోటీలో మనం నిలబడలేకపోయామని మాత్రం పవన్ అంగీకరించలేకపోతున్నాడు.
సినిమాల్లో హీరో ఎప్పటికైనా హీరోనే. కానీ రాజకీయాల్లో హీరోలు ఉండరు, అందరూ పాత్రదారులే. అందుకే ఏ రాజకీయ నాయకుడు తనని తానూ హీరోగా ఉహించుకోడు. గత ఎన్నికల్లో హీరో అనిపించుకున్న జగన్ తో సహా. కానీ పవన్ ఇంకా హీరోగానే ఫీల్ అవుతున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల ఫలితాలు పవన్ కళ్యాణ్ పరువునే తీసేసాయి. రెండు చోట్ల పోటీ చేసినా.. పవన్ గెలుపు రుచి చూడలేకపోయాడు.
ఫలితాలు చూసాకనైనా పవన్ లో మార్పు వస్తోందనుకుంటే.. ఇంకా ఆవే ఆలోచనలు, ఆవే ట్వీట్లు.. మధ్యలో ఎవ్వరికీ కనిపించకుండా కొన్ని రోజులు మాయమవ్వడం. పవన్ ను చూసి ఆవేశ పడాలో… కోప్పడాలో కూడా జనసేకలకు కూడా అర్ధం కావట్లేదట. భవిష్యత్తు మనదే అని చెప్తున్న పవన్.. వాస్తవ పరిస్థుతులు ఎందుకు ఆలోచించట్లేదు..?
అధికారం లేనప్పుడే జనం హృదయాలను గెలుచుకున్న జగన్.. ఇప్పుడు అధికారం చేతిలో పెట్టుకుని జననేతగా ఎదిగలేరా..? ప్రస్తుతం జగన్ ఆలోచనాధోరణి చూస్తుంటే, ఏపి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేలా కనిపిస్తోన్నాడు. ఈ పరిణామాలన్నిట్ని దృష్టిలో పెట్టుకునే ‘జగన్’ ప్రభంజనంలో ‘పవన్‘ రాజకీయం ఇక కష్టమేనని నిర్దారణకు వచ్చాకే.. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, జేడీ లక్ష్మీనారాయణ లాంటి నాయకులు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఇకనైనా పవన్ ఆలోచనలో మార్పు రావాలి.