చంద్రబాబు అడిగిన దాంట్లో లాజిక్ ఉంది మరి 

Chandra Babu Naidu

వైఎస్ సంక్షేమ పథకాల పేరుతో ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బును వేస్తున్నారు.  నవరత్నాల్లో చెప్పిన అన్ని పథకాలను ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ వస్తున్నారు.  దీంతో ఆయన పాపులారిటీ బాగానే పెరుగుతోంది.  ఎంతలా అంటే మోస్ట్ పాపులర్ సీఎంల జాబితాలో టాప్ 5లో ఉన్నారు.  దీంతో ప్రతిపక్షానికి ఆయన్ను విమర్శించడానికి పెద్దగా అవకాశం రావట్లేదు.  దీంతో బాబు అండ్ కో పథకాల అమలు తీరుపై లోతుగా అధ్యయనం చేసి లోపాల్ని వెతికే పనిలో పడింది.  

ఈమధ్యే ప్రకటించిన రైతు భరోసా పథకంలో 12,500 ఇస్తామన్న జగన్ పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం నుండి వచ్చే 6000 కూడా కలిపి 13,500 ఇస్తున్నారు.  అంటే తమవంతుగా 12,500 ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం 7,500 లతోనే సరిపెడుతోంది.  పైగా 65 లక్షల మంది రైతులకు ఇస్తామని 45 లక్షల మందికే ఇస్తున్నారు.  ఇదే విషయాన్ని టీడీపీ లేవనెత్తితే అధికార పక్షం నుండి జవాబు లేదు.  అలాగే అమ్మఒడి పథకంలో కూడా  విద్యార్థుల సంఖ్యను కుదించేశారు.  ఈ విషయాన్ని నారా లోకేష్ సైతం ప్రస్తావించారు. 

ఇక ఈరోజు జగనన్న చేదోడు పథకం కింద 2.47 లక్షల మంది నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఒక్కొక్కరికి 10,000 అందించారు.  ఈ లబ్దిదారుల సంఖ్య చూసిన ఎవరికైనా మన రాష్ట్రంలో మూడు ప్రధాన కుల వృత్తులవారు 2.47 లక్షల మందేనా ఉండేది అనే అనుమానం రాక మానదు.  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదే లెక్కను ప్రస్తావించారు.  రాష్ట్రంలో 13 లక్షల మంది టైలర్లు, 5.5 లక్షల మంది నాయి బ్రాహ్మణులు, 15 లక్షల మంది రజకులు ఉన్నారు.  

అంటే మొత్తం 30 లక్షల మంది పైగానే ఉన్నారు.  వీరిలో వైసీపీ సర్కార్ లెక్కల ప్రకారం చేదోడు పథకానికి అర్హులు కేవలం 2.47 లక్షల మందే అర్హులు.  అంటే మిగతా 27 లక్షల పైచిలుకు మంది అనర్హులేనా, మరీ ఇంత వైరుధ్యం అంటే మాటలు కాదు.  సంక్షేమ పథాకాలు అమలుచేస్తున్నామని విపరీతంగా ప్రచారం చేసుకుంటున్న వైసీపీ నేతలు ఈ లెక్కలకు మాత్రం మొదటి నుండి సరైన సమాధానం ఇవ్వకుండా చంద్రబాబు విమర్శల్ని అవసలు విమర్శలే కాదన్నట్టు తిట్లు జోడించి మాట్లాడారు.  కానీ చంద్రబాబు విమర్శల్లో లాజిక్ ఉంది.  మరి ఈసారైనా వైసీపీ లీడర్లు లెక్కలతో  సమాధానం చెబుతారో లేకపోతే ఎప్పటిలాగే దూకుడు మాటలతో దాటవేస్తారో చూడాలి.