రాష్ట్ర గవర్నర్ కు ఉండే విచక్షణాధికారాలపై చర్చ జరిగిన సందర్భాలు చాలా తక్కువ. గవర్నర్ అంటే ముఖ్యమంత్రి చేత, మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారని, జెండా వందనాలు స్వీకరిస్తారని , పండగలకు పబ్బాలకు శుభాకాంక్షలు తెలియజేస్తారని మాత్రమే సామాన్యులకు తెలుసు. గవర్నర్లు, రబ్బరు స్టాంపులని , ఉత్సవ విగ్రహాలని హేళన చేస్తుంటారు. వాడుకునే సమయం, సందర్భం రావాలే కానీ గవర్నర్ల అమ్ములపొదిలో అతి విశేష అధికారాలు ఉంటాయి. తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ “అతి చొరవ” (ప్రో యాక్టివ్) గా వ్యవహరిస్తున్నారని, ఇది అనుచితమని టిఆర్ ఎస్ ప్రభుత్వ ముఖ్యులు భావిస్తున్నట్టు కన్పిస్తోంది. అందుకు కారణాలు లేకపోలేదు.
గవర్నర్ తమిళ సై నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి కోవిడ్ బాధితులైన వైద్య సిబ్బందిని పరామర్శించడంతో మొదలైన స్వల్ప స్పర్ధలు, ఆమె నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను పిలిపించడంతో పెద్దవిగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంబంధం లేకుండా ఆమె పేషేంట్లు, ఆస్పత్రుల వివరాలను నేరుగా రాజ్ భవన్ కు తెప్పించుకుంటున్నారు. కోవిడ్ బాధితుల కష్టాలపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన తనకు సంతృప్తి కలిగించలేదని గవర్నర్ బాహాటంగా ప్రకటించడం టిఆర్ఎస్ ప్రభుత్వానికి పుండు మీద కారం చల్లినట్టుగా ఉన్నది. సాధారణ పరిపాలన విషయాలపైనే ఇంత దూకుడుగా వ్యవహరిస్తున్న గవర్నర్ భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశముందని ముఖ్యమంత్రి కేసీఆర్ కోటరీ కలవరపడుతున్నట్టు తెలుస్తోంది.
Read More : ఏపీకి అప్పు ఇస్తామంటే అంతగా నలిగిపోతున్నారెందుకో?
ఇటీవల గవర్నర్ ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (హెల్త్ ) శాంతి కుమారి రాజభవన్ కు హాజరు కావలసి ఉండగా, ముఖ్యమంత్రి రమ్మన్నారని చెప్పి వారిద్దరూ ఇచ్చిన సమయానికి రాలేదు. అయినా గవర్నర్ వెనకడుగు వేయకుండా అనేక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల మేనేజిమెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వయంగా డాక్టరైన తమిళ సైకి వైద్యరంగంలో మంచి నాలెడ్జి ఉంది. పేషేంట్ల నుంచి అధికంగా చార్జి చేస్తున్న ప్రవేటు ఆస్పత్రులకు ఆమె వీడియో కాన్ఫరెన్స్ లో మొట్టికాయలు వేసినట్టు రాజ్ భవన్ వర్గాల ద్వారా తెలిసింది. ట్విటర్ ద్వారా కూడా గవర్నర్ ప్రజలతో సన్నిహితమవుతున్నారు. గవర్నర్ ఇచ్చిన సమయానికి రెండు గంటలు ఆలస్యంగా చీఫ్ సెక్రటరీ ఆపసోపాలు పడుతూ రాజా భవన్ కు వచ్చారు. కోవిడ్ బాధితుల విషయంలో గవర్నర్ చూపుతున్న చొరవ చూసి చాలా మంది మంత్రులు అలర్ట్ అయ్యారు.
గవర్నర్ తమిళ సై గురించి ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించాలి.ఎప్పుడూ, ఎక్కడా పేరు వినని వ్యక్తిని ముఖ్యమైన తెలంగాణ రాష్ట్రానికి పంపడమేమిటని అప్పట్లో చాలా మంది నోళ్లు వెళ్ళబెట్టారు. తమిళ సై ఆ రాష్ట్రంలో శక్తిమంతమైన నాడార్ కులానికి చెందిన వారు. ఆమె చాలాకాలం తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా పనిచేశారు. కేడర్ ను నిర్మించారు. బిజెపి జాతీయ కార్యదర్శిగా కూడా సేవలు అందించారు. నిఖార్సైన కాషాయ ముద్ర గల ఆమె అమిత్ షాకు, మోడీకి నమ్మకస్తురాలు.
Read More : భారత్‌లో కరోనా.. రికార్డ్ నంబర్స్ ఇవే..!
దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి శ్రేణులలో ఉత్సాహాన్ని నింపేందుకు తమిళ సై ని తెలంగాణ రాజ్ భవన్ లో ప్రతిష్టించిందన్నది జగమెరిగిన సత్యం. గత లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో అనూహ్యంగా నాలుగు సీట్లు రావడంతో తెలంగాణలో ఇంకా బలపడాలని బిజెపి ఆశిస్తోంది. తెలంగాణ ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించే రీతిలోతమిళ సై వ్యవహరించడాన్ని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమర్ధించడం, టిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం ముఖ్యమంత్రి చంద్రశేఖర రావును ఇరుకున పడేసింది. దీనిపై సీఎం , మంత్రులు మనస్తాపం చెందారని, కానీ మినగలేక కక్కలేక ఇబ్బందిపడుతున్నారని ఒక టిఆర్ ఎస్ నాయకుడు చూచాయగా వెల్లడించారు.
వాస్తవానికి గవర్నర్ ఉపయోగించుకునే అధికారాల కంటే వినియోగించుకోని అధికారాలు ఎన్నో ఉంటాయి. క్లిష్ట పరిస్ధితుల్లో ప్రభుత్వ మనుగడ గవర్నర్ నివేదికపై ఆధార పడి ఉంటుంది. గవర్నర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని ప్రభుత్వ కార్యనిర్వహణ వ్యవస్ధ (ఎగ్జిక్యూటివ్) కు నేరుగా ఆదేశాలు ఇవ్వవచ్చు. పరిపాలన వ్యవస్ధ సరిగా లేదని తాను నమ్మితే రాష్ట్రపతికి ఘాటైన పదాలతో నివేదిక ఇవ్వవచ్చు. కానీ వ్యవస్ధల మధ్య స్పర్ధలు రానంత వరకు అన్నీ సవ్యంగానే సాగిపోతాయి. స్పర్ధలు తీవ్రతరమైతే నువ్వెంత అంటే, నువ్వెంత అనుకునే వరకు పరిస్ధితులు దిగజారిపోతాయి. ప్రభుత్వం జారీ చేసే ఏ చిన్న జీవో కింద అయినా “బై ది ఆర్డర్ ఆఫ్ ది గవర్నర్ ” అని ఉంటుంది.
Read More : మెగా ఫ్యామిలీకి వర్మ వెంట్రుకతో సమానం!
బడ్జెట్ ను శాసన సభకు సమర్పిస్తూ గవర్నర్ చేసే ప్రసంగంలో “నా ప్రభుత్వం ఇలా చేసింది.నా ప్రభుత్వం ఈ విధంగా భావిస్తోంది” అనే వాక్యాలు ఉంటాయి. అంటే ఏమిటి? రాజ్యాంగ రీత్యా ఈ ప్రభుత్వం గవర్నర్ ది అనేగా? అలాగని అధికారాలన్నీ గవర్నర్ కు ఉంటాయని చెప్పడం లేదు. పరోక్షంగా అధికారాలు ప్రజలకు, ప్రత్యక్షంగా ప్రజలెన్నుకున్న ప్రజా ప్రతినిధులకు ఉంటాయి. ఎన్నికల్లో ప్రజల తీర్పు ద్వారా జాతీయ స్థాయిలో ఏర్పడే రాజకీయ మహా శక్తి ద్వారానే రాష్ట్రపతి అయినా గవర్నర్లు అయినా పుట్టుకొస్తారు. కాబట్టి తాము ఎన్నుకున్న ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ముఖ్యమంత్రులు, రాజ్యరంగా విలువలను, ధర్మాలను నిలబెట్టేలా గవర్నర్లు వ్యవహరించడం సముచితంగా ఉంటుంది.
శాంతారాం , సీనియర్ జర్నలిస్టు