కాళేశ్వరం చివరి ఘట్టం.. కల సాకారం చేసుకోనున్న కేసీఆర్

 

కాళేశ్వరం చివరి ఘట్టం.. కల సాకారం చేసుకోనున్న కేసీఆర్

 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ఖుషీగా ఉన్నారు.  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతూ ముగింపు దశకు చేరుకోవడంతో సీఎం ఆనందంగా ఉన్నారు.  గోదావరి జలాలను రాష్ట్రంలోని ప్రతి పల్లెకూ చేర్చాలనే సంకల్పంతో భారీ వ్యయంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలుపెట్టారు.  ఏ దశలోనూ పనులు ఆగకుండా చూసి తక్కువ కాలంలోనే చాలా వరకు ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేశారు.  
 
గోదావరి నీటిని అత్యధిక ఎత్తుకు తీసుకెళుతూ నిర్మించిన ఈ ప్రాజెక్టులో మర్కూక్ పంప్ హౌస్ చివరిది.  కాళేశ్వరం ద్వారా నీటిని 88 మీటర్ల ఎత్తు నుండి 618 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్ళాలనేది ఆలోచన.  ఈ మేరకు మర్కూక్ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తే కొత్తగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్లోకి నీరు చేరుతుంది.  ఇందులో 530 మీటర్ల ఎత్తు వరకు నీటిని లిఫ్ట్ చేస్తారు.  అనంతరం ఈ జలాలను గ్రావిటీ ద్వారా పలు ప్రాంతాలకు పంపుతారు. 
 
ఈ ఘట్టంతో కాళేశ్వరం దాదాపు పూర్తైనట్టే.  మొదటిసారి 530 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేసి అవసరం నిమిత్తం పూర్తి స్థాయిలో 618 మీటర్లకు లిఫ్ట్ చేసే వీలుంది.  అందుకే త్వరలో మోటర్లు ఆన్ చేసి తుది ఘట్టాన్ని చూడాలని కేసీఆర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు.  రిజర్వాయర్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా చేసుకోవాలని ఆశపడుతున్నారు.  అందుకే నేరుగా మర్కూక్ మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ భాస్కర్ కు కేసీఆర్ నేరుగా ఫోన్ చేసి పనులు ఎలా నడుస్తున్నాయనేది తెలుసుకున్నారు. 
 
రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి నేరుగా తానే వస్తానని, ఏర్పాట్లు పండుగలా ఉండాలని సుమారు 1500 మంది వేడుకలో పాల్గొనేలా ఉండాలని తెలిపారు.  ఇంకో నాలుగైదు రోజుల్లో కేసీఆర్ పర్యటన ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.  మొత్తానికి కేసీఆర్ తన కాళేశ్వరం కలను పూర్తి స్థాయిలో చూడడానికి ఉవ్విళ్ళూరుతున్నారు.