రాజన్న బిడ్డ జనహృదయ విజేతగా ఆవిర్భవించిన రోజు 

 
2019 మే 23.. నవ్యాంధ్రప్రదేశ్ ప్రజానీకం చరిత్ర కనీవినీ ఎరుగని ఎన్నికల తీర్పును ఇచ్చిన రోజు.  ఆరోజు ప్రతిపక్ష నేతగా 5 ఏళ్ళు కష్టపడిన వైఎస్ జగన్ జనహృదయ నేతగా ఆవిర్భవించి అఖండ విజయాన్ని అందుకున్నారు.  ‘నేను విన్నాను – నేను ఉన్నాను’ అంటూ జగన్ చెప్పిన మాటను నమ్మి జనం ఏకంగా 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు అందించి ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టారు.  ఈ విజయం చూసి దేశ రాజకీయ పార్టీలు, కొమ్ములు తిరిగిన రాజకీయ నేతలు మనసులోనే ఇతను సామాన్యుడు కాడు అంటూ ముక్కున వేలేసుకున్నారు.  
 
ప్రజాసంకల్ప యాత్రతో ప్రజలకు దగ్గరగా:
 
నారా చంద్రబాబునాయుడు పాలనపై వైఎస్ జగన్ యుద్దం ప్రకటించి మహాపాదయాత్రను చేపట్టారు.  341 రోజులు 3648 కిలోమీటర్ల ప్రజాసంకల్ప యాత్ర చేసి పల్లె పల్లెకు నడిచారు.  ఆయన ప్రవేశించిన ప్రతి గ్రామంలోనూ వేల మంది జనం అయన వెనక నడిచారు.  ఆయనకు దగ్గరగా వెళ్లి తమ కష్టాలను చెప్పుకున్నారు.  వారి బాధలు విన్న జగన్ చేతిలో చేయి వేసి నేను విన్నాను – నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చారు.  పాదయాత్ర పూర్తయ్యేసరికి వైఎస్ జగన్ నేరుగా కలిసి, మాట్లాడిన ప్రజల సంఖ్య ఒకటిన్నర కోటి దాటింది.  చరిత్రలో పాదయాత్ర ద్వారా ఇంత ఎక్కువమందిని కలిసిన నేత మరొకరు లేరు.  నేరుగా తమ వద్దకే వచ్చి కష్టాలు విని హామీలు ఇవ్వడంతో ప్రజల్లో జగన్ పట్ల అమితమైన నమ్మకం ఏర్పడింది.  ఆ నమ్మకమే ఆయన్ను అఖండ విజయం దిశగా నడిపింది.  
 
రావాలి జగన్ – కావాలి జగన్ నినాదం ఊపందుకున్న తరుణం :
 
అప్పటివరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రత్యేక హోదా సహా నిరుద్యోగం, ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలు వంటి విషయాల్లో చతికిలపడింది.  ఎన్నికలు సమీపించే నాటికి చంద్రబాబు సర్కార్ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయింది.  ఆ తరుణంలోనే వైకాపా రావాలి జగన్ – కావాలి జగన్ అంటూ కొత్త నినాదాన్ని అందుకుంది.  చంద్రబాబు చేస్తున్న ప్రజాకంటక పాలన పోవాలంటే మనకు జగన్ కావాలి, ఆయన అధికారంలోకి రావాలి అంటూ పెద్ద ఎత్తున చేసింది వైకాపా.  ఆ నినాదాన్ని యువత అందిపుచ్చుకున్నారు.  జగన్ రావల్సిందే అన్నట్టుగా పట్టుబట్టారు.  ఫలితం మే 23న నమోదైన భారీ విజయం.  
 
రాజన్న బిడ్డ మన బిడ్డే :
 
వైఎస్ జగన్ వెనక ఉన్న మహాబలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరీష్మా.  వైఎస్సార్ అంటే పల్లె ప్రజలకు ఎనలేని మక్కువ.  ప్రమాణస్వీకారం చేసిన వేదిక మీదే ఉచిత కరెంట్ ఫైల్ మీద సంతకం చేసి, దాన్ని విజయవంతంగా అమలుచేసిన వైఎస్సార్ అంటే పల్లె జనానికి ఎంతో మక్కువ.  అందుకే నేను మీ రాజన్న బిడ్డను.. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ జగన్ అడగ్గానే జనం మన రాజన్న బిడ్డ అంటే మన బిడ్డే అనుకున్నారు.  ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అనుకున్నారు.  అనుకున్న ప్రకారమే ఒక్క అవకాశాన్ని ఎంతో ఘనంగా ఆయన చేతిలో పెట్టారు.  
 
నవరత్నాలతో జనంలో ఆశల పెంపు:
 
వైఎస్ జగన్ ఇతర పార్టీల మాదిరిగా పేజీలకు పేజీలు హామీలు ఇచ్చి మేనిఫెస్టో తయారుచేయలేదు.  అందరికీ అర్థమయ్యేలా పాంప్లెట్ మాదిరి మేనిఫెస్టో రూపొందించి జనం ముందు పెట్టారు.  అందులో నవరత్నాల పేరుతో ప్రధానంగా తొమ్మిది సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు.  వైఎస్సార్ రైతు భ‌రోసా, అంద‌రికీ వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ, అమ్మ ఒడి, పింఛ‌న్ల పెంపు, పేద‌లంద‌రికి ఇళ్లు, ఫీజు రీఎంబ‌ర్స్‌మెంట్, వైఎస్సార్ జ‌ల‌య‌జ్ఞం, మ‌ద్య‌పాన నిషేదం, వైఎస్సార్ ఆస‌రా, వైఎస్సార్ చేయూత ఇలా జగన్ చెప్పిన నవరత్నాలు జనానికి బాగా దగ్గరయ్యాయి.  రైతులు, పేద కూలీలు, అణగారిన వర్గాలు, మహిళల్లో   ఆయన్ను గెలిపిస్తే బ్రతుకులు బాగుపడతాయనే నమ్మకం ఏర్పడింది.  అంతే ఇతర పార్టీల హామీలేవీ నవరత్నాల మాదిరిగా వారిని ఆకట్టుకోలేకపోయాయి.  
 
జగన్ ప్రభంజనం ముందు పార్టీలన్నీ బేజారు:
 
వైఎస్ జగన్ జనంలోకి వెళ్లిన తీరుకు అధికార టీడీపీ, అప్పుడే కొత్తగా ఎన్నికల్లోకి దిగిన జనసేన, ఇతర పార్టీలు బెజారెత్తిపోయాయి.  పైకి ధైర్యంగా ఉంటూనే జనంలో జగన్ బలాన్ని అంచనా వేయడం స్టార్ట్ చేశాయి.  ఎక్కడ చూసినా, ఎవర్ని కదిలించినా జగన్ విజయం తథ్యం అనే మాటే.  చివరికి ఎన్నికలకు వెళ్లే సమయానికి మహా మహా ముదురు నేతలు సైతం ఇది వన్ సైడ్ వార్ అనే నిర్ణయానికి వచ్చేశారు.  వారు అనుకున్నట్టే విజయం ఏకపక్షమైంది.  36 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ 23 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.  నారా లోకేష్ సహా టీడీపీలో అప్పటివరకు మంత్రులుగా వెలిగిన అనేక మంది బడా లీడర్లు మట్టికరిచారు.  జనసేన నుండి ఒక్కరు మాత్రమే గెలవగా పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు.  జగన్ 50 శాతానికి పైగా ఓట్లు సాధించి జనహృదయ విజేతగా ఆవిర్భవించారు.  
 
ఇక మే 30 నాటికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది పూర్తవుతుంది.  కనుక రానున్న మే 30వ తేదీన ఈ యేడాది కాలంలో వైఎస్ జగన్ పాలన ఎలా ఉందనే అంశాన్ని సమగ్రంగా చర్చించుకుందాం.