జగన్ భిన్నమైన పాలకుడే

 
విశాఖపట్నం గ్యాస్ లీక్ సంఘటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీర్పు అభినందనీయం. అధికార యంత్రాంగం ఆగమేఘాలమీద కదిలింది. ఆలస్యం చేయకుండా బాధితులందరినీ ఆస్పత్రికి తరలించారు అధికారులు. 
 
లాక్ డౌన్ సమయంలో మొదటిసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం దాటి విశాఖపట్నం వెళ్ళారు. ఆయన విశాఖపట్నం చేరుకునేలోపు అధికార యంత్రాంగం సకాలంలో స్పందించి నష్టం ఎక్కువ జరగకుండా జాగ్రత్తపడింది. 
 
సంఘటనా స్థలానికి చేరుకున్న ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షలతో కాలం వెళ్ళబుచ్చకుండా ఆస్పత్రిలోని బాధితులతో నేరుగా మాట్లాడారు. వారిని ఓదార్చారు. కరోనా వ్యాధి భయం వదిలి ఆస్పత్రిలోని బాధితులపై చేయివేసి భరోసా ఇచ్చారు. ఒక్కొక్కరినీ పలకాయించారు. ఒక బాధితురాలి తలపై ప్రేమగా నిమిరారు. మరో బాధితుడి కాళ్లపై చేతులేసి ఆప్యాయంగా స్పృజించారు. ఈ చర్యల్లో ఇన్నాళ్ళుగా చెపుతున్న భౌతిక దూరం, కరోనా వ్యాధి భయం ఆయన దృష్టిలో లేవు. మూర్తీభవించిన మానవత్వం కనిపించింది. నేతల్లో ఇది చాలా అరుదుగా కనిపించే దృశ్యం. ఎన్నికలప్పుడు మినహా ప్రజలను అంటుకోని నేతలను మనం చూస్తున్నాం. ఇప్పుడు కరోనా పేరుతో ఒకర్నొకరు అంటుకోని పరిస్థితిని చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రమాద బాధితుల్ని చేతులేసి పరామర్శించడం అంటే స్పందించే హృదయానికి మాత్రమే సాధ్యం. 
 
బాధితులను పరామర్శించడంతో పాటు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల భారీ పరిహారం ప్రకటించారు. ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం. బీజేపీ నాయకత్వం మృతుల కుటుంబాలకు పాతిక లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇంకా ఎలాంటి డిమాండ్ ముందుకు తేలేదు. ప్రజలు, కార్మికుల పక్షాన ఉన్నామని చెప్పే వామపక్షాలు, ప్రజలపక్షాన ప్రశ్నిస్తానని చెప్పే జనసేన ఇంకా గొంతు విప్పలేదు. ఈ లోగా ముఖ్యమంత్రి స్పందించి భారీ నష్టపరిహారం ప్రకటించారు. 
 
చనిపోయిన వారిని తిరిగి తేలేను. అలాగే వారి లోటును భర్తీ చేయలేను. కానీ ఈ నష్టపరిహారం కొంత ఉపసమనం కలిగిస్తుందని ఆశిస్తున్నా అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన బాధితులకు భరోసా ఇచ్చింది. ప్రతిపక్షాలకు, రాజకీయ పార్టీలకు గొంతులో వెలక్కాయ పడినట్టయింది. మొత్తానికి ప్రతిపక్షాలకు చేసేందుకేం మిగలలేదు. అడిగేందుకేం మిగలలేదు. ప్రజల కష్టాలు తెలిసిన మనిషి మాత్రమే ఇలా స్పందిస్తారు. ఈ స్పందనతో జగన్మోహన్ రెడ్డి విశాఖ ప్రజలనే కాదు యావత్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మనసు కూడా గెలుచుకున్నారు. 
 
ఒక ఉపద్రవం వచ్చినప్పుడు పాలకులు ఇలా స్పందించిన సందర్భాలు చాలా తక్కువే. మనకు తుఫానులు, వరదలు వస్తూనే ఉంటాయి. అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, పడవ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రమాద తీవ్రతను బట్టి మరణాలు ఉంటాయి. నష్టం కూడా ప్రమాద తీవ్రతను బట్టే ఉంటుంది. అయినా ఎప్పుడూ ఏ పాలకుడు ఈ విధంగా స్పందించిన సందర్భాలు ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో కనిపించలేదు. 
 
గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే పాలకులు ఎలా స్పందించారో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. అసలు ఆ 30 మంది చనిపోవడానికి ఎవరు కారణమో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆ తర్వాత గోదావరిలో పడవ ప్రమాదం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందించారో కూడా ప్రజలు చూశారు. పాలకుడికి మానవత్వం ఉండాలి. ప్రజల బాధలు తెలియాలి. అప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డిలా స్పందించగలుగుతారు. ఈ స్పందన విశాఖ ప్రజలు చూశారు. అది వారు మర్చిపోలేరు.