ప్రతీ మనిషికి అనేక సమస్యలు. అనేక ఇబ్బందులు. కానీ వీటి నుంచి తప్పించుకుని సాఫీగా జీవితం సాగిపోవాలనుకుంటే వినాయకుడి అనుగ్రహం ఉంటే చాలు. దీనికి మన పెద్దలు చెప్పిన అత్యంత సులభమైన పరిష్కారం తెలుసుకుందాం… వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిది. ప్రతినెలలో రెండుసార్లు చవితి వస్తుంది. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు.
ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఎక్కువగా ఆచరిస్తుంటారు. ఇక ఈ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటు, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి. ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి.