పరమేశ్వరుడు నంది రూపంలో వెలసిన మహానంది క్షేత్ర వివరాలు , విశిష్టత …!

ఈ లోకాధిపతి అయిన మహా శివుడిని ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. శ్రీశైల క్షేత్రాన కొలువైన పరమేశ్వరుడు ఎల్లవేళలా పూజలందుకుంటూ ఉంటాడు. అలాగే పరమేశ్వరుడు నంది రూపంలో వెలసిన ఏకైక క్షేత్రం మహానంది. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహానందిలో పరమేశ్వరుడు నంది రూపంలో వెలసాడు. ఈ మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుడు, కామేశ్వరి దేవి అమ్మవారు కొలువై ఉంటారు. ఈ మహానందీశ్వర దేవాలయం ఏడవ శతాబ్దంలో నిర్మించారు. ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం (680-696) నాటిదని అంచనా. ఇచ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము తప్పటగ వుంటుంది. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలంలో నిర్మించబడిందని అంచనా.

ఈ ఆలయంలో ఉన్న శివలింగం ఎత్తుగా కాకుండా కొంచెం తప్పటగా ఉండి లింగం పై భాగంలో ఆవు గిట్ట గుర్తుతో ఉండటం ఈ ఆలయ విశిష్టత. ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే పూర్వం పుట్టలో ఉన్న లింగానికి ఆవు పాలు ఇస్తున్న సమయంలో ఆ ఆవు యజమాని కోపంతో ఆవుని కొట్టగా ఆవు లింగం మీద కాలు పెట్టటంతో… ఎత్తుగా ఉన్న శివలింగం లింగము కొంచెము అణిగిపోయి ఉంటుందని,అలాగే ఆవు కాలికి ఉన్న గిట్ట గుర్తు కూడా లింగం పై భాగంలో ఇప్పటికీ కనిపిస్తుంది. శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం మహానందిశ్వర ఆలయం ప్రత్యేకత. ప్రధాన ఆలయంలో ఆలయ ముఖ ద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి ఎప్పుడు స్వచ్ఛమైన నీరు గోముఖ శిల నుండి ధారావాహకంగా వస్తూ ఉంటుంది.

ఇక్కడ ప్రధాన ఆలయంలోని లింగం క్రింద భూమిలో ఉన్న ఐదు నీటి ఊటలు నుండి నీరు ఊరి ప్రధాన ఆలయం ముందు ఉన్న కొలనులో కలుస్తుంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా వుంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఐదున్నర అడుగులు లోతున్న ఈ కొలనులో క్రిందనున్న రూపాయి బిళ్ల చాల స్పష్టంగా కనబడుతుంది. శివలింగం కింద ఉన్న భూమి నుండి ఈ నీరు ఊరటం వల్ల ఈ నీటిని తీర్ధంగా భక్తులు తీసుకెళతారు. అంతే కాకుండా ఇక్కడ ఉన్న కొలనులో రూపాయి నాణెం వేసి దండం పెడితే మన మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం.