నంది కొమ్ములలో చూస్తూ శివలింగాన్ని ఎందుకు దర్శించుకుంటారో తెలుసా..?

సాధారణంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత గుడిలోకి ప్రవేశించి దేవుడి దర్శనం చేసుకుంటారు. అయితే శివాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం శివలింగాన్ని నేరుగా దర్శించుకోకుండా శివలింగం ముందు ఉన్న నందిని దర్శించుకుని ఆ తర్వాత నందికొమ్ముల్లో నుంచి శివ లింగాన్ని చూస్తూ దర్శనం చేసుకుంటారు. శివుడికి నందీశ్వరుడు వాహనం. ఇలా నందీశ్వరుడి కొమ్ముల్లో నుంచి చూస్తూ శివున్ని దర్శించుకోవడం వెనుక ఒక ప్రధాన కారణం ఉందని పండితులు చెబుతున్నారు. అలా దర్శించుకోవడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శివుడిని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. పరమేశ్వరుడు లయకారుడు. శివుడి త్రినేత్రం తెరిస్తే ఆ ఆగ్రహ జ్వాలలకు సృష్టి మొత్తం అంతం అవుతుంది. అందువల్ల అంతటి మహిమాన్విత శ‌క్తి ఉన్న శివున్ని నేరుగా ద‌ర్శించుకోకూడ‌దు. అలా ద‌ర్శించుకుంటే అరిష్టం క‌లుగుతుంది. క‌నుక శివాలయానికి వెళ్ళిన వారు ముందుగా ఆల‌యం ఎదురుగా ఉండే నంది కొమ్ముల్లోంచి చూస్తూ ద‌ర్శించుకోవాలి. ఇక నంది కొమ్ముల్లోంచి చూస్తు శివుడిని దర్శించుకునేటప్పుడు ఎడమ చేతితో నంది కొమ్ములపై రెండు వేళ్ళు ఉంచి కుడి చేత్తో నంది వీపును నిమ‌రాలి. ఆ స‌మ‌యంలో నంది చెవిలో మ‌న గోత్ర నామాలు, మ‌న కోరిక‌లు కూడా చెప్పాలి.

ఇలా శివ లింగాన్ని ద‌ర్శించుకోవటంవల్ల మన్ కోరిన కోర్కెలు నెర‌వేరడమే కాకుండా ఎంతో పుణ్య ఫ‌లం ల‌భిస్తుంది. పొరపాటున కూడా శివ లింగాన్ని నేరుగా ద‌ర్శించుకోకూడ‌ద‌ని.. అల దర్శించుకుంటే అరిష్టం క‌లుగుతుంద‌ని.. పండితులు చెబుతున్నారు. ఇక శివుడిని దర్శించుకున్న తర్వాత శివలింగానికి బిల్వదరాలు సమర్పించి నీటితో అభిషేకం చేయటం వల్ల శివుడి అనుగ్రహం లభించి మనం కోరిన కోరికలు తీరుతాయని పండితులు సూచిస్తున్నారు. అందువల్ల శివాలయానికి వెళ్ళిన వారు తప్పకుండా శివలింగానికి అభిషేకం చేసి దర్శించుకోవాలి.