ఈ ఏడాది శ్రీరామనవని పండుగ ఏప్రిల్ 17వ తేదీ బుధవారం రోజు వచ్చింది. ఈ శ్రీరామనవమి పండుగ రోజు అనేక ప్రదేశాలలో సీతారాములకు కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా సీతారాముల విగ్రహాలను ఊరేగిస్తూ ఉంటారు. అయితే చాలామందికి ఈ శ్రీరామనవమి పండుగ రోజు ఏం చేయాలి శ్రీరాముని ఎలా పూజించాలి అన్న విషయం తెలియదు. మరి ఈ శ్రీరామనవమి పండుగ రోజు ఏం చేయాలో ఎలా పూజ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శ్రీరామనవమి రోజున ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి, తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి.
పూజా మందిరము, గడపకు పసుపు, కుంకుమ ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి. పూజకు ఉపయోగించే పటములకు గంధము, కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి. శ్రీ సీతా రామలక్ష్మణ, భరత, శతృఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గానీ పూజకు ఉపయోగించవచ్చు. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామ రక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి.
ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. అలాగే ఆ రాముడు అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇక శ్రీరామ దేవాలయం, భద్రాచలం, ఒంటిమిట్ట, గొల్లల మామిడాడ వంటి ఆలయాలను దర్శించుకోవడం మంచిది. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథ వ్రతమును ఆచరించడం చాలా మంచిది. నవమి రోజున శుభ ముహూర్తంలో పూజ చేయాలి. పూజకు కంచుదీపము, రెండు దీపారాధనలు, ఐదు వత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు తులసి మాలను ధరించడం చేయాలి. పూజ పూర్తయిన తర్వాత శ్రీ రామరక్షా స్తోత్రము, శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేయడం వల్ల ఆ శ్రీరాముడి అనుగ్రహాలు తప్పకుండా లభిస్తాయి.