కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలు?

కార్తీక పౌర్ణమినీ హిందువులు ఎంతో పవిత్రమైన దినంగా భావించి పెద్ద ఎత్తున కార్తీక పౌర్ణమి రోజు పలు ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతూ ఉంటాయి. అలాగే శ్రీహరి ఆలయాలు గోవింద నామస్మరణతో మారుమోగుతూ ఉంటాయి.ఇలా కార్తీక పౌర్ణమి రోజు శివకేశవుల ఆలయాలు భక్తులతో కిటికీటలాడుతూ ఉంటాయి.ఇకపోతే ఈరోజు 365 ఒత్తులు ఉన్నటువంటి దీపాన్ని వెలిగించడం వల్ల ఏడాదిలో మనం దీపం వెలిగించకపోయిన ఆ పుణ్యం కలుగుతుందని భావిస్తారు.

ఇకపోతే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులను వెలిగించేటప్పుడు తప్పనిసరిగా నియమనిష్ఠలను పాటించాలని తెలిసి తెలియక కొన్ని తప్పులను చేయకూడదని పండితులు చెబుతున్నారు.కార్తీక పౌర్ణమి రోజు మనం వెలిగించే 365 వత్తులను స్వయంగా మనమే తయారు చేసుకుని వెలిగించాలి. ఒకవేళ ఈ దీపాలను ఉదయం వెలిగించాలి అనుకుంటే రాత్రి మొత్తం ఆవు నెయ్యిలో నానబెట్టి మరుసటి రోజు వెలిగించాలి. అదేవిధంగా సాయంత్రం వెలిగించాలనుకుంటే ఉదయమే ఆవు నెయ్యిలో ఈ ఒత్తులను నానబెట్టి వెలిగించడం మంచిది.

ఇకపోతే కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగా దీపాలు వెలిగించే సమయంలో పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు.ఈ విధంగా 365 వొత్తులను వెలిగించే సమయంలో సరాసరి ఈ వత్తులను వెలిగించి పూజించకూడదు ముందుగా తమలపాకులు పసుపుతో గణపతిని తయారు చేసుకుని గణపతిని పూజించిన అనంతరం విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చిన తర్వాత మనం 365 ఒత్తులను వెలిగించాలి.ఈ వత్తులు వెలిగించే సమయంలో తమలపాకు తీసుకొని దానిపై పసుపు కుంకుమ వేసిన అనంతరం మట్టి ప్రమిద తీసుకొని 365 వత్తులను వేసి దీపం వెలిగించాలి. ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత పసుపు కుంకుమలతో దీపాన్ని పూజించి అనంతరం ధూపం వేయాలి. ఇలా దీపం వెలిగించే సమయంలో బెల్లం ముక్క లేదా అరటి పండ్లు చలిమిడి పానకం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించడం మంచిది.