ఇంట్లో నివసించాలంటే గాలి, వెలుతురు మంచిగా రావాలి. అప్పుడే ఆ ఇంట్లో నివసించే వారు ఆరోగ్యంగా బాగుంటారు. దీనికోసం రూపొందించిందే వాస్తు నియమాలు. వాటిలో ప్రధానంగా నేడు ద్వారాల గురించి తెలుసుకుందాం.. గృహంలో నడిచేటప్పుడు కొన్ని దిశలవైపు నడక సాగించడం శుభ ఫలితాలను ఇస్తుందన్న కోణంలో వాస్తుశాస్తం ద్వారాల అమరిక ఎలా ఉండాలన్న విషయాన్ని పరిశీలిద్దాం..
గృహంలో ఉత్తర ఈశాన్యం నుండి, దక్షిణం వైపుకు, దక్షిణ ఆగ్నేయం నుండి ఉత్తర ఈశాన్యం వైపు నడక సాగించడం శుభ ఫలితాలను ఇస్తుంది. తూర్పు ఈశాన్యం నుండి పడమర వాయువ్యం, పడమర వాయువ్యం నుండి తూర్పు ఈశాన్యం వైపుకు కూడా నడక సాగించడం మంచి ఫలితాలను ఇస్తుందని వాస్తు పేర్కొంటోంది. దీనిప్రకారం అనుకూలమైన దిశల వారీగా ద్వారాలను అమర్చుకోవడం ఉత్తమమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
పై నియమాలనుబట్టి వాస్తు ప్రకారం ఉత్తర, దక్షిణ భాగాల మధ్యలో ద్వారాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే తూర్పు, పడమర భాగాల మధ్యలో కూడా ద్వారాలను ఏర్పాటు చేయవచ్చు. పశ్చిమ, దక్షిణాలలో కూడా ఉచ్చ స్థానాలయిన పశ్చిమ వాయువ్యం, దక్షిణ ఆగ్నేయాలలో కూడా ద్వారాలను అమర్చవచ్చు. దీనివల్ల ఏ దోషం రాదని వాస్తు చెబుతోంది.
అదేసమయంలో ఒక చిన్న ఇంటికి ఒకే ద్వారాన్ని అమర్చవలసి వచ్చినప్పుడు తూర్పు ఈశాన్యంలోగానీ, ఉత్తర ఈశాన్యంలోగానీ నిర్మించాలి. ఉత్తర, దక్షిణ భాగాలలో మాత్రం అమర్చకూడదని వాస్తు చెబుతోంది. గృహానికి రెండు ద్వారాలు మాత్రమే ఏర్పాటు చేయవలసి వస్తే వాటిని తూర్పు ఈశాన్యంలో ఒకటి, ఉత్తర ఈశాన్యంలో మరొకటి నిర్మించుకోవాలి. అంతేగానీ ఒకటి తూర్పు, ఉత్తరాల్లో అమర్చి, రెండోదాన్ని పడమర, దక్షిణం భాగంలో అమర్చకూడదని వాస్తు పేర్కొంటోంది.