మాఘ మాసం యొక్క విశిష్టత పూజా విధానాలు..?

తెలుగు సంవత్సరాది మాసాలలో మాఘమాసం అత్యంత పవిత్రమైనది . చంద్రుడు ముఖ నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అని అంటారు. ఈ మాఘమాసం విష్ణుమూర్తికి చాలా ప్రత్యేకమైన మాసం. ఈ మాఘమాసం యజ్ఞ యాగాలకు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాఘమాసంలో బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం చేయటం విశేషం. ప్రజలందరూ తెల్లవారుజామునే పవిత్రమైన నదీ జలాలలో స్నానం ఆచరించి ఇంట్లో పూజ చేసిన తర్వాత మాఘ స్నానాలకు అధిష్టాన దైవం అయిన సూర్య భగవానుడికి పూజలు చేయటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తోంది.

పురాణాల ప్రకారం మృకండుముని, మనస్వినిలు ఈ మాఘ మాసంలో మాఘస్నాన చేయడం వల్ల పుణ్యఫలం లభించి వారి కుమారు మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని నిపుణులు తెలియజేశారు. కనుక మాఘస్నానాలు చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని ప్రజల విశ్వాసం. మాఘ మాసంలో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘ మాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘం అంటారు. ఈ పౌర్ణమి రోజున సముద్రస్నానం చేయటం వల్ల మరింత పుణ్యఫలం లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు.

ఈ మాఘమాసంలో దానధర్మాలకు ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ మాఘ మాసంలో పేద ప్రజలకు దానధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని ప్రజల విశ్వాసం. ముఖ్యంగా ఈ మాఘ మాసంలో నువ్వులు దానం చేయడం వల్ల ఏడాది పాటు దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. మాఘ మాసంలో వచ్చే శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయడం వల్ల ఎంతో మంచిది. ఇక ఈ మాఘ మాసంలో తెల్లవారుజామున మాఘస్నానం చేసిన తర్వాత ఇంట్లో నువ్వుల నూనెతో దేవుడు ముందు దీపం వెలిగించి పూజించాలి. అలాగే మాఘ మాసంలో నిర్వహించి హోమాలలో కూడా నువ్వుల నూనె ఉపయోగించటం శుభప్రదంగా భావిస్తారు.