బోగి పండుగ రోజున చేసే వంటకాల ప్రత్యేకత ఏమిటో తెలుసా..?

మన హిందూ సంస్కృతి ప్రకారం ధనుర్మాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున మకర సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండుగను ముచ్చటగా మూడు రోజులపాటు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవరోజు కనుమ పండుగలు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో నాలుగవ రోజు కూడా ముక్కనుమ పండుగ జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండుగ తెలుగు ప్రజలకు చాలా ప్రత్యేకమైనది. సంక్రాంతి పండుగ రోజున ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ రోజున ఇంటి ముందు రంగుల ముగ్గులతో అలంకరించడమే కాకుండా రకరకాల పిండి వంటలు చేయడం కూడా ప్రత్యేకం.

పండుగ జరుపుకునే ఈ మూడు రోజులు ఒక్కరోజు ఒక్కో రకమైన వంటకాలు తయారుచేస్తారు. మొదటి రోజు జరుపుకొనే భోగి పండుగ రోజున ప్రజలందరూ కొత్తగా వచ్చిన వరి పంటతో పొంగలి తయారు చేసే అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే మరికొంతమంది చిరుధాన్యాలతో రొట్టెలు తయారు చేసి కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక సంక్రాంతి పండుగ రోజున చలివిడి, అరిసెలు, బొబ్బట్లు, మురుకులు వంటి వివిధ రకాల పిండి వంటలు తయారు చేస్తారు. ఇక కనుమ రోజున మాంసాహారం వండుకుంటారు. అయితే భోగి పండుగ రోజు తయారు చేసే వంటలకు ఒక ప్రత్యేకత ఉంది.

సంక్రాంతి పండుగ నాటికి పొలంలో పండించిన పంటలు అన్ని ఇంటికి చేరుతాయి. అందువల్ల ఇంటికి చేరిన కొత్త ధాన్యంతో వంటలు తయారు చేసి అష్టలక్ష్ములలో ఒకరైన ధాన్య లక్ష్మి సమర్పిస్తారు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ మంది ప్రజలు వరి ధాన్యం పండిస్తారు. అందువల్ల ఈ బియ్యంతో పొంగలి తయారు చేసి ధాన్య లక్ష్మికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే రాగులు గోధుమలు జొన్నలు వంటి చిరుధాన్యాలను పండించిన వారు వాటితో రొట్టెలు తయారుచేసి మొదట అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఇలా ఇంటికి చేరిన పంటతో మొదటగా అమ్మవారికి నైవేద్యం సమర్పించడం వల్ల ఏడాది పాటు ఆ ఇంట్లో సిరిసంపదలు ధన ధాన్యాలు మెండుగా ఉంటాయని ప్రజల నమ్మకం.