అయ్యప్ప దీక్ష తర్వాత కట్టే ఇరుముడి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

మన భారతీయ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో ఇంట్లో, దేవాలయాలలో దేవుళ్లకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మరి కొంతమంది భక్తులు స్వామి మీద భక్తితో దేవుడి మాలలు వేస్తూ ఉంటారు. శివుడి మాల , అయ్యప్ప మాల, ఆంజనేయ స్వామి మాల ఇలా ప్రజలు తమ ఇష్టదైవానికి సంబంధించిన మాల వేస్తూ దీక్షలో ఉంటారు. ముఖ్యంగా ఈ మాసంలో అయ్యప్ప మాలలు ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. కుల మతాల కు అతీతంగా అందరూ సమానమని దీక్షాపరునిలో అయ్యప్ప స్వామి కొలువై ఉంటాడని,ఈ దీక్షకాలంలోనే కాకుండా ఆ సుగుణాలను జీవితాంతం పాటించి జీవితాంతం సంతోషంగా ఉండాలని దీక్ష చెబుతూ ఉంది.

అయ్యప్ప దీక్ష లో ఉన్నవారు కొన్ని కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఆ అయ్యప్ప మీద భక్తితో ఉదయం సాయంత్రం చన్నీటితో స్నానం చేసి కేవలం ఒక్క పూట మాత్రమే భోజనం చేసి కటిక నేలపై నిద్రిస్తూ ఆ అయ్యప్పని స్మరిస్తూ ఉంటారు. ఇలా అయ్యప్ప దీక్ష ధరించే వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. దీక్ష కాలం ముగిసిన తర్వాత ఇరుముడి కట్టుకొని శబరిమలకు పయనం అవుతారు. అయితే ఈ ఇరుముడికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఇరుముడిని గురు స్వాములు చేత కట్టించుకుంటారు. ఈ ఇరుముడిలో వివిధ రకాల పూజా సామాగ్రిని ఉంచుతారు. అంతేకాకుండా ఇందులో ఒక కొబ్బరికాయ తీసుకొని అందులోకి ఆవు నెయ్యి నింపుతారు.

ఈ కొబ్బరికాయను మన శరీరంగా భావించి అందులో పోసే ఆవు నెయ్యిని మన ఆత్మగా భావించి శబరిమలలో ఆ దేవుడికి అర్పిస్తారు. ఇలా మన దేహం ఆత్మ ఆ దేవుడికి అర్పించినట్లు. అయితే శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకోవాలనుకునే భక్తులు ముందుగా క్యూబుక్ చేసుకొని వారు ఇచ్చిన తేదీకి అక్కడ క్యు లో ఉండాలి. అలా కాకుండా మరి కొంతమంది అయ్యప్ప దీక్ష ధరించిన భక్తులు నేరుగా పంబాకు చేరుకొని అక్కడ పంబా నదిలో స్నానం చేసి ఆ తర్వాత చిన్న పాదం ద్వారా వెళ్లి అయ్యప్ప ను దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతిరోజు లక్ష మంది భక్తులకు స్వామివారిని దర్శించుకోవడానికి అనుమతి కల్పిస్తున్నారు. ఇక శని ఆదివారాలలో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా పెంచుతున్నారు.