నల్ల రంగును చాలామంది శని గ్రహానికి సంబంధించిన పవిత్ర సూచికగా భావిస్తారు. దుష్ట శక్తుల నుంచి రక్షణ కోసం లేదా శని అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతో చేతికి లేదా కాలికి నల్ల దారం ధరించే పద్ధతి మనలో చాలామంది పాటిస్తున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి ఒక్కరికి ఇది అనుకూలం కాదు. కొన్ని రాశులవారికి నల్ల దారం ధరించడం తీవ్రంగా ప్రతికూలంగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మేష రాశి వారికి నల్ల దారం ధరించడం శుభం కాదని చెబుతున్నారు. వీరి అధిపతి కుజుడు, శని మరియు రాహువులతో శత్రుత్వం కలిగి ఉంటాడు. కాబట్టి నల్ల రంగుతో సంభంధం ఉన్న వస్తువులను ధరించడం వల్ల మేషరాశి వారికి శారీరక సమస్యలు, మానసిక ఒత్తిడి, పని తడపడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.
కర్కాటక రాశి వారు కూడా నల్ల దారం ధరించకూడదని చెబుతున్నారు. వీరి అధిపతి చంద్రుడు, శాంతి, స్థిరత్వానికి చిహ్నంగా ఉండగా, నలుపు రంగు వలన వ్యతిరేక ఫలితాలు కలగవచ్చు. ముఖ్యంగా మానసిక స్థిరత్వం మీద ప్రభావం చూపించి, డిప్రెషన్, భయం, ఆందోళన వంటి సమస్యలు అధికమవుతాయని నిపుణుల చెబుతున్నారు.
సింహరాశి అధిపతి సూర్యుడు. అతను శని పుత్రుడైనా, జ్యోతిషంలో వీరిద్దరి మధ్య శత్రుత్వ సంబంధం ఉందని చెప్పబడుతుంది. అందువల్ల, సింహరాశి వారు నల్ల దారం ధరిస్తే, వారి ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, గౌరవం కోల్పోవడం, జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వడం వంటి పరిణామాలు సంభవించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వృశ్చిక రాశి వారు కూడా నల్ల దారాన్ని దూరంగా ఉండాలి. వీరి అధిపతి కుజుడు కూడా రాహువుతో సఖ్యత చూపడు. కాబట్టి నల్లదారం ధరించడం వల్ల శరీరానికి, మనస్సుకు ప్రతికూల ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. అంతేకాదు, వీరు సాధ్యమైనంతవరకూ నల్ల దుస్తులను కూడా నివారించాల్సిందిగా జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు.
ఇది జ్యోతిష్య ప్రాతిపదికన ఇచ్చిన సాధారణ సమాచారం మాత్రమే. ఎవరైనా నల్ల దారం ధరించాలా వద్దా అన్న విషయంలో నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞులైన జ్యోతిషుల సలహా తీసుకోవడం మేలు.