బతుకమ్మ పండుగ.. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకొనే పండుగ. సాధారణంగా ఈ పండుగ ఏటా భాద్రపద మాసంలో బహుళ అమావాస్య నుంచి ఆశ్వీయుజ మాసం శుద్ధ అష్టమి వరకు జరుపుకోవడం తెలంగాణ ప్రజలకు ఆనవాయితీ. కానీ ఈ ఏడాది అధికమాసం కావడంతో బతుకమ్మ పండుగ ఎప్పుడు చేసుకోవాలనే సందేహం అందరిలో నెలకొంది. ఎందుకంటే హిందువులు అధికమాసంలో ఎలాంటి శుభకార్యాలు చేసుకోరు. కనుక అధికమాసం తరువాత వచ్చే నిజమాసంలోనే పండుగలు, శుభకార్యాలు చేసుకొంటుంటారు. ప్రజలలో నెలకొన్న ఈ సందిగ్దత గురించి తెలుసుకొన్న వేదపండితులు బతుకమ్మ పండుగను ఎప్పటి నుంచి చేసుకోవాలనే దానిపై చర్చించారు. ప్రముఖ పంచాంగకర్త యాయవరం చంద్రశేఖరశర్మ సిద్దాంతి ఆ వివరాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు.
ఈ ఏడాది అదికమాసం ఏర్పడినందున బతుకమ్మ పండుగను అధిక ఆశ్వీయుజ బహుళ అమావాస్య నుంచి అంటే అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 24న దుర్గాష్టమి వరకు జరుపుకోవచ్చు. అయితే బతుకమ్మ పండుగ ప్రారంభానికి సూచిస్తూ జరుపుకొనే బోడెమ్మ వేడుకను మాత్రం ఈ నెల 9 నుంచి 17 వరకు యధాప్రకారం జరుపుకోవచ్చు,” అని తెలిపారు.
సాధారణంగా బహుళ అమావాస్యనాడు బోడెమ్మను సాగనంపిన తరువాత, మరుసటి రోజున ఎంగిలిపూల బతుకమ్మతో మహిళలు బతుకమ్మ పండుగను ప్రారంభిస్తారు. కానీ అధికమాసం కారణంగా ఈసారి రెండు వేడుకలకు మద్య సుమారు నెలరోజులు విరామం పాటించవలసి ఉంటుందని యాయవరం చంద్రశేఖరశర్మ సిద్దాంతి తెలిపారు.
ఈ అధికమాసంలో జపాతపాలు, ఆధ్యాత్మిక సాధనలు చేసుకొనేందుకు ఎటువంటి అవరోధం ఉండదని పైగా ఈ అధికమాసంలో చేసే జపతపాలకు మరింత ఉత్తమ ఫలం లభిస్తుందని చెప్పారు.