హిందువులకు అతి పెద్ద పండగ అంటే అది సంక్రాంతి. ఈ పండగని దాదాపు మూడు రోజులపాటు జరుపుతారు. ఒకటి, భోగి, మకరసంక్రాంతి, కనుమ అని ఈ మూడు రోజులు వివిధ రకాల ఆచారాలను పాటిస్తూ కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా గడిపే పండుగ ఇది. ఇక ఈ పండగ వచ్చిందంటే చాలు దాదాపు నెల, రెండు నెలల ముందే టికెట్లు బుక్ చేసి సొంతూర్లకు వెళుతుంటారు జనం. ఇక ఇదిలా ఉంటే ఉంటే… ఇలాంటి సమయాల్లోనే ఇటు ఆర్టీసి, అటు ట్రైన్లు జనంతో కిక్కిరిసిపోయి ఉంటాయి. అసలు రిజర్వేషన్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు చాలా మంది జనం ఈ పండుగను కుటుంబ సభ్యులందరితోనూ కలిసి చేసుకోవాలనుకుంటారు. అలాంటప్పుడు ఎలాగైనా సరే సొంత ఊర్లకు వెళ్ళాలనే తాప్రత్రయంలో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తారు. అప్పుడు ప్రైవేట్ వాహన యజమానులు చూపించే ఛార్జీల జులుం మాములుగా ఉండదు.
పండగ పూట ప్రజలకు ఎంత మేరకు పండగానందం ఉంటుందో చెప్పడం కష్టమే. కానీ, ప్రైవేటు ట్రావెల్స్ వారికి మాత్రం పండుగ నాలుగు రోజులు పెద్దపండగే. ఇబ్బడి ముబ్బడిగా ప్రయాణికులు పెరిగిపోవడం, రవాణాసాధనాలు లేకపోవడంతో టికెట్ల ధరలను రెండింతలు చేసి మరీ దోచేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకే రు.3 వేలకు పైన తీసుకుంటున్నారు. వైజాగ్ అయితే రు. 5 నుంచి 7 వేలు పలుకుతోంది. స్లీపర్ క్లాసుల గురించి ఇంక అసలు చెప్పక్కర్లేదు. పండగ ఖర్చు అంటే సగం ఛార్జీలకే పోయేటట్లు ఉంది. కానీ చాలా మంది ఎంత ఖర్చైనా కూడా ఈ పండగను మాత్రం ఊళ్ళు వెళ్ళి ఊళ్ళలో చేయడానికే ఇష్టపడతారు.