అనుమానంతో భార్యాబిడ్డని దారుణంగా హత్య చేసిన భర్త..!

వివాహం తర్వాత భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నమ్మకంగా ఉంటూ వారి కష్టసుఖాలలో పాలుపంచుకోవాలి. కానీ ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు అనుమానాలతో కాపురం చేస్తున్నారు. ఈ క్రమంలో భార్యల మీద అనుమానం పెంచుకొని భర్తలు వారిని హత్య చేయడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా ఇటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది. తనకి పుట్టిన కూతురుకి తన పోలికలు లేవని వారి మీద అనుమానం పెంచుకొని వేధిస్తున్న భర్త కిరాతక తల్లి బిడ్డలు ఇద్దరిని హత్య చేసిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళితే…. తిరుపతి సమీపంలో ఉన్న గురువరాజుపల్లె ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న కుమార్ అనే వ్యక్తికి పావని అనే యువతిని రెండు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఈ దంపతులకు సంవత్సరం క్రితం ఒక కుమార్తె అమృత జన్మించింది. అయితే పాప పుట్టిన తర్వాత పాపకి తన పోలికలు లేవని కుమార్ భార్యను అనుమానించడం ప్రారంభించాడు. రోజు రోజుకి కుమార్ అనుమానం పెరిగి భార్యకు వేరొకరితో సంబంధం ఉందని భావించి ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో ఆదివారం చేపలు పట్టేందుకు వెళ్దామని చెప్పి భార్య పావని, కూతురు అమృతని తీసుకొని తిరుపతి ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న ఇసుక కాలువ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత ఒక పెద్ద కర్ర తీసుకొని పావని తల మీద గట్టిగా కొట్టి ఏడాది వయసున్న తన కూతుర్ని కూడా కాలువలో తోసేసాడు. అయితే మూడు రోజులుగా పావని అమృత కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు కుమార్ ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయట పెట్టాడు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని తల్లి కూతుర్ల మృతదేహం కోసం గాలింపు చేయగా పావని మృతదేహం లభించింది. చిన్నారి మృతదేహం ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులు కుమార్ మీద కేసు నమోదు చేసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.