తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనూ, రాజకీయ రంగంలోనూ నటసార్వభౌమ నందమూరి తారక రామారావు చెరగని ముద్ర వేశారు. గొప్ప బిరుదులు, సత్కారాలు, పదవులు అందుకున్న ఆయన, చివరి దశలో మాత్రం తీవ్ర మనోవేదన అనుభవించారు అనేది జగమెరిగిన సత్యం. ఆయన మృతి పట్ల కూడా కుటుంబీకుల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎన్టీఆర్ సంతానం ఆయన రెండవ భార్య లక్ష్మి పార్వతి మీద ఆరోపణలు కూడా చేశారు అప్పట్లో.
అయితే లక్ష్మి పార్వతి మాత్రం మేము ప్రేమైక జీవులం. ఒకరంటే ఒకరికి ఎనలేని అనురాగం, ఆప్యాయత ఉండేవి అని తరచూ చెబుతుంటారు. ఎన్టీఆర్ తనని ఎంతో గౌరవించేవారని, ఆమె మాటకు విలువ ఇచ్చేవారని లక్ష్మి పార్వతి చెబుతుంటారు. అటువంటి ఎన్టీఆర్ ఒకసారి ఆమెపై చేయి చేసుకున్నారట.
ఆడ పడుచులు, అక్క చెల్లెళ్ళు అంటూ తన ప్రసంగాన్ని మొదలెట్టి ఆడవారంటే ఆయనకు ఉన్న గౌరవాన్ని కనబరచేవారు ఎన్టీఆర్. మహిళలను ఎంతగానో గౌరవించే ఆయన తన భార్యని కొట్టాల్సినంత పరిస్థితి ఎందుకొచ్చింది? అంతలా ఆయనకు కోపం వచ్చేంత పెద్ద తప్పు ఏం చేశారు లక్ష్మి పార్వతి? అసలు నాలుగు గోడల మధ్య ఎన్టీఆర్ కి లక్ష్మి పార్వతికి మధ్య జరిగిన ఈ ఘటన ఎలా బయటకు వచ్చింది? ఈ విషయాలన్నీ స్వయంగా లక్ష్మి పార్వతి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ వివరాలు ఆవిడ మాటల్లోనే కింద ఉన్నాయి చదవండి.
గవర్నమెంట్ పడిపోయినప్పుడు అప్పటి మీడియా నామీద నెపం వేసి నాగురించి దారుణంగా పత్రికల్లో ప్రచారం చేసింది. అవన్నీ అర్థంకాక నేను బాధ పడుతుండేదాన్ని. ఆ సమయంలో కరీంనగర్ నుండి కొందరు అభిమానులు ఎన్టీఆర్ గారిని కలవడానికి వచ్చారు. వారు ఆయనతో మాట్లాడి తిరిగి వెళుతూ ఒకసారి వదినని కూడా కలిసి వెళ్తాము అని కోరారు.
అప్పటికే నా కారణంగానే ఆయన అధికారాన్ని కోల్పోయారు అని ప్రచారం సాగుతోంది. నేను బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉన్నప్పటికీ లక్ష్మి పార్వతి కార్యకర్తల్ని కలుస్తుంది, నాయకులతో మంతనాలు జరుపుతుంది అంటూ వార్తలు వస్తుండేవి. అందుకే నేను ఎవరిని కలవకుండా ఇంట్లోనే ఉండాలని నిశ్చయించుకున్నాను.
ఆ నేపథ్యంలో కరీంనగర్ నుండి వచ్చిన అభిమానుల్ని కలవమని ఎన్టీఆర్ గారు నాకు చెప్పారు. అయితే నేను అందుకు అంగీకరించలేదు. వారంతా ఎంతో దూరం నుండి అభిమానంతో వచ్చారు వెళ్లి కలవమన్నారు. నేను వద్దు స్వామి ఇవాళ నేను కలుస్తాను, మళ్ళీ రేపు తాటికాయంత అక్షరాలతో లక్ష్మి పార్వతి ఇంకా పార్టీవాళ్లని కలవడం మానలేదంటూ వార్తలు వస్తాయి. నేను కలవను అని చెప్పాను. ఆయన ఎన్నిసార్లు చెప్పినా నేను వెళ్ళను అన్నాను.
ఆయనకి కోపం వచ్చి వెళతావా లేదా అన్నారు గట్టిగా. లేచి నిలబడి నేను వెళ్ళను అని చెప్పాను. ఇక ఆయన గట్టిగా వీపు మీద ఒక్క దెబ్బ వేస్తే వెళ్లి తలుపు దగ్గర పడ్డాను. పైకి లేచి కళ్ళ నీళ్లు తుడుచుకుని వాళ్ళని కలిశాను. ఆరోజు మధ్యాహ్నం నేను బాధ పడుతుంటే ఆయన ఇలా అన్నారు. “లక్ష్మి… ఓడిపోవటం నీకు ఇష్టమా? మనం ఎంత భయపడి దాక్కుంటామో…ప్రత్యర్ధులు మన మీద అంత విజయం సాధిస్తున్నట్టు అర్ధం చేసుకోవాలి.
మనం ఏం తప్పు చేశామని మనకోసం వచ్చిన అభిమానుల్ని కలవకపోవటం. ఎవడో వెధవ యేవో పిచ్చి రాతలు రాసాడని భయపడి మనం ఇంట్లో ఉంటామ? నువ్వు ఎలక్షన్స్ లో నాకు ఎంత అండగా ఉన్నవో నాకు తెలియదా? ఎన్టీఆర్ భార్యగా నువ్వు పిరికిదానిలా దాక్కుంటే నాకు ఎంత బాధేస్తుంది? అని ఆయన అన్న మాటలకి నా కోపం అంతా పోయింది. ఇంత గొప్పవాడు నా భర్త ఆయన మాటల్ని నేను అర్ధం చేసుకోలేక పోయాను అని బాధేసింది అంటూ లక్ష్మి పార్వతి చెప్పుకొచ్చారు.