(యనమల నాగిరెడ్డి)
“పేరు గొప్ప — ఊరు దిబ్బ ” అన్న నానుడి ‘రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్’ కు ఖచ్చితంగా సరిపోతుంది. అంతర్జాతీయంగా పేరున్న ఈ విమానాశ్రయంలో పొగరాయుళ్లకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విమానాశ్రయ యాజమాన్యం విఫలమైందని చెప్పక తప్పదు.
ఈ విమానాశ్రయం రెండవ అంతస్తులో ఏర్పాటు చేసిన ‘స్మోకింగ్ జోన్ గది’ యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుంది. ఈ గది నాలుగు అడుగుల పొడవు 5 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇందులో ఇరువురు లేదా ముగ్గురు ఉంటె వేరే వారికి చోటు ఉండదు. కనీసం ఎక్సాస్ట్ ఫాన్ కూడా లేని ఏకైక పొగరాయుళ్ల గది ఇక్కడ మాత్రమే ఉంది.
పొగరాయుళ్లు వారి సిగరెట్ తాగడం కంటే తమ సహచరులు వదలిన పొగ ధాటికి తట్టుకోలేక విలవిలా లాడక తప్పడం లేదు.
వేలాది రూపాయలు ఖర్చు చేసి కనీసం గంట ముందుగా ఎయిర్ పోర్ట్ చేరుకుంటున్న పొగరాయుళ్లు పొగ తాగడంపై ఉన్న కోరిక అణుచుకోలేక, ఈ గదిలో తాగలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. విమానం లో ఎక్కడానికి సిద్దమవుతూ చివరగా ఒక్కసారి సిగరెట్ తాగాలనుకున్న వారికి ఈ గది లోకి వెళ్లడం శిక్ష మాత్రమే. అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ లైటర్ కూడా సరిగా పని చేయదు.
ఇదే స్థాయిలో ఉన్న బెంగళూరు విమానాశ్రయంలో పొగరాయుళ్ల కోసం విశాలమైన గదులు నాలుగైదు ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. అక్కడ అన్ని పొగరాయుళ్ల గదులలో కనీస సౌకర్యాలైన ఎలక్ట్రిక్ లైటర్, ఎగ్సాట్ ఫ్యాన్ ఏర్పాటు చేశారు.
పొగ తాగడానికికి అలవాటుపడిన వారి ఇబ్బందులు తొలగించాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని, యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి “పొగ గదిని” సరిగా ఏర్పాటు చేయాలని అనేక మంది పొగరాయుళ్లు కోరుతున్నారు.