డ్రంక్ అండ్ డ్రైవ్ : పోలీసులకు దిమ్మ తిరిగే షాక్ (వీడియోలు)

డ్రంక్ అండ్ డ్రైవ్ అనే పేరు వినగానే హైదరాబాద్ లో మందు బాబులకు గుబులు పుడుతుంది. అంతగా పోలీసులు మందు బాబులకు భయం పెట్టించారు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకప్ ద్వారా. హైదరాబాద్ లో రాత్రిపూట ప్రమాదాలు తగ్గిపోవడానికి పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ చెకప్ ప్రధాన కారణమని అందరూ చెప్పే మాటే. తాగు తప్పు లేదు కానీ తాగి బండి నడపకు అన్నది పోలీసుల సూచన. తాగుడు మందు కలిపి చేయకు అని పోలీసులు స్లోగన్లు కూడా వదిలారు. శుక్ర, శని వారాల్లో మందు బాబులు తాగి బండి తీయాలంటే భయపడే పరిస్థితిని కల్పించారు హైదరాబాద్ పోలీసులు. ఇది చాలా మంచి కార్యక్రమం అని అందరూ ఖితాబిస్తున్నారు. క్లబ్బులు, పబ్బుల్లో అర్ధ రాత్రి దాకా పీకల దాకా తాగి హైదరాబాద్ లోని కోటీశ్వరుల పిల్లలు రోడ్లపై కార్లు రయ్ మని తిప్పుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల చాలా మంది యువతీ యువకులను పట్టుకుని పోలీసులు కటకటాల వెనుకకు నెట్టారు.

ఇంత మంచి కార్యక్రమం అయినా కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. అ పొరపాటే పోలీసులకు గట్టి షాక్ తగిలేలా చేసింది. ఆ వివరాలేమంటే హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ లో శనివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకప్ చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సయ్యద్ జహీరుద్దీన్ ఖాద్రీ అనే యువకుడికి పరీక్షించగా 44శాతం ఆల్కహాల్ పర్సెంటేజీ వచ్చింది. దీంతో ఆ యువకుడి మీద పోలీసులు కేసు బనాయించారు. చలానా కట్టాలంటూ హుకూం జారీ చేశారు. కానీ ఆ యువకుడు మాత్రం పోలీసులకు బెదరకుండా పోరాటానికి దిగాడు. అంతిమంగా పోలీసుల మీద విజయం సాధించాడు. ఎలాగంటే…?

సయ్యద్ జహీరుద్దీన్ ఖాద్రీ రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తాడు. ఆయనకు చుక్క మద్యం ముట్టుకునే అలవాటు లేదు. అదే విషయాన్ని పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ సమయంలో వెల్లడించారు. కానీ పోలీసులు డోంట్ కేర్ అన్నారు. కేసు బుక్ అని తేల్చి పారేశారు. దీంతో ఆ యువకుడు తనకు మద్యం అలవాటు లేకపోయినా తాను తాగకపోయినా తన మీద పోలీసు కేసు బనాయించారని దీనిపై పోరుకు సిద్ధమయ్యాడు. ఆయనకు మీడియా కూడా సహకరించింది. దీంతో తన మీద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో తప్పుడు కేసులు బనాయించారని వారి మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని విచారణ నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు జరపగా అతడు మద్యం సేవించలేదని రిపోర్ట్ వచ్చింది.

ఉస్మానియా నుంచి వచ్చిన రిపోర్ట్ తో ట్రాఫిక్ పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. ఆ యువకుడు ఎంత చెబుతున్నా వినకుండా మద్యం సేవించావాని వాదిస్తూ కేసు ఫైల్ చేశారు పోలీసులు. కానీ ఆ యువకుడిని తప్పుడు కేసులతో వేధించినందుకు గాను సదరు ట్రాఫిక్ పోలీసుల మీద సదరు యువకుడు గుర్రుగా ఉన్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని అంటున్నాడు.

డ్రంక్ అండ్ డ్రైవ్ గొప్ప కార్యక్రమమే అయినప్పటికీ ఇటువంటి విషయాల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు జనాలు చురకలు వేస్తున్నారు. ఈ ఘటన పోలీసు వర్గాల్లోనే కాక సిటీలో బాగా చర్చనీయాంశమైంది. పోలీసుల ఓవర్ యాక్షన్, సయ్యద్ అనే యువకుడు ఏం చేశాడో పైన మూడు వీడియోలు ఉన్నాయి. పోలీసులు వేసిన చలానాలు కింద ఉన్నాయి చూడండి.

ఇక్కడ కొసమెరుపు ఏమంటే… ఈ బాధితుడు ఎవరో కాదు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనవడు. 

 

ఖాద్రీ మద్యం సేవించలేదని ఉస్మానియా వైద్యులు ఇచ్చిన నివేదిక