ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం మృతి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. జయరాంను హత్య చేసినట్టుగా పోలీసులు నిర్దారించారు. ఈ హత్య కేసులో రాకేష్ రెడ్డి అనే వ్యక్తితో పాటు జయరాం మేనకోడలు శిఖా చౌదరి పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
జయరాం తన మేన కోడలు శిఖా చౌదరితో సాన్నిహిత్యంగా ఉండేవాడు. శిఖా రాకేష్ అనే వ్యక్తి దగ్గరి నుంచి రూ.4.5 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుంది. అయితే దీనిని ఆమె సమయానికి చెల్లించకపోవడంతో రాకేష్ ఆమె పై ఒత్తిడి చేయడంతో జయరాం ఆ మొత్తం చెల్లిస్తానని ఒప్పుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ డబ్బుకు సంబంధించి వీరి మధ్య గొడవ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది.
జయరాంను రాకేష్ విజయవాడ వైపుగా తీసుకెళ్లినట్టుగా పోలీసులకు స్పష్టమైన ఆధారాలున్నాయి. జయరం హత్యకు హైదరాబాద్ లోనే కుట్ర పన్నారు. రాకేష్ రెడ్డి జయరాంకు యుథనేషియా అనే ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఇంజక్షన్ జబ్బు వచ్చిన కుక్కలను చంపేందుకు వాడుతారు. జయరాంను కారులోనే హత్య చేసి ప్రమాదంగా చిత్రికరించే ప్రయత్నం చేసినట్టుగా తేలింది.
జయరాం కు శిఖా చౌదరికి వివాహేతర సంబంధం ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జయరాం గతంలో నిర్వహించిన ఎక్స్ ప్రెస్ టివి ఛానల్ కు కూడా శిఖా చౌదరి డైరెక్టర్ గా వ్యవహరించింది. జయరాం భార్య పిల్లలకంటే ఎక్కువగా శిఖా చౌదరికి ప్రిపరేన్స్ ఇచ్చేదని అంటున్నారు. జయరాం అమెరికా నుంచి వస్తే శిఖా చౌదరి ఇంటికి రాత్రి పూట వచ్చి వెళ్లేవాడని తెలుస్తోంది.
అయితే శిఖా చౌదరికి రాకేష్ రెడ్డి అనే యువకుడితో కూడా వివాహేతర సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. రాకేష్ కు రావాల్సిన డబ్బు రాకపోవడంతో జయరాంను హత్య చేస్తే రావాల్సిన డబ్బు తో పాటు శిఖాతో కలిసి ఉండేందుకు లైన్ క్లియర్ అవుతుందన్న ప్లాన్ తో ఈ పని చేశారా అన్న కోణంలో విచారిస్తున్నారు. శిఖా చెల్లెలు మనీషా చదువులకు కూడా జయరాం కోటి రూపాయలు సహాయం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో జయరాం సోదరితో పాటు శిఖా మరియు మనీషాలను పోలీసులు నందిగామలో విచారిస్తున్నారు.
జయరాం హత్యకు గురైన తర్వాత శిఖా జయరాం ఇంటికి వెళ్లి బీరువా తాళాలు అడగడంతో శిఖా మీద అనుమానాలు ఎక్కువయ్యాయి. ఏదైమైనా కేసు దర్యాప్తు సాగుతున్నా కొద్ది సంచలన నిజాలు బయటపడుతున్నాయి.
జయరాం భార్యా పిల్లలు అమెరికా నుంచి ఇంటికి చేరుకున్నారు. జయరాం భార్య స్టేట్ మెంటును కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ లోని జయరాం ఇంటి నుంచి మృతదేహాన్ని తరలించి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు.