ఆదివారం తెల్లవారుజామున శ్రీశైలం ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిన్నారుట్ల వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 20 మందికి స్వల్ప గాయాలు కాగా 5 గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని అంబులెన్సులో శ్రీశైలం ఆస్పత్రికి తరలించారు. ఎవరికి కూడా ప్రాణాపాయం లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మహారాష్ట్ర నుంచి శ్రీశైలంకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వస్తుంది. శ్రీశైలానికి 15 కిలోమీటర్ల దూరంలో చిన్నారుట్ల వద్ద ఘాట్ రోడ్డులో మూలమలుపు ఉంది. ఈ మూలమలుపు వద్ద గతంలో కూడా ప్రమాదాలు జరిగాయి. ఉదయం బస్సు మూలమలుపు వద్దకు రాగానే కంట్రోల్ కాక లోయలోకి దూసుకెళ్లింది. అక్కడే పిట్టగోడ అడ్డుగా ఉండడంతో బస్సు కిందకు జారి ఆగిపోయింది. లేనిచో ఘోర ప్రమాదమే జరిగేది. రెప్పాటున పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడ ప్రమాదం జరగడంతో అంతా భయభ్రాంతులకు గురయ్యారు. బస్సులో ఉన్నవారు అరవడంతో అక్కడ ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది.