తెలంగాణలొ వరుసగా జరుగుతున్న పరువు హత్యల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రేమికులు వచ్చి ఆశ్రయం కోరితే వారికి రక్షణ కల్పించాలని వారు మేజర్లు అయితే ఫిర్యాదులు స్వీకరించాలని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమీషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితిలోనూ నిర్లక్ష్యం చేయవద్దని, పరిస్థితి చేయిదాటనివ్వొందని డిజిపి సూచించారు.
ప్రేమికులు మేజర్లు అయితే వెంటనే ఫిర్యాదు తీసుకొని వారు ఆరోపించిన అంశాలపై దర్యాప్తు జరపాలని పోలీసు శాఖ తన ఆదేశాల్లో సూచించింది. అలాగే ఇరు కుటుంబాల తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిచి తప్పనిసరిగా కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించింది. గతంలో లాగా నిర్లక్ష్యం వహించొద్దని అవసరమనుకుంటే కేసులు కూడా నమోదు చేయాలని ఆదేశించింది. మేజర్లైన ప్రేమికులకు రక్షణ కల్పించాల్సి బాధ్యత పోలీసు శాఖదని స్పష్టంగా తెలియజేశారు.
ప్రేమికులకు నిజంగానే ప్రాణ హాని ఉందని భావిస్తే అనుమానితులపై, తల్లిదండ్రుల పై నిఘా పెట్టాలని పేర్కొంది. ప్రణయ్ హత్య తర్వాత ప్రేమికుల ఫిర్యాదులు పెరిగాయని పోలీసు శాఖ తెలిపింది. జిల్లాలతో పాటు రాజధాని కమిషనరేట్లలో రోజుకు 10 నుంచి 15 ఫిర్యాదులు వస్తున్నాయని పోలీసు శాఖ ప్రకటించింది. దాడులు పెరగడం, హత్యలకు దారితీస్తుండటంతో పోలీసు శాఖకు చెడ్డ పేరు వస్తుందని ఇక పై దాడులు, హత్యలు జరగకుండా పకడ్బందిగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చారు. టివి చానెళ్ల వారు కూడా పదేపదే చూపించి హింసను ప్రేరేపించవద్దని అలా చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు.
పలుసార్లు కేసు నమోదు చేస్తే కోపంతో దాడులు పెరుగుతున్నాయని అందుకే సాధ్యమైనంత వరకు కౌన్సిలింగ్ ఇచ్చి సర్ధి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. పోలీసు శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు బీ అలర్ట్ అయ్యారు. ప్రేమ వివాహల కేసులను పరిశీలిస్తున్నారు. గతంలో కూడా వివాహాలు చేసుకున్నవారి పరిస్థితేంటి వారంతా సేఫేనా అని విచారిస్తున్నారు. గత ఫైళ్లని కూడా వారు తిరగేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రణయ్ హత్యతో పోలీసు శాఖ తమ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.