ఒకవైపు టిఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగం చేస్తుంటే మరోవైపు సొంత పార్టీలో ఆ ఆపరేషన్ కు వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. గడిచిన రెండు ఎన్నికల్లో చూస్తే ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఒక సీటే టిఆర్ఎస్ కు దక్కింది. ఈ ఎన్నికల్లో కూడా ఒక సీటే దక్కింది. కానీ గత ఎన్నికల తర్వాత ఆఫరేషన్ ఆకర్ష్ చేపట్టి జిల్లాను జయించింది టిఆర్ఎస్. ఇప్పుడు కూడా ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగాన్ని షురూ చేసింది. అయితే జిల్లాకు చెందిన ఒక నేత టిఆర్ఎస్ లోకి రావడాన్ని ఆయన మీద టిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ప్రత్యర్థి జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో తన నోటికి పని చెప్పారు ఆ నాయకుడు. ఇంతకూ ఎవరా నాయకుడు? ఆకర్ష్ పేరుతో వచ్చే నాయకుడెవరు? చదవండి.
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు సండ్ర వెంకట వీరయ్య. సత్తుపల్లి నియోజకవర్గం సండ్ర కు కంచుకోట. ఆయన 2009లో, 2014లో 2018లో వరుసగా తెలుగుదేశం పార్టీ తరుపున సత్తుపల్లిలో గెలుస్తూ వచ్చారు. అంతకుముందు 1994లో సిపిఎం తరుపున పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు. ప్రస్తుతం టిడిపిలోనే కొనసాగుతున్నారు. ఆయన మీద ఎంతగా వత్తిడి వచ్చినప్పటికీ ఆపరేషన్ ఆకర్ష్ వలలో ఆయన ఇప్పటి వరకు చిక్కలేదు. ఆయనకు టిడిపి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా నియమించింది. ఈ దఫా ఆయనను ఎలాగైనా టిఆర్ఎస్ లోకి గుంజుకురావాలని కేసిఆర్ స్కెచ్ వేశారు.
ఆయనతో కేసిఆర్ సన్నిహితులు ఇప్పటికే చర్చలు జరిపారు. టిఆర్ఎస్ లో చేరాలంటూ ఆఫర్ పెట్టారు. అయితే సండ్ర మాత్రం తనకు టిడిపిలో ఏ లోటూ లేదని చెప్పుకున్నారు. ఎమ్మెల్యే పదవితోపాటు టిటిడి సభ్యుడిగా కూడా తనకు పోస్టు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతకంటే ఎక్కువ హోదా ఇస్తామని టిఆర్ఎస్ నేతలు సండ్రకు ఆఫర్ పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సత్తుపల్లిలో వరుసగా మూడుసార్లు గెలిచిన సండ్రకు మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ సంకేతాలు పంపినట్లు చెబుతున్నారు. మంత్రి పదవి విషయలోనే సండ్ర టెంప్ట్ అవుతున్నట్లు టిఆర్ఎస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఇక సండ్ర వెంకట వీరయ్య టిడిపిని వీడి టిఆర్ఎస్ లో చేరుతున్నారన్న సమాచారాన్ని మాజీ ఉస్మానియా జెఎసి నేత, సండ్ర చేతిలో ఓటమిపాలైన పిడమర్తి రవి జీర్ణించుకోలేకపోతున్నారు. సండ్రను ఈ ఎన్నికల్లో మట్టికరిపించాలని ప్రయత్నించిన పిడమర్తి తానే ఓటమిపాలయ్యారు. దీంతో సత్తుపల్లిలో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది. అందుకే సండ్ర వెంకట వీరయ్య పార్టీ మారబోతున్నాడని తెలియగానే పిడమర్తి రవి ఆయనను ఉద్దేశించి బూతు పురాణం అందుకుంటున్నారు. శనివారం పిడమర్తి రవి తీవ్రమైన భాషలో విరుచుకుపడ్డారు.
ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసిఆర్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తిట్టిన కొందరు నాయకులు (సండ్ర ను ఉద్దేశించి) ఇప్పుడు కేసిఆర్ బూట్లు నాకేందుకు రెడీ అయ్యారని ఎద్దేవా చేశారు. సత్తుపల్లిలో జరిగిన టిఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పిడమర్తి ఈ కామెంట్స్ చేశారు. మాటమీద నిలకడ లేనివారు, మాయమాటలు చెప్పేవారు రాజకీయాలను అపహస్యం చేస్తూ టిఆర్ఎస్ లో చేరాలని చూస్తున్నారని విమర్శించారు. అలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు. ఆ నాయకుడు ప్రగతి భవన్ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నాడని ప్రశ్నించారు. ఆయన కప్పుకున్న పార్టీ కండువా రంగు కూడా పోకముందే ఫిరాయించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఇప్పుడు పిడమర్తి రవి కామెంట్స్ టిడిపి, టిఆర్ఎస్ రెండు పార్టీల్లో హాట్ టాపిక్ అయ్యాయి.